Skip to main content

రెండేళ్లలోనే ఏపీలో విద్య, వైద్య విప్లవం

సాక్షి, అమరావతి/ఏఎన్‌యూ: విద్య, వైద్య రంగాల్లో ఏపీ అద్భుత ప్రగతిని సాధించిందని.. సీఎం జగన్‌ పాలనలో రెండేళ్లలోనే ఎన్నడూ లేనంత అభివృద్ధి చెందిందని పలువురు మేధావులు, విద్యావేత్తలు ప్రశంసించారు.
బుధవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘అభివృద్ధి పధంలో ఆంధ్రప్రదేశ్‌’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల మీద చర్చించారు. దీనికి ఆచార్య ఇ.శ్రీనివాసరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికీ సంక్షేమ ఫలాలు అందాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకువెళ్లాలనే తపనతో సీఎం జగన్‌ పనిచేస్తున్నారని చెప్పారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా.. ఉన్న కొద్దిపాటి వనరులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

చదవండి: జాతీయ విద్యావిధానంపై అపోహలొద్దు: ఆదిమూలపు సురేష్‌

‘కార్పొరేట్‌’కు దీటుగా ప్రభుత్వ విద్య..
సీఎం జగన్‌ నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేస్తుండటం వల్లే విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధ్యమయ్యాయని రాజీవ్‌గాంధీ నాలెడ్జి టెక్నాలజీ యూనివర్సిటీ చాన్సలర్‌ ఆచార్య కేసీ రెడ్డి అన్నారు. పేద విద్యార్థులు అత్యధికంగా చదువుకునే ప్రభుత్వ స్కూళ్లను.. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతూ ఆదర్శ సంస్కరణలు చేపట్టారని ప్రశంసించారు. పేద విద్యార్థులు కూడా మంచి ఉపాధి అవకాశాలు పొందేందుకు ఇంగ్లిష్‌ మీడియం తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఏఎన్‌యూ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ సీఎంలలో వైఎస్‌ జగన్‌ టాప్‌లో నిలిచారని.. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారన్నారు. ఏఎన్‌యూ మాజీ వీసీ బాలమోహన్‌దాస్‌ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలోని 94.5 శాతం హామీలను రెండేళ్లలోనే నెరవేర్చడం గొప్ప విషయమన్నారు. నాడు–నేడు, జగనన్న అమ్మ ఒడి తదితర పథకాలతో పాఠశాల విద్య రూపురేఖలను సమూలంగా మార్చారని అభినందించారు. జర్నలిజం విభాగాధిపతి అనిత, ఆర్కిటెక్చర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సిద్ధయ్య, ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రమీలారాణి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాల వల్లే కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అన్ని వర్గాల ప్రజల నిశ్చింతగా జీవిస్తున్నారన్నారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు వృత్తి విద్య కళాశాలలు ఏర్పాటు చేయడం సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనమన్నారు.
Published date : 10 Jun 2021 05:01PM

Photo Stories