Skip to main content

మల్టి డిసిప్లినరీ పరిశోధనలతో.. మరిన్ని ప్రయోజనాలు

పరిశోధనలు పెరగాలి.. మరిన్ని ఆవిష్కరణలు జరగాలి.. ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న మాటలు. సమాజ అభివృద్ధికి పరిశోధనలే కీలకమని విద్యావేత్తల అభిప్రాయం. మల్టి డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలతో మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు ప్రఖ్యాత పరిశోధన సంస్థ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్), హైదరాబాద్ సెంటర్ డెరైక్టర్ ప్రొఫెసర్ శ్రీరామ్ రామస్వామి. ప్రస్తుత దేశ సామాజిక అవసరాల దృష్ట్యా సైన్స్ విభాగాలే కాకుండా.. ఆర్ట్స్, సోషల్ సెన్సైస్‌లోనూ పరిశోధనలు పెరగాల్సిన అవసరం ఎంతో ఉందంటున్న రామస్వామితో ఇంటర్వ్యూ..

అవసరం ఎంతో.. కానీ!
పపంచీకరణ, పెరిగిన పోటీతత్వం, మరోవైపు సామాజిక శ్రేయస్సు దృష్ట్యా ప్రస్తుతం దేశంలో పరిశోధనల అవసరం ఎంతగానో ఉంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆర్ అండ్ డీ విషయంలో దేశం కొంత ముందంజలోనే ఉంది. అయితే, వందకోట్లకుపైగా జనాభా కలిగిన దేశంలో పూర్తిస్థాయి అవసరాలు తీర్చేలా పరిశోధనల లక్ష్యాన్ని చేరుకోవడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. కేవలం ఉన్నత స్థాయిలోనే కాకుండా పాఠశాల స్థాయి నుంచే పరిశోధనల దిశగా పునాదులు పడాలి.

అన్ని రంగాల్లోనూ:
పస్తుత దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే.. ఇంజనీరింగ్, ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సంబంధిత అంశాలు, ఎకనామిక్స్, హిస్టరీ, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్.. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ బేసిక్ రీసెర్చ్‌కు ఊతమివ్వడంతోపాటు వాటి మనుగడ, విస్తరణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు జాతీయ ప్రాథమ్యాల కోణంలో.. నీరు, శక్తి, వ్యవసాయం, పర్యావరణం, వాతావరణం, ఆరోగ్యం తదితర రంగాల్లో పరిశోధనలు మరింత పెరగాలి. ఆ పరిశోధనలు కూడా వాస్తవ సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ఉండాలి.

మల్టి డిసిప్లినరీ.. ఇంటర్ డిసిప్లినరీ:
పరిశోధనలు కూడా బహుళ రంగాల సమ్మిళితంగా(మల్టి డిసిప్లినరీ), అంతర్గత సంబంధమున్న అంశాల సమ్మేళనంగా(ఇంటర్ డిసిప్లినరీ) ఉంటే మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఉదాహరణకు మెకనోబయాలజీ విభాగాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. యాంత్రిక శక్తిలోని అంతర్గత అంశాలతోపాటు జీవశాస్త్రంలోని కణాలు, పొరలు, జీవులకు సంబంధించి బయోకెమిస్ట్రీలోని కీలక ప్రక్రియల గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మెటీరియల్ సైన్స్.. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అంశాల సమ్మేళనంతో సాగుతుంది. ఫలితంగా ఒకే సమయంలో పలు అంశాల్లోని సమస్యలకు పరిష్కారం కనుగొనే వీలు, పరిశోధనలకు నిజమైన సార్థకత లభిస్తాయి. టీఐఎఫ్‌ఆర్‌లో ఇదే తరహాలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.

పాఠశాల స్థాయి నుంచే:
పరిశోధనల పరంగా ప్రస్తుత పరిస్థితికి కారణం.. ప్రైమరీ, సెకండరీ విద్యా విధానాలే. ఈ రెండు స్థాయిల్లో ఏకీకృత విధానం అమలు కావట్లేదు. పాఠశాల విద్యను పూర్తిచేసుకున్న కొద్దిమంది విద్యార్థుల్లో మాత్రమే తదుపరి దశకు అవసరమైన నైపుణ్యాలు ఉంటున్నాయి. అదే విధంగా ఫస్ట్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారిలో అతికొద్దిమంది విద్యార్థులు మాత్రమే భవిష్యత్తులో పరిశోధనలకు అవసరమైన లక్షణాలు సొంతం చేసుకుంటున్నారు. చివరకు ఇది మన యూనివర్సిటీల్లో పరిశోధన నైపుణ్యంగల యువత కొరతకు, పరిశోధనలు తగ్గడానికి దారితీస్తోంది. ఈ సమస్య కేవలం సైన్స్ రంగానికే పరిమితం కాలేదు. ఎకనామిక్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్.. ఇలా అన్నిటా విస్తరించింది. దీనికి పరిష్కారంగా విద్యార్థులను పరిశోధనల దిశగా నడిపేందుకు పాఠశాల స్థాయి నుంచే ఉపక్రమించాలి. ప్రస్తుతమున్న ఇన్‌స్పైర్ తరహా సైన్స్ ఎగ్జిబిషన్స్, ఇతర సైన్స్ క్యాంప్‌లను గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలి. వాటిని విస్తృతంగా నిర్వహించాలి. మరోవైపు గ్రాడ్యుయేట్ స్థాయిలో సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ద్వారా పరిశోధనశాలల్లో పాల్పంచుకునేలా చేయాలి. ఇప్పటికే దేశంలోని మూడు సైన్స్ అకాడమీలు(ఇండియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్) రెండు నెలల వ్యవధి గల సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను అందిస్తున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు దీన్ని అందిపుచ్చుకోవాలి.

బోధన, మూల్యాంకనం ‘ప్రాక్టికల్’గా మారితేనే:
పరిశోధనల దిశగా ముందడుగుపడాలంటే.. ప్రస్తుత బోధన, అదే విధంగా మూల్యాంకన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠ్యపుస్తకంలోని అంశాలనే విద్యార్థులకు యథాతథంగా బోధించడానికి బదులు.. సదరు అంశంపై వాస్తవ పరిశీలన, ప్రాక్టికాలిటీ బేస్డ్ టీచింగ్‌ను అమలు చేయాలి. తద్వారా కింది స్థాయి నుంచే పరిశోధనల పట్ల ఆసక్తి కలుగుతుంది. అప్పుడే ఔత్సాహికులను తీర్చిదిద్దడం సాధ్యపడుతుంది. ఇటీవల కాలంలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఈ తరహా దృక్పథం కనిపించడం ఆహ్వానించదగిన పరిణామం. కానీ మెమరీ బేస్డ్ విధానంలో జరుగుతున్న ప్రస్తుత పోటీ పరీక్షల నేపథ్యంలో.. విద్యార్థులు ఇలాంటి ప్రాక్టికాలిటీని అలవర్చుకోవడం కొంత కష్టమైన విషయమే. కాబట్టి.. నా అభిప్రాయంలో ముందుగా సిలబస్‌లో మార్పులు చేయాలి. వాస్తవ అవసరాలకు అనుగుణమైన అంశాలతోనే రూపొందించాలి. ఫలితంగా విద్యార్థి ప్రాక్టికల్ అప్రోచ్‌తో చదివి అనుభవపూర్వక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంటాడు.

రాష్ట్రస్థాయి వర్సిటీల్లో రీసెర్చ్ పెరగాలంటే:
పరిశోధన అనేది విభిన్న కోణాల్లో విస్తృత పరిధి గల అంశం. ఈ వాతావరణాన్ని కల్పించాలంటే.. సరిపడ మౌలిక సదుపాయాలు, అత్యున్నత నైపుణ్యం గల మానవ వనరులు ఉండాలి. దాంతోపాటు క్లాస్ రూం టీచింగ్‌కు అదనంగా రీసెర్చ్ కోసం తగినంత సమయం కేటాయించగల వెసులుబాటు ఉండాలి. స్థూలంగా చెప్పాలంటే.. అత్యున్నత ప్రమాణాలు, అకడమిక్‌గా, పరిపాలన పరంగా ఎలాంటి రాజకీయ జోక్యంలేని పరిస్థితి అవసరం. యూనివర్సిటీల్లో ఈ తరహా చర్యలు చేపడితే పరిశోధనలు మెరుగవుతాయి.

‘ఆలస్యం’.. అపోహే:
పీహెచ్‌డీలో చేరడమంటే సుదీర్ఘ కాల ప్రక్రియ అనేది విద్యార్థుల్లో నెలకొన్న అపోహ మాత్రమే. ఎందుకంటే.. నిజమైన ఆసక్తితో పీహెచ్‌డీలో అడుగుపెడితే నిర్ణీత సమయంలోనే పూర్తి చేయొచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మంచి మౌలిక సదుపాయాలు ఉన్న కాలేజీలో చేరి శిక్షణ పొందడం పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో సులభ ప్రవేశానికి స్వల్ప వ్యవధిలో పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. ప్రస్తుతం అందిస్తున్న పీహెచ్‌డీ స్టైఫండ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటోంది. ఆ స్టైఫండ్ ఒక విద్యార్థి తన పరిశోధన అవసరాలు తీర్చుకోవడంతోపాటు కొంత ఇంటికి పంపే స్థాయిలో ఉన్నాయంటే పీహెచ్‌డీకి ఇస్తున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు.

సరైన సమయమిదే:
పరిశోధన ఔత్సాహికులు ఈ దిశగా అడుగులు వేయడానికి సరైన సమయమిదే. పరిశోధన నిధులు పుష్కలంగా ఉన్నాయి. ప్రోత్సాహకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ అండ్ డీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల కారణంగా.. దేశవ్యాప్తంగా పరిశోధనల సంస్కృతి క్రమేణా విస్తరిస్తోంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

ఆ నాలుగు లక్షణాలు.. ముఖ్య సాధనాలు:
పీహెచ్‌డీ ఔత్సాహికులకు ప్రధానంగా నాలుగు లక్షణాలు ఉండాలి. అవి.. జ్ఞానం, స్వీయ ఆలోచన నైపుణ్యం, ఉత్సుకత, కష్టపడి పనిచేసే తత్వం. మరో విషయం నిరుత్సాహం అనే పదాన్ని దరి చేరనీయకూడదు. కొన్ని నెలల ప్రయోగాల తర్వాత సత్ఫలితాలు వచ్చినా, రాకపోయినా తట్టుకునే దృక్పథం కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా.. ఇతరులు మిగిల్చిన సమస్యను తీసుకోకుండా.. సొంతంగా ఆవిష్కరించాలనే కోరిక బలంగా ఉంటే భవిష్యత్తులో ఇక తిరుగుండదు. అలాంటి అభ్యర్థులే పరిశోధన రంగంలో అడుగుపెట్టడం అభిలషణీయం.

టీఐఎఫ్‌ఆర్,హైదరాబాద్‌లో ప్రవేశం పొందాలంటే:
ముంబై ప్రధాన కేంద్రంగా డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా పొందిన టీఐఎఫ్‌ఆర్ బెంగళూరు, పుణే, హైదరాబాద్‌లలో రీసెర్చ్ సెంటర్లు ప్రారంభించి గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్ పేరుతో పలు కోర్సులను అందిస్తోంది.

మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్ అప్లికేషన్స్, సైన్స్ ఎడ్యుకేషన్ రంగాల్లో పీహెచ్‌డీ(అయిదేళ్లు), ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ(ఆరేళ్లు), ఎమ్మెస్సీ(మూడేళ్లు) కోర్సులను ఆఫర్ చేస్తోంది.

ఈ క్రమంలో హైదరాబాద్ సెంటర్‌లో పలు కోర్సులను అందిస్తోంది. అవి..
  • ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ,
  • ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ,
  • కెమిస్ట్రీలో పీహెచ్‌డీ,
  • బయాలజీలో పీహెచ్‌డీ,
  • ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ.
అర్హత:
  • ఆయా కోర్సులకు అకడమిక్ అర్హత ప్రమాణాలను ఆయా సెంటర్లకు వేర్వేరుగా నిర్దేశించింది. ఏ సెంటర్‌లో ప్రవేశం కోరుకునే విద్యార్థులైనా టీఐఎఫ్‌ఆర్ ప్రతి ఏటా ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ స్కూల్ నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో అర్హత సాధించాలి.
  • మిడ్ టర్మ్ ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు గ్రాడ్యుయేట్ స్కూల్ నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణతతోపాటు 90కిపైగా పర్సంటైల్‌తో గేట్, జెస్ట్ స్కోర్లు ఉండాలి. దీంతోపాటు యూజీసీ నెట్ ఫెలోషిప్‌నకు అర్హత సాధించి ఉండాలి.
  • దరఖాస్తులు, సీట్ల లభ్యత ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా ప్రకటిస్తారు.
  • రెగ్యులర్ గ్రాడ్యుయేట్ స్కూల్ తరగతులు మే/జూన్‌లో, మిడ్ టర్మ్ ప్రవేశాల తరగతులు జనవరిలో మొదలవుతాయి.
సెప్టెంబర్/అక్టోబర్‌లో నోటిఫికేషన్:
గ్రాడ్యుయేట్ స్కూల్ నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు ప్రతిఏటా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రకటన వెలువడుతుంది. పరీక్ష డిసెంబర్‌లో నిర్వహిస్తారు. ఫలితాలు జనవరిలో ప్రకటిస్తారు. ఇంటర్వ్యూ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. మిడ్ టర్మ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఏడాది చివర్లో వెలువడుతుంది.

వెబ్‌సైట్: www.tifrh.res.in/tcis/student.html , www.tifrh.res.in
Published date : 22 Aug 2013 04:50PM

Photo Stories