Skip to main content

సమాజ శ్రేయస్సుకు కీలకం పరిశోధనలు

ఏళ్లతరబడి చదువులు.. డిగ్రీలు.. సర్టిఫికెట్లు.. అంతిమంగా కెరీర్ సెటిల్‌మెంట్, ఆదాయాన్వేషణ కోసం అనేది నిస్సందేహం. కానీ యువత కొంత విస్తృత దృష్టితో ఆలోచించి.. దీర్ఘకాలంలో సుస్థిర భవిష్యత్తుకు, మున్ముందు తరాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు మార్గం చూపే పరిశోధనల దిశగా అడుగులు వేస్తే సంపాదనతోపాటు సమాజ శ్రేయస్సు.. ఈ రెండింటికీ దోహదపడిన వారిగా నిలిచిపోతారు.. అంటూ.. ‘ప్రస్తుతం దేశంలో పరిశోధనల ప్రాముఖ్యం, వాటి ఆవశ్యకతను తెలియజేస్తున్న’యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రామకృష్ణన్ రామస్వామితో ఇంటర్వ్యూ..

ఉన్నత చదువుల దిశగా:
కెరీర్ పరంగా ఆలోచిస్తే ప్రస్తుతం ఏ కోర్సు పూర్తి చేసినా ఆదాయ మార్గాలకు కొదవ లేదు. క్రేజీగా భావించే ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ మొదలు లాంగ్వేజ్ కోర్సుల వరకు దేనికైనా అవకాశాలు లభిస్తున్నాయి. అయితే ఆ అవకాశాల పరిధి విషయంలోనే విద్యార్థులు విశాల దృక్పథంతో అడుగులు వేయాలి. బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్‌తోనే స్వల్పకాలిక ప్రయోజనాలకు పరిమితం కాకుండా కొంచెం ఆలస్యమైనా ఉన్నత చదువులు, పరిశోధనల దిశగా దృష్టి సారించాలి.

ముందస్తు ప్రణాళికతో:
ఇది కొంతవరకు వాస్తవమే. ముఖ్యంగా రూ. వేలు, లక్షల్లో ఫీజులు ఉన్న ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ అభ్యర్థుల్లో ఈ అభిప్రాయం మరికాస్త ఎక్కువే. అందుకే చాలామంది అవకాశం లభిస్తే బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ అలా కాకుండా.. బ్యాచిలర్ డిగ్రీలో చేరేముందే ముందస్తు ప్రణాళికతో పీహెచ్‌డీ దిశగా ఆలోచిస్తే.. కెరీర్‌లో స్థిరపడటంలో జాప్యం లేకుండానే సముచిత సమయంలోనే పీహెచ్‌డీ పూర్తి చేసుకోవచ్చు.

హెచ్‌సీయూలో పరిశోధనలకు ప్రాధాన్యం:
ఈ యూనివర్సిటీలో పరిశోధనలకు ఎంతగానో ప్రాధాన్యమిస్తున్నాం. యూనివర్సిటీ కరిక్యులం, బోధన విధానమే రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఫ్యాకల్టీ 401 మంది ఉంటే.. పీహెచ్‌డీ అభ్యర్థులు 1628 మంది ఉన్నారు. అంటే దాదాపు 1:4 నిష్పత్తిలో పీహెచ్‌డీ కోర్సులు సాగుతున్నారు. మరో విషయం.. ఇవి కేవలం సైన్స్, ఇంజనీరింగ్‌లకే పరిమితం కాలేదు. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, లాంగ్వేజెస్‌లోనూ సాగుతున్నాయి. దాదాపు రూ. 130 కోట్ల వ్యయ అంచనాలు కలిగిన పలు రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 20 పరిశోధనల ఆవిష్కరణలకు సంబంధించిన పేటెంట్ల కోసం భారత్, యూరప్, యు.ఎస్.లలో దరఖాస్తు చేశాం. వీటిలో ఎనిమిదింటికి ఆమోదం కూడా లభించింది. మేం పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం ఇది.

యూజీసీ నుంచి నిధులు:
నిర్దిష్ట పరిశోధనలకు నిర్దేశిత మొత్తం అనే పద్ధతి కాకుండా.. ప్రతి ఏటా యూజీసీ నుంచి నిధులు లభిస్తాయి. అదేవిధంగా పంచవర్ష ప్రణాళికల్లోనూ కొంత మొత్తాలు కేటాయిస్తారు. ఈ క్రమంలో 11వ పంచవర్ష ప్రణాళికలో రూ. 220 కోట్లు కేటాయించారు. ఇటీవలే ఆమోదం పొందిన 12వ పంచవర్ష ప్రణాళికలో ఇంకా కేటాయించిన మొత్తాల వివరాలు తెలియాల్సి ఉంది.

యువతను ప్రోత్సహించాలి:
అవకాశాల గురించి చెప్పి.. ప్రోత్సహించడమే ప్రధాన సాధనం. ఓ చిన్న ఉదాహరణ.. సాధారణంగా 17, 18 ఏళ్ల వయసులో ఉన్న యువకులు మోటర్ సైకిల్ రైడింగ్ అంటే ఆసక్తి చూపుతారు. ఇంట్లో వారికి తెలియకుండా అందులో నైపుణ్యానికి ప్రయత్నిస్తారు. దీన్ని పేరెంట్స్ గుర్తించి శిక్షణ ఇప్పిస్తే ప్రమాదాలు లేకుండా మోటర్ సైకిల్ రైడింగ్‌లో రాణించగలుగుతారు. దీన్నే పరిశోధనల దిశగా ప్రోత్సహించడంలోనూ అన్వయించొచ్చు. పేరెంట్స్ కూడా కేవలం కెరీర్ సెటిల్‌మెంట్ అనే కోణంలో ఆలోచించకుండా సుదీర్ఘ, సుస్థిర భవిష్యత్తు దిశగా తమ పిల్లలను నడిపించాలి.

ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు ప్రాధాన్యం:
దీనికి సమాధానం కూడా.. పరోక్షంగా పరిశోధనలే. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం కోర్సు ఉత్తీర్ణత. ఆ సమయానికి మానసికంగా పరిపక్వత లభించే వయసులో ఉంటారు. ఈ సమయంలో సరైన మార్గ నిర్దేశనం చేస్తే భవిష్యత్తు సక్రమ మార్గంలో పయనిస్తుంది. ఇక... కోర్సుల పరంగా చెప్పాలంటే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో కూడా రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా బోధన సాగిస్తున్నాం. ఈ విద్యార్థులను నాలుగో ఏడాది నుంచే కొన్ని చిన్నపాటి ప్రాజెక్టుల్లో మమేకం చేస్తున్నాం. ఫలితంగా వారికి పరిశోధనలంటే ఆసక్తి లభిస్తుంది. ఇది భవిష్యత్తులో వ్యక్తిగతంగా, సామాజికంగా ఎంతో మేలు చేస్తుంది.

వినూత్న బోధన:
కేవలం పీహెచ్‌డీయే కాకుండా.. ఇంటిగ్రేటెడ్ పీజీ స్థాయి నుంచే వినూత్నంగా బోధన పద్ధతులు అనుసరిస్తున్నాం. పాఠం బోధించే టీచర్‌కు, వినే విద్యార్థికి అనుకూలంగా ఉండే విధంగా 1:13.5 నిష్పత్తిలో టీచర్, స్టూడెంట్ నిష్పత్తిలో బోధన సాగుతోంది. దీనివల్ల పాఠం వినే విద్యార్థి ఎలాంటి విసుగులేకుండా టీచర్ చెప్పిన అంశాన్ని తరగతి గదిలోనే తొంభై శాతం అవగతం చేసుకునే వీలుంటుంది. అందుకే.. మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఆయా క్లాసుల్లో మొత్తం సీట్లను రెండంకెలు మించకుండా ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఎప్పటికప్పుడు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆయా కోర్సులు ప్రారంభిస్తున్నాం. ఈ క్రమంలో హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రారంభించాం.

అన్ని రంగాల్లో మంచి భవిష్యత్తు:
కెమికల్ సైన్స్, ఇంజనీరింగ్ ఇలా.. భవిష్యత్తు పరంగా ఒకదాన్ని మరో రంగంతో పోల్చలేం. ప్రస్తుత అవసరాల దృష్ట్యా అన్ని రంగాలకు భవిష్యత్తు బాగుంటుంది. లాంగ్వేజ్ కోర్సులు కూడా ఆకర్షణీయంగా మారుతున్న రోజులివి. లాంగ్వేజ్ కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా సాఫ్ట్‌వేర్ సంస్థల్లో అవకాశాల లభిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకునే బాధ్యత యువతదే.

95 శాతం ప్లేస్‌మెంట్స్:
ప్లేస్‌మెంట్స్ విషయంలోనూ హెదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందంజలో ఉంది. గత ఏడాది 95 శాతం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభించాయి. సింగపూర్‌కు చెందిన వర్క్స్ అప్లికేషన్ అనే సంస్థ గరిష్టంగా రూ. 35 లక్షల వార్షిక వేతనంతో ఎంబీఏ విద్యార్థిని నియమించింది. అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 11 లక్షల వార్షిక వేతనంతో ఎకనామిక్స్ అభ్యర్థిని ఎంపిక చేసింది. ఇలా.. సగటున రూ. 8 లక్షల వార్షిక వేతనాలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే టీసీఎస్, కేవియన్ నెట్‌వర్క్, హెచ్‌ఎస్‌బీసీ, కాల్గెట్ వంటి సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ పూర్తి చేసి రూ. 3.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వార్షిక వేతనాన్ని అందించాయి. ఇంకా మరెన్నో సంస్థలు ఈ నెలలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహించనున్నాయి.

యువతకు సలహా:
ఆసక్తితో ఎంచుకున్నా, మరే కారణంతో చేరినా.. అడుగుపెట్టిన కోర్సును అంకితభావం, నిబద్ధతతో అధ్యయనం చేసి పట్టు సాధిస్తే కచ్చితంగా సత్ఫలితాలు లభిస్తాయి. ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నప్పటికీ.. ఒక్క క్షణం కూడా అనాసక్తతకు గురి కాకూడదు. అప్పుడే ఆ సబ్జెక్ట్‌లో నిష్ణాతులై సుస్థిర భవితకు మార్గం సుగమం అవుతుంది.
Published date : 22 Jan 2013 01:54PM

Photo Stories