ఒకేసారి 16 కొత్త వైద్య కాలేజీల ఏర్పాటు.. భారీగా ఎంబీబీఎస్ సీట్లు!!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల భారీగా లబ్ధి చేకూరనుంది. ఎంబీబీఎస్ సీట్లు రావడంతో పాటు భారీగా సీట్లు పెరగనున్నాయి.
ఒక్కో కాలేజీలో 20 నుంచి 28 యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. మూడేళ్లలో ఈ కళాశాలలను పూర్తి చేయాలని కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 16 కాలేజీలు అందుబాటులోకి వస్తే ఇంచుమించుగా ప్రస్తుతం ఉన్న సీట్లకు రెట్టింపు అవుతాయి. ప్రస్తుతం 2,050 సీట్లుండగా కొత్త కాలేజీల వల్ల 1,950 సీట్లు అదనంగా రానున్నాయి. అంటే ఒక్క ప్రభుత్వ పరిధిలోనే 4వేల ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. ఇప్పటికే కళాశాలల డిజైన్లు పూర్తయ్యాయి. త్వరలోనే టెండర్లకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉండాలనేది వైద్యవిద్యా శాఖ నిర్ణయించింది.
భారీగా పెరగనున్న పడకలు
భారీగా పెరగనున్న పడకలు
- ప్రస్తుతం ఆస్పత్రుల స్థాయి, పడకల సంఖ్య తక్కువగా ఉంది. కొత్తగా ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే భారీగా పడకలు పెరుగుతాయి.
- ప్రస్తుతం ఈ 16 ఆస్పత్రుల్లో కలిపి 3,180 పడకలు ఉన్నాయి. అదే మెడికల్ కాలేజీగా ఉన్నతీకరిస్తే 7,880 పడకలు అవుతాయి. అంటే అదనంగా 4,700 పడకలు వస్తాయి.
- వైద్య కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు వస్తే 20 యూనిట్లు, 150 సీట్లయితే 28 యూనిట్లు ఉంటాయి.
- ఒక్కో యూనిట్‌కు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉండాలి.
- ఒక్కో యూనిట్‌కు సుమారు 30 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు.
- 1,950 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో 11 కాలేజీల్లో కలిపి 2,050 సీట్లు మాత్రమే ఉన్నాయి.
- ఒక్కో కాలేజీలో రమారమి 25 నుంచి 32 వరకు స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉంటారు.
- ఇప్పటి వరకు జిల్లాకొక మెడికల్ కాలేజీ ఉండగా.. ఇప్పుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఓ కాలేజీ వస్తుంది.
- 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒకేసారి 4 వైద్య కళాశాలలు (రిమ్స్) అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత ఇదే పెద్ద వైద్యకళాశాలల ఏర్పాటు.
కొత్తగా కాలేజీలు | ప్రస్తుత ఆస్పత్రి స్థాయి | పడకల సంఖ్య | కాలేజీలు పూర్తయితే వచ్చే ఎంబీబీఎస్ సీట్లు | పడకలు యూనిట్లు |
పాడేరు |
| 100 | 100 | 430/20 |
విజయనగరం | జిల్లా ఆస్పత్రి | 300 | 150 | 630/28 |
అనకాపల్లి | జిల్లా ఆస్పత్రి | 150 | 150 | 630/28 |
రాజమండ్రి | జిల్లా ఆస్పత్రి | 350 | 150 | 630/28 |
నరసాపురం | సీహెచ్‌సీ | 50 | 100 | 430/20 |
ఏలూరు | జిల్లా ఆస్పత్రి | 450 | 150 | 630/28 |
మచిలీపట్నం | జిల్లా ఆస్పత్రి | 450 | 150 | 630/28 |
పిడుగురాళ్ల | పీహెచ్‌సీ | 30 | 100 | 430/20 |
బాపట్ల | ఏరియా ఆస్పత్రి | 100 | 100 | 430/20 |
మార్కాపురం | జిల్లా ఆస్పత్రి | 200 | 100 | 430/20 |
నంద్యాల | జిల్లా ఆస్పత్రి | 300 | 150 | 630/28 |
పెనుకొండ | జిల్లా ఆస్పత్రి | 200 | 100 | 430/20 |
మదనపల్లి | ఏరియా ఆస్పత్రి | 150 | 150 | 630/28 |
పులివెందుల | ఏరియా ఆస్పత్రి | 100 | 100 | 430/20 |
ఆదోని | ఏరియా ఆస్పత్రి | 100 | 100 | 430/20 |
అమలాపురం | ఏరియా ఆస్పత్రి | 100 | 100 | 430/20 |
Published date : 12 Mar 2021 04:00PM