Skip to main content

జాబ్ ఇంటర్వ్యూలో అడిగే ఐదు కష్టమైనప్రశ్నలు

ఉద్యోగ సాధనలో రాత పరీక్ష తర్వాత దశ.. ఇంటర్వ్యూను ఎదుర్కోవడం. ఈ దశను విజయవంతంగా దాటితే నేరుగా కొలువులోకి అడుగు పెట్టొచ్చు. రాత పరీక్షలో మంచి ప్రతిభ చూపినప్పటికీ మౌఖిక పరీక్షల్లో విఫలమవుతున్నవారెందరో ఉన్నారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటే వ్యక్తిత్వాన్ని, సమయస్ఫూర్తిని, మాటతీరును, శరీర భాషను ఎక్కువ పరీక్షిస్తారు. అతడిలో ఉద్యోగానికి అవసరమైన లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసు కుంటారు. ఇందుకోసం రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. సరిగా సమాధానాలు చెప్పి ఇంటర్వ్యూ బోర్డును మెప్పిస్తే ఉద్యోగం దక్కుతుంది. ఇంటర్వ్యూల్లో సాధారణంగా ఐదు క్లిష్టమైన ప్రశ్నలు వేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థులు వీటికి సరైన సమాధానాలు ఇస్తే రిక్రూటర్ల మనసును గెలుచుకోవచ్చని సూచిస్తున్నారు.

మీ మాజీ యజమానికి మీరిచ్చే సలహా?
జాబ్ ఇంటర్వ్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నల్లో ఇదే అత్యంత క్లిష్టమైంది. ఈ ప్రశ్న అడగ్గానే చాలా మంది అభ్యర్థులు వెనుకాముందు ఆలోచించకుండా చెలరేగిపోతుంటారు. మాజీ యజమాని గురించి ఉన్నవీ లేనివీ కల్పించి చెబుతుంటారు. కానీ, ఇది తెలివైన అభ్యర్థుల లక్షణం కాదు. పాత యాజమాన్యం గురించి ప్రతికూలంగా చెప్పడాని్న ఎవరూ హర్షించరు. కాబట్టి పాత సంస్థల్లో యాజమాన్యం వల్ల మీరు ఎదుర్కొన్న కష్టాల గురించి ఇంటర్వ్యూలో చెప్పడం అనవసరం. మీరిచ్చే సమాధానం ప్రొఫెషనల్గా ఉండేలా జాగ్రత్తపడండి. నెగటివ్గా మాట్లాడకపోవడమే మంచిది.

ఉద్యోగం మీకే ఎందుకివ్వాలి?
ఈ ప్రశ్న అడిగితే రిక్రూటర్పై కోపం తెచ్చుకోవద్దు. సహనం కోల్పోవద్దు. మీ అర్హతలను, నైపుణ్యాలను, అనుభవాలను వివరించాలి. ఉద్యోగానికి తాను సరిగ్గా సరిపోతానని స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజేయాలి. యాజమాన్యం అంచనాల మేరకు తాను పనిచేస్తానని, ఆశించిన ఫలితాలను సాధిస్తానని చెప్పాలి.

మా సంస్థలో మార్పులు సూచిస్తారా?
దీనికి నోటికొచ్చిన సమాధానం చెబితే.. అభ్యర్థి ఆవేశపరుడని, ఓపిక లేని వ్యక్తి అని ఇంటర్వ్యూ బోర్డు భావించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఇంటర్వ్యూకు హాజరుకావడాని కంటే ముందే ఆ సంస్థ గురించి తెలుసుకోవాలి. దాని విధానాల గురించి అధ్యయనం చేయాలి. ఇంటర్వ్యూలో మీరిచ్చే సమాధానం నిర్మాణాత్మకంగా ఉండాలి. సంస్థకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలియదు. దానిలో మార్పుల గురించి మీరు వివరణాత్మకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఉద్యోగం రాకపోతే ఏం చేస్తారు?
రాకపోతే ఏం చేయాలనే దానిపై మీకు ఒక ప్రణాళిక ఉండొచ్చు. దాన్ని అలాగే ఉండనివ్వండి. ఇంటర్వ్యూలో మాత్రం బయటపెట్టకండి. మీ సంస్థలో పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలపండి. మీకున్న ఆసక్తిని వెల్లడించండి. ప్రస్తుతం ఈ ఉద్యోగంపైనే దృష్టి పెట్టానని, ఇది రాకపోతేనే మరో విషయం ఆలోచిస్తానని స్పష్టం చేయండి.

మీ శత్రువు మీ గురించి ఏం చెబుతాడు?
ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పాలి అనే దానికంటే ఎలాంటి సమాధానం చెప్పకూడదు అనే విషయం తెలిసి ఉండాలి. నా శత్రువు నా గురించి చెప్పడానికేమీ లేదు అంటే.. మీకు అహంకారం ఉన్నట్లు ఇంటర్వ్యూ బోర్డు భావిస్తుంది. శత్రువు మనసులోని మాట మీకు తెలియదు కదా! కనుక ఇంటర్వ్యూలో సానుకూలమైన భావాన్నిచ్చే ప్రతికూలమైన మాట ఏదైనా చెప్పొచ్చు. మౌఖిక పరీక్ష నిర్వహించేది అభ్యర్థిని ఉద్యోగంలో చేర్చుకోవాలనే సదుద్దేశంతోనే. కాబట్టి అక్కడ మీకు నష్టం చేకూర్చే మాటలు మాట్లాడొద్దు. ప్రతిమాటను ఆచితూచి మాట్లాడండి. కోరుకున్న కొలువును సాధించండి.
Published date : 27 Jul 2014 03:03PM

Photo Stories