Skip to main content

2021- 22 విద్యా సంవత్సరానికి స్కూళ్లు, కాలేజీ ఫీజుల్లో 30 శాతం తగ్గింపు..

సాక్షి, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో గత ఏడాది ఫీజులనే ప్రామాణికంగా తీసుకుని.. అందులో 30 శాతం తగ్గిస్తూ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించింది.
కొత్త ఫీజుల నిర్ణయానికి కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినా.. విద్యాసంస్థల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గత ఏడాది ఫీజులనే వసూలు చేసేలా కమిషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో కోవిడ్ కారణంగా దాదాపు 7 నెలల పాటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీనివల్ల నిర్వహణ ఖర్చులు లేకపోవడం, విద్యార్థులకు బోధన కూడా లేనందున గత ఏడాది ఫీజులో 30 శాతం తగ్గించింది. ఆ మేరకు మాత్రమే విద్యార్థులనుంచి వసూలు చేయాలని కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పును అనుసరించి, ఆపై కమిషన్ తీసుకునే తదుపరి చర్యల ప్రకారం ఫీజులపై తుది నిర్ణయం ఉంటుందని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు పేర్కొన్నారు.

ప్రాంతాలు, ఖర్చులను బట్టి ఫీజులు
ఈ ఏడాది ఫీజులపై నిర్ణయం తీసుకోవడానికి పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వగా.. కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు దానిపై కోర్టును ఆశ్రయించాయి. ఆయా విద్యాసంస్థల వివరాలను నిర్ణీత పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కమిషన్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. స్కూల్ భవనాలు, తరగతులు, సెక్షన్లు, ప్రస్తుత విద్యార్థుల సంఖ్య, వారి నుంచి వసూలు చేస్తున్న ఫీజులు, టీచర్లు, వారికిచ్చే వేతనాలు, ఇతర ఖర్చులకు సంబంధించిన అంశాలను సమర్పించాలని విద్యాసంస్థల యాజమాన్యాలను కమిషన్ కోరింది. వాటి ఆధారంగా ఆయా స్కూళ్లను ర్యాండమ్‌గా తనిఖీ చేసి.. యాజమాన్యాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫీజులు నిర్ణయించాలని భావించింది. విద్యాసంస్థ ఉన్న ప్రాంతం, అక్కడి ప్రజల స్థితిగతులు, నిర్వహణకు అయ్యే వ్యయం తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. అర్బన్, సెమీ అర్బన్, రూరల్, పూర్తిగా వెనుకబడిన ప్రాంతం ఇలా కొన్ని కేటగిరీలుగా విభజించి ఫీజులను నిర్ణయించాలనుకున్నారు. కానీ.. కోవిడ్ పరిస్థితులు, ఫీజులపై సమాచారం ఇచ్చేందుకు యాజమాన్యాలు ముందుకు రాకపోవడం, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో గత ఏడాది ఆయా సంస్థలు వసూలు చేసిన ఫీజులనే ప్రామాణికంగా తీసుకుని.. అందులో 30 శాతం మేర తగ్గించి రానున్న ఐదు నెలల్లో విడతల వారీగా వసూలు చేసుకోవాలని సూచించింది. ఆ ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేయరాదని స్పష్టం చేసింది.
Published date : 12 Nov 2020 04:53PM

Photo Stories