Skip to main content

సీనియర్‌ రెసిడెంట్‌లకు రూ.20 వేల స్టైఫండ్‌ పెంపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పీజీ పూర్తయిన తర్వాత సీనియర్‌ రెసిడెంట్‌లుగా పనిచేస్తున్న వారికి స్టైఫండ్‌ కింద ఇచ్చే సొమ్మును రూ.45 వేల నుంచి రూ.65 వేలకు పెంచింది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై ఉత్తర్వులు జారీ చేయనుంది. గత కొన్ని రోజులుగా సీనియర్‌ రెసిడెంట్‌లు స్టైఫండ్‌ పెంచాలని కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 350 మంది వరకు సీనియర్‌ రెసిడెంట్‌లు ఉంటారు. వీళ్లందరికీ ప్రభుత్వం విధిగా సీనియర్‌ రెసిడెన్సీ చేయాలన్న నియమం లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే సీనియర్‌ రెసిడెన్సీ చేసి ఉండాలి కాబట్టి వాళ్లు తమ వీలును బట్టి చేరిన వారే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రూ.20 వేలు పెంచుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా సీనియర్‌ రెసిడెంట్‌లకు ఇచ్చే స్టైఫండ్‌లో టీడీఎస్‌ (టాక్స్‌ డిడక్షన్స్)ను కూడా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సమ్మెకు వెళ్లేందుకే మొగ్గు
ప్రభుత్వం స్టైఫండ్‌ పెంచుతున్నట్టు హామీ ఇచ్చినా సీనియర్‌ రెసిడెంట్‌లు సమ్మెవైపే మొగ్గు చూపారు. మంగళవారం నుంచే విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. పలు కాలేజీల్లో నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. తాము ఎన్నో రోజులుగా రూ.80 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని సీనియర్‌ రెసిడెంట్‌లు చెప్పారు. ఈ సందర్భంగా సీనియర్‌ రెసిడెంట్‌ల ప్రతినిధి రవి బానోత్‌ మాట్లాడుతూ.. తాము విధుల బహిష్కరణకే మొగ్గు చూపుతున్నామన్నారు. కరోనా సమయంలో ఈ చర్యలు సమంజసమేనా? అన్న ప్రశ్నకు.. చాలా రోజుల నుంచే స్టైఫండ్‌ అడుతున్నామని.. ఇప్పడు తాము నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇది సమయం కాదు
కరోనా విజృంభిస్తున్న వేళ సీనియర్‌ రెసిడెంట్‌లు తీసుకున్న ఈ నిర్నయం సరైంది కాదని వైద్య విద్యా సంచాలకులు డా.రాఘవేంద్రరావు అన్నారు. సీనియర్‌ రెసిడెంట్‌ల ప్రతనిధితో రూ.20 వేలు పెంచుతున్నట్టు చెప్పామని, అయినా విధుల బహిష్కరణకే మొగ్గు చూపుతున్నారన్నారు. దీనిపై అన్ని విధాలా చెప్పామని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న సీనియర్‌ రెసిడెంట్‌ల గడువు మూడు మాసాలే ఉందన్నారు.
Published date : 02 Jun 2021 01:48PM

Photo Stories