Skip to main content

ఈ-కామర్స్... ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్

ఈ-కామర్స్.. ఆన్‌లైన్ విధానంలో ఆయా వస్తువుల క్రయవిక్రయాలు సాగించే విభాగం. కొద్దిగా సాంకేతిక నైపుణ్యాలు, మార్కెటింగ్ చాతుర్యం ఉంటే.. ఈ-కామర్స్‌లో కొత్త స్టార్ట్-అప్స్‌తో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కోణంలోనూ తక్కువ ఖర్చుతో స్టార్ట్-అప్‌ను సుగమం చేసేది ఈ-కామర్స్ అంటున్నారు ప్రముఖ ఆన్‌లైన్ బిజినెస్ పోర్టల్ ఇ-బే ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ లతీఫ్ నతానీ. దేశంలో ఆన్‌లైన్ క్రయవిక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలపై లతీఫ్ నతానీతో ప్రత్యేక ఇంటర్వ్యూ...

దేశంలో ప్రస్తుతం ఈ-కామర్స్ రంగం ఎలా పయనిస్తోంది?
ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ వంటి సదుపాయాలతో దేశంలో ఈ-కామర్స్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రతి నెలా సగటున మూడు కోట్ల మంది ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారనే గణాంకాలే ఇందు కు నిదర్శనం. ఇటీవల ‘ఫొరెస్టర్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం- 2014 నాటికి 60శాతం వృద్ధితో 3.2 బిలియన్ డాలర్ల వృద్ధి రేటును సాధించనుందని అంచనా.

స్టార్ట్-అప్స్ పరంగా ఈ-కామర్స్ రంగంలో అవకాశాలు?
ఆన్‌లైన్ షాపింగ్ కార్యకలాపాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో.. అంతే స్థాయిలో కొత్త సంస్థల ఏర్పాటుకు కూడా అనేక అవకాశాలున్నాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా కేవలం సంస్థ నిర్వాహకులకే కాకుండా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చేతి వృత్తుల వారికి, అదేవిధంగా తాము తయారు చేసిన వస్తువుల విక్రయ మార్గాలపై అవగాహన లేని వారికి ఆన్‌లైన్ బిజినెస్ పోర్టల్స్ ఎంతో సహకరిస్తున్నాయి. అమ్మకందార్లు-కొనుగోలుదార్లకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ ఇద్దరికీ లాభదాయకంగా ఉండేలా సేవలు అందిస్తున్నాయి.

ఈ-కామర్స్ విభాగంలో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించాలంటే.. ప్రత్యేక స్కిల్స్ అవసరమా? ఈ-బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు ఎంత మేరకు ఉపయోగం?
వాస్తవానికి ఈ-కామర్స్ వ్యాపార రంగంలో ప్రవేశించాలనుకునేవారికి ఎలాంటి అకడెమిక్ నైపుణ్యాలు అవసరం లేదు. సాంకేతిక నైపుణ్యం, కొనుగోలుదారులు, అమ్మకందార్లను గుర్తించి వారికి తమ ఆన్‌లైన్ ట్రేడింగ్ పోర్టల్ అనుకూలం అనే విధంగా వ్యవహరిస్తే విజయం సాధించినట్లే. ఈ-బిజినెస్‌కు సంబంధించిన అవగాహన ఈ-బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుల ద్వారా పొందొచ్చు.

ఈ-కామర్స్ నైపుణ్యాలు అందించడంలో ఈ-బే ఇండియా తీసుకుంటున్న చర్యలు?
స్పీక్‌వెల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల సహకారంతో ‘ఈ-ప్రో’ పేరుతో సర్టిఫికేషన్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా.. ఈ-కామర్స్ నేపథ్యం, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్, ఆన్‌లైన్ సెల్లింగ్, ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ తదితర అంశాలపై నైపుణ్యాలు కల్పించేలా శిక్షణనిస్తున్నాం. దీంతోపాటు మా సంస్థలో సెల్లర్స్‌గా ఉన్న వారికి భాషా నైపుణ్యాలు అందించేందుకు ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గుజరాతీ, తమిళం, కన్నడ భాషల్లో ప్రావీణ్యం పొందేలా ఆన్‌లైన్ లెర్నింగ్ మాడ్యూల్స్‌ను కూడా అందిస్తున్నాం.

మన దేశంలో కొత్త స్టార్ట్-అప్స్ విషయంలో సవాళ్లు, సమస్యలపై మీ అభిప్రాయం?
ప్రస్తుతం మన దేశంలో ఆహ్వానించదగిన పరిణామం.. యువత స్టార్ట్-అప్స్ దిశగా ఆలోచించడం. ఈ క్రమంలో ఎన్నో వెంచర్స్ ఆవిష్కృతమవుతున్నాయి. ఇదే సమయంలో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు.. నిర్దిష్ట బడ్జెట్‌లో మౌలిక సదుపాయలు ఏర్పాటు చేసుకోవడం. అంతేకాకుండా.. సదరు ఉత్పత్తికి సంబంధించి భారీ స్థాయిలో ఉండే లక్షిత వినియోగదారులను చేరేందుకు అవసరమైన మార్కెటింగ్ వ్యూహాలు. ఈ రెండు అంశాలు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. వీటికి పరిష్కారం ఆర్థిక వనరుల సమీకరణ.

ఈ-కామర్స్‌తో పోల్చితే ఉత్పత్తి రంగంలో స్టార్ట్-అప్స్ సంఖ్య తక్కువకు కారణం?
ఈ-కామర్స్‌కు సంబంధించి కొత్త స్టార్ట్-అప్స్ ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. తక్కువ ఖర్చుతో ప్రారంభించే సౌలభ్యం. అదే ఉత్పత్తి రంగంలో కొత్త స్టార్ట్-అప్ అంటే భారీగా మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం పెట్టుబడి కూడా భారీగానే ఉండాలి. అంతేకాకుండా ఈ-కామర్స్ సంస్థలు.. చిన్న తరహా ఉత్పత్తిదారులకు చక్కటి మార్కెటింగ్ ప్రాంతంగా నిలుస్తూ ఆ ఇబ్బందులను తగ్గిస్తున్నాయి.

ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు వనరుల సమీకరణకు ఉన్న మార్గాలు?
ప్రస్తుతం సీడ్ ఫండింగ్ సంస్థలు లాభదాయకమైన వెంచర్స్‌కు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఫండింగ్ ఇవ్వడంతో సరిపెట్టకుండా.. నిరంతరం సమీక్షిస్తూ వ్యాపారాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. ఈ అవకాశాలను ఔత్సాహికులు అందిపుచ్చుకోవాలి. ఇంటర్నెట్ ద్వారా ఈ సౌకర్యాలు అందించే సంస్థల వివరాలు తెలుసుకోవచ్చు.

స్టార్ట్-అప్‌కు సరైన సమయం?
తాము సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న రంగానికి సంబంధించి ప్రాథమిక అవగాహన కోసం ముందుగా ఆ రంగంలో పని అనుభవం గడించడం మంచిది. ఫలితంగా ఆ రంగంలోని లోటుపాట్లు, తాజా పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. తాము భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై స్పష్టత వస్తుంది. లాభదాయక విధానాలు అవలంబించే వీలు కలుగుతుంది.

స్వయంఉపాధి, ఉద్యోగం.. రెండు వర్గాల ఔత్సాహికులకు మీరిచ్చే సలహా?
తమ అకడమిక్ విభాగాల్లో నైపుణ్యాలతోపాటు పీపుల్ స్కిల్స్ (కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్, క్రాస్ కల్చరల్) పెంచుకోవాలి. అవి ఉన్నప్పుడే ఉద్యోగమైనా, వ్యాపారంలోనైనా భవిష్యత్తులో రాణించొచ్చు. ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
Published date : 27 May 2014 12:22PM

Photo Stories