15 కాలేజీల్లో మాత్రమే జగనన్న వసతిదీవెన, విద్యాదీవెనలను నిలిపివేశాం: ఆదిమూలపు సురేష్
Sakshi Education
మార్కాపురం: పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ద్వారా 34,37,890 మంది విద్యార్థులకు రూ.5,321 కోట్లు చెల్లించి నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఒంగోలు క్విస్ కాలేజీ విద్యార్థిని తేజ స్విని ఆత్మహత్య ఘటన దురదృష్టకరమని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై విచారణకు ప్రొఫెసర్లు ఏసురత్నం, స్వర్ణకుమార్, స్వరూపరాణితో త్రిసభ్య కమిటీ నియమించామని తెలిపారు. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందేనన్నా రు. మొత్తం 484 ఇంజినీరింగ్ కాలేజీల్లో 15 యాజమాన్యాలు మాత్రమే ఫీజుల పెంపు కోసం కోర్టుకు వెళ్లాయని వివరించారు. వాటికి మినహాయించి మిగిలిన అన్ని కాలేజీల్లో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనను అమలు చేశామన్నారు. ఈ 15 కాలేజీలు కూడా మళ్లీ తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని కోరుతున్నాయని చెప్పారు. వాటికి రూ.247 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. అందులో క్విస్ కాలేజీతో పాటు మరికొన్ని కాలేజీలున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైందని.. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించిన బకాయిలు ఈ నెలలో చెల్లిస్తామని మంత్రి సురేష్ చెప్పారు. ఈ విషయాలను పక్కన పెట్టి.. ప్రభుత్వంపై క్విస్ యాజమాన్యం తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.
Published date : 09 Feb 2021 03:54PM