పీజీ వైద్య సీట్ల భర్తీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భారీ లబ్ధి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ
Sakshi Education
సాక్షి, అమరావతి: పీజీ వైద్య సీట్ల భర్తీలో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు భారీ లబ్ధి చేకూరనుంది.

రిజర్వుడ్ బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీలు ఓపెన్ కేటగిరీలో సీటు పొంది తర్వాత స్లైడింగ్ (మరో సీటుకు మారితే)కు వెళ్తే అదే కేటగిరీ (బీసీ, ఎస్సీ, ఎస్టీ)లకు చెందిన వారితో ఖాళీ అయిన పీజీ వైద్య సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి మే 28 (గురువారం)నఉత్తర్వులిచ్చారు. 2018లో సుప్రీంకోర్టు (సివిల్ అప్పీల్ నెం.157, 158) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందిన రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు (ఎంఆర్సీ-మెరిటోరియస్ రిజర్వుడ్ క్యాండిడేట్) మరో బ్రాడ్ స్పెషాలిటీకి మారితే ఖాళీ చేసిన సీటును అదే కేటగిరీతో భర్తీ చేస్తారు. గతంలో ఒక బీసీ అభ్యర్థి జనరల్ మెడిసిన్ సీటు పొంది ఆ తర్వాత రేడియాలజీ సీటుకు వెళితే జనరల్ మెడిసిన్ సీటును తర్వాతి ర్యాంకు పొందిన వారితో భర్తీ చేసేవారు. తాజా నిర్ణయం మేరకు ఆ సీటును అదే కేటగిరీకి చెందిన అభ్యర్థితోనే భర్తీ చేస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో వెనుకబడిన వర్గాల వారికి ఎక్కువ లబ్ధి చేకూరనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధానం గతంలో లేకపోవడంతో ఓపెన్ కేటగిరీలో సీటు పొందిన రిజర్వుడ్ అభ్యర్థులు స్లైడింగ్‌కు వెళ్తే అదే వర్గానికి సీట్లు వచ్చేవి కావు. త్వరలో జరగబోయే పీజీ వైద్య సీట్ల భర్తీలో కొత్త విధానాన్ని అనుసరించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ప్రభుత్వం ఆదేశించింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పక్కాగా సీట్లు భర్తీ జరగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Published date : 29 May 2020 01:29PM