Skip to main content

అకడమిక్స్ నుంచే ‘స్టార్ట్-అప్’ కావాలి

మన దేశంలో ప్రస్తుత సామాజిక-ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. స్టార్ట్-అప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆవశ్యకత ఎంతో ఎక్కువగా ఉంది. దీన్ని గుర్తించిన పారిశ్రామిక వర్గాలు.. ప్రభుత్వ విభాగాలు.. ఎంటర్‌ప్రెన్యూర్ రంగంలో కొత్తవారిని ఆహ్వానించేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీన్ని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అందిపుచ్చుకోవాలి.
విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ పెంపొందించే విషయంలో అమెరికా, కెనడా తదితర దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి. అమెరికాలో.. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే ఇండస్ట్రీ-ఇంటరాక్షన్‌కు పెద్దపీట వేస్తారు అంటున్న సీఎండీ, అంజనీ సిమెంట్స్, చైర్మన్ శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ కె.వి.విష్ణు రాజుతో స్టార్ట్ అప్స్‌పై ప్రత్యేక ఇంటర్వ్యూ..

అకడమిక్స్ నుంచే ఆలోచన
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసమే అన్వేషించకుండా.. సొంతంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ నెలకొల్పే దిశగా సాగడం ఎంతో అవసరం. విద్యార్థుల్లో స్టార్ట్-అప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆలోచన అకడెమిక్స్ స్థాయి నుంచే మొదలవ్వాలి. దీనికి తొలి మార్గం.. ఇండస్ట్రీ ఇంటరాక్షన్. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా.. కోర్సు చదువుతున్నప్పుడే అందుకు సంబంధించిన రంగంలోని పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్ వర్క్ వంటివి చేపట్టాలి. ఫలితంగా క్షేత్రస్థాయి పరిజ్ఞానంతోపాటు.. సంబంధిత పరిశ్రమ కార్యకలాపాలపై అవగాహన.. దాన్ని ఏర్పాటు చేయడం ఎలా? అనే ఆలోచన కలుగుతుంది.

ఇండస్ట్రీ ఇంటరాక్షన్ పెరగాలి
మన విద్యా విధానంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. అందుకు అవసరమైన స్కిల్స్‌పై బోధన శూన్యమనే చెప్పాలి. ఇందుకు రెండు కారణాలు పేర్కొనొచ్చు. అవి.. సర్టిఫికెట్ అందుకున్న ప్రతి విద్యార్థి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా భావిస్తున్నాడు. అంతేకాకుండా పరీక్షల్లో పర్సంటేజీ పెంచుకునేందుకు పాఠ్యాంశాలను బట్టీ పడుతున్నారు. రెండోది ఆయా కోర్సుల కరిక్యులం, సిలబస్ అంశాలు కూడా కేవలం థియరీ నాలెడ్జ్ పొందే రీతిలోనే ఉంటున్నాయి. దీనివల్ల క్షేత్ర స్థాయి నైపుణ్యాలు లభించడం లేదు. ఆయా కళాశాలల మేనేజ్‌మెంట్‌లు కూడా ప్లేస్‌మెంట్ రికార్డ్స్ చూపించుకుని సీట్లు భర్తీ చేసుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులను పుస్తకాలకే పరిమితం చేస్తున్నాయి. మరోవైపు మన విద్యా విధానంలో.. కాలేజీలు- ఇండస్ట్రీ ఇంటరాక్షన్ లోపించడం మరో ప్రధాన సమస్యగా మారింది. వీటన్నిటివల్ల విద్యార్థులకు ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ అంటేనే తెలియని పరిస్థితి నెలకొంది.

విదేశాలను ఆదర్శంగా
అమెరికాలో దాదాపు ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో ఇండస్ట్రీ స్పాన్సర్డ్ పరిశోధనలు జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడి విద్యా సంస్థలు ప్రత్యేకంగా అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌తోపాటు CoOp ప్రోగ్రామ్ పేరుతో విద్యార్థులను ఆయా పరిశ్రమలు తమ సంస్థల్లో ఒక సెమిస్టర్ వ్యవధిలో పూర్తి సమయం పనిచేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. దీనివల్ల అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇరవై ఏళ్ల వయసులోనే వాస్తవ పరిస్థితులపై, ఒక సంస్థ కార్యకలాపాలు, ఏర్పాటు తదితర అంశాలపై అవగాహన లభిస్తోంది. దీంతో సొంత సంస్థ ఏర్పాటు దిశగా ఆలోచించడం మొదలుపెడుతున్నారు. అమెరికా, కెనడా, జర్మనీ తదితర దేశాల్లో అసంఖ్యాకంగా స్టార్ట్‌అప్స్ ఏర్పడటానికి ప్రధాన కారణమిదే.

యాజమాన్యాల చొరవ ఎంతో ముఖ్యం
స్టార్ట్-అప్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ విషయాల్లో కళాశాలల యాజమాన్యాల పాత్ర కూడా ఎంతో కీలకం. కరిక్యులంతో సంబంధం లేకుండా.. ఐఐటీలు, ఐఐఎంల వంటి సంస్థల మాదిరిగా ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డవలప్‌మెంట్ సెంటర్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్ వంటివి నెలకొల్పి విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించాలి. బీవీఆర్‌ఐటీలో నాలుగేళ్ల క్రితమే ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అంతేకాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్‌ఎంఈ) పర్యవేక్షించే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ (టీబీఐ) సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఎంఎస్‌ఎంఈ నిబంధనల ప్రకారం- టీబీఐ ప్రతి మూడు లేదా ఆరు నెలలకోసారి పత్రికా ప్రకటన ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలి. మంజూరైన ప్రతిపాదనకు రూ.6.25 లక్షల నిధులను ఎంఎస్‌ఎంఈ అందిస్తుంది. ఇలా ఇప్పటివరకు బీవీఆర్‌ఐటీ-టీబీఐ నుంచి 10 స్టార్ట్-అప్స్‌కు నిధులు లభించాయి.

మెంటారింగ్ మరో సమస్య
దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విషయంలో ఆసక్తి పెరుగుతున్నప్పటికీ.. ఔత్సాహికులకు మెంటారింగ్ ప్రధాన సమస్యగా మారుతోంది. మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ.. వాటికి ఎలా కార్యరూపం ఇవ్వాలో తెలియడం లేదు. ఆర్థిక వనరుల సేకరణ, మార్కెటింగ్ విషయాల్లో సరైన అవగాహన లేక చాలామంది ప్రతిపాదనలకే పరిమితమవుతున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్.. ది ఇండస్ ఎంటర్‌ప్రైజెస్, ఎంఎస్‌ఎంఈ, నాస్‌కామ్ తదితర సంస్థలు స్టార్ట్-అప్స్‌ను ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపడుతున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సీడ్ ఫండింగ్ ఏజెన్సీల మధ్య ముఖాముఖి చర్చలు నిర్వహించేలా చేయడం.. ఫండింగ్ కల్పించడం వంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. అంతేకాకుండా అవగాహన కల్పించడానికి సదస్సులను కూడా నిర్వహిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవడానికి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లను ఆయుధంగా వినియోగించుకోవాలి. తద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

ఆత్మవిశ్వాసమే ఆయుధంగా
అన్ని రకాలుగా స్పష్టత లభించిన స్టార్ట్-అప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. వ్యక్తిగతంగా సరళత్వం కలిగుండాలి. అప్పుడే సమస్యలు, సవాళ్లు ఎదురైనా అధిగమించి సమర్థవంతంగా రాణించగలుగుతారు. వీటితోపాటు ఫైనాన్స్, మార్కెటింగ్ అంశాలపై ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. నిపుణులు, అనుభవజ్ఞులతో సంప్రదిస్తూ తమలో నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. ఇలా చేస్తే విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలవడంతోపాటు ఎంతోమందికి ఉద్యోగావకాశాలను కల్పించొచ్చు.
Published date : 10 Mar 2014 02:44PM

Photo Stories