టీఎస్ మెడికల్ ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోటా రద్దు: ఎందుకంటే...
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో మెడికల్ స్పోర్ట్స్ కోటాను ప్రభుత్వం రద్దుచేసింది.
గతేడాది మాదిరే ఈసారీ మెడికల్ ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోటా ఉండబోదని స్పష్టంచేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. మెడికల్ అడ్మిషన్లలో స్పోర్ట్స్ కోటాపై విద్యార్థుల్లో అయోమయం నెలకొనడంతో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు ఈ మేరకు స్పష్టతనిచ్చాయి. వాస్తవంగా మెడికల్ అడ్మిషన్లలో కన్వీనర్ కోటాలోని 0.5 శాతం సీట్లలో స్పోర్ట్స్ కోటా కింద వివిధ రంగాల్లోని క్రీడాకారులకు రిజర్వేషన్ ఉంటుంది. అన్ని ఇతర రిజర్వేషన్లకు సంబంధించిన విద్యార్థులకు అందులో స్పోర్ట్స్ కోటా కింద సీట్లిస్తారు. అయితే స్పోర్ట్స్ కోటా కోసం కొందరు నకిలీ పత్రాలు పెట్టడం, ఇతరత్రా అంశాలపై కొందరు కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో మెడికల్ సీట్లలో స్పోర్ట్స్ కోటాను రద్దుచేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఆ కోటా కింద సీట్లను భర్తీ చేయట్లేదు. అయితే ఆ కోటాలో మిగిలిన సీట్లను సాధారణంగానే భర్తీచేస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
Published date : 11 Nov 2020 02:38PM