Skip to main content

1.72 లక్షల డ్రాప్‌ఔట్స్‌ తిరిగి బడికి.. !

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత తెలుగుదేశం పాలకుల విధానాలతో మధ్యలోనే చదువు మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ నాడు–నేడు ద్వారా 45వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మారుస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చదువులు సజావుగా సాగించేందుకు అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద సహా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో.. గత సర్కారు హయాంలో చదువులను మధ్యలోనే మానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించేందుకు ప్రస్తుత ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,72,585 మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసినట్లు విద్యాశాఖ గుర్తించింది. వీరిలో బాలురు, బాలికలు దాదాపు సరిసమానంగా ఉన్నారు. తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. రికార్డుల ప్రకారం ఆయా విద్యార్థుల సమాచారాన్ని క్రోడీకరించిన పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు వారిని తిరిగి స్కూళ్లకు తీసుకువచ్చేందుకు కార్యాచరణను రూపొందించారు. విద్యార్థుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి ఆ పిల్లలను చదువుల్లో ముందుకు నడిపించాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటుచేసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ‘మనబడికి పోదాం’ పేరిట వారందరినీ మళ్లీ చదువుల్లో ముందుకు సాగించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈనెల 19 నుంచే ఈ కసరత్తు ప్రారంభమైంది. వివిధ స్థాయిల్లోని వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన సూచనలు, శిక్షణనిచ్చారు. అలాగే, ‘మన బడికి పోదాం’ యాప్‌ నిర్వహణపై తరీ్ఫదు ఇచ్చారు. ఈనెల 31 వరకు బడిబయట పిల్లలపై సర్వే జరుగుతుంది.

ప్రత్యేక కార్యక్రమాలు ఇలా..
కాగా, వివిధ కారణాలతో పాఠశాలలకు దూరమైన పిల్లలకు తిరిగి చదువులు చెప్పించేందుకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తున్నాయి. అవి..
  • సర్వేలో పిల్లల కుటుంబ పరిస్థితి, ఇతర స్థితిగతులను తెలుసుకుని వారిని దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు.
  • వారు ఏ తరగతిలో స్కూలు మానేశారు? ఇప్పుడు వారి వయసు ఎంత? ప్రస్తుతం ఏ తరగతిలో చేర్పించాల్సి ఉంటుంది అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటారు.
  • వీరి చదువులకు మధ్యలో ఆటంకాలు ఏర్పడినందున.. తరగతికి తగ్గ సామర్థ్యాలు ఉండవు కనుక వారికి బ్రిడ్జి కోర్సులు నిర్వహించి అనంతరం వయసుకు తగ్గ తరగతిలో చేర్పిస్తారు. ఇందుకు నాన్‌ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్‌ శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తారు.
  • ఇక తల్లిదండ్రులు, సంరక్షకులు లేక అనాథలుగా మారి రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండులు, ఇతరత్రా చోట్ల ఉంటున్న పిల్లలను స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష నిర్వహిస్తున్న పట్టణ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చేర్పిస్తారు. అనంతరం రెగ్యులర్‌ స్కూళ్లకు పంపిస్తారు.
  • స్కూళ్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోని పిల్లలు సమీపంలోని వేరే స్కూలుకు వెళ్లేందుకు వీలుగా ట్రా¯న్స్‌పోర్టు అలవెన్సును అందిస్తారు.
  • ఇక ఉపాధి కోసం వలసలు వెళ్లే వారి పిల్లల కోసం వారివారి తల్లిదండ్రులు వచ్చేవరకు సీజనల్‌ హాస్టళ్లను ఏర్పాటుచేస్తున్నారు. అలా కాకుండా తల్లిదండ్రులతో పాటు వెళ్లిపోయే పిల్లలు తాము ఉంటున్న ప్రాంతాల్లోనే చదువుకొంటామంటే వారికోసం అక్కడ ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటుచేసే అవకాశముంది.
  • అలాగే, కరువు కాటకాలు, ఇతర విపత్తులవల్ల పిల్లల చదువులను మధ్యలో మాన్పించేసి ఉంటే వారికోసం స్పెషల్‌ స్కూళ్లు ఏర్పాటుచేస్తారు.
  • సముద్రంలో నెలల తరబడి చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల పిల్లల కోసం కూడా సమగ్ర శిక్ష ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటుచేస్తోంది.

జిల్లాల వారీగా చదువులు మానేసిన పిల్లల సంఖ్య ఇలా..

జిల్లా

బాలికలు

బాలురు

మొత్తం

అనంతపురం

6,054

6,055

12,109

కడప

5,135

5,137

10,272

తూ.గోదావరి

10,596

10,593

21,189

చిత్తూరు

4,623

4,624

9,247

గుంటూరు

10,582

10,590

21,172

కర్నూలు

8,827

8,830

17,657

నెల్లూరు

6,209

6,213

12,422

శ్రీకాకుళం

2,702

2,700

5,402

విశాఖపట్నం

7,781

7,783

15,564

కృష్ణా

7,527

7,533

15,060

విజయనగరం

2,580

2,583

5,163

ప్రకాశం

6,689

6,701

13,390

ప.గోదావరి

6,971

6,967

13,938

మొత్తం

86,276

86,309

1,72,585

Published date : 31 Mar 2021 04:37PM

Photo Stories