వైద్య వాలంటీర్ పోస్టులకు 8 వేల మంది మెడికల్, నర్సింగ్ విద్యార్థుల సంసిద్ధత
Sakshi Education
సాక్షి, అమరావతి : కరోనా అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వోద్యోగులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సిబ్బందిని సిద్ధం చేస్తోంది.
ఇందుకోసం మెడికల్, నర్సింగ్ విద్యార్థులతో పాటు ప్రైవేట్ వైద్యులు, రిటైర్డు ఉద్యోగులు మేము సైతం అంటూ పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 8 వేల మంది ఇందుకు దరఖాస్తు చేసుకున్నట్లు కోవిడ్ రాష్ట్ర కమాండ్ కంట్రోలు సెంటర్‌లో ఈ విభాగం పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రకటన జారీచేసిన రెండు రోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని రెండు వేల మంది వైద్య విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. మరోవైపు.. ఎంపికై న మెడికల్ విద్యార్థులకు క్వారంటైన్ కేంద్రాల్లో ప్రాథమిక సేవలందించేలా శిక్షణను ప్రారంభించింది.
ఇందులో భాగంగా..
- 292 మంది పీజీ మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లకు శుక్రవారం ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే శిక్షణ నిర్వహించింది. రోజూ కొంతమందికి చొప్పున ఇది కొనసాగనుంది.
- దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఆసక్తి ధృవీకరణ పత్రం తీసుకున్న అనంతరమే ఆయా రంగాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది.
- శిక్షణనిచ్చే ముందు నిపుణులు కొన్ని ప్రశ్నల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అనంతరమే ఎంపిక చేస్తారు. మానసిక సంసిద్ధతను కూడా పరిశీలిస్తారు.
- నర్సింగ్ విద్యార్థులకు ఆ రంగానికి సంబంధించిన నిపుణులతో శిక్షణ ఇస్తారు.
- యునిసెఫ్-కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ-ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిపుణులతో కలిసి దరఖాస్తులు, ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
- రాష్ట్రంలో అదనపు వైద్య సిబ్బంది అవసరమైన పక్షంలో.. వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది.
Published date : 11 Apr 2020 03:41PM