Skip to main content

నీట్‌లో 650 మార్కులు వస్తాయనుకుంటే...సున్నా వ‌చ్చాయి

ముంబై: నీట్‌ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం గురించి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఎస్టీ కేటగిరీలో ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన స్టూడెంట్‌ని ఫెయిల్‌ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరో విద్యార్థిని తనకు సున్నా మార్కులు వచ్చాయి.. మాన్యువల్‌గా పేపర్‌ కరెక్షన్‌ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. వివరాలు..మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని వసుంధర భోజనే నీట్‌లో 720 మార్కులకు గాను సున్నా(0) మార్కులు సాధించినట్లు రిజల్ట్‌లో చూపించింది. కనీసం 650 మార్కులు వస్తాయని భావించిన ఆమె సున్నా మార్కులు రావడంతో షాక్‌కు గురయ్యింది. దాంతో తన పేపర్‌ని రీ వాల్యూయేషన్‌ చేయాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బొంబాయి హైకోర్టు సోమవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించి నోటీసులు జారీ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ), కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఇక విద్యార్థి తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. వసుంధర మెరిట్‌ స్టూడెంట్‌. బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. ఈ పరీక్షలో కనీసం 650 మార్కులు వస్తాయని భావించింది. కానీ సున్నా మార్కులు వచ్చాయి. ఆన్‌లైన్‌ టెస్టింగ్‌ విధానంలోని లోపాల వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. అందుకే మాన్యువల్‌గా రీవాల్యూయేషన్‌ చేయాలని కోరుతున్నాం’ అన్నారు. అయితే నీట్ పరీక్షలో రీవాల్యూయేషన్‌ చేసే విధానం లేదు. అందుకే పరీక్షకు హాజరయిన విద్యార్థులు సమర్పించిన ఓఎంఆర్ షీట్‌ను ఎన్‌టీఏ అప్‌లోడ్ చేస్తుంది, ఆన్సర్‌ కీ కూడా ఇస్తుంది. తమిళనాడులోని ఇద్దరు విద్యార్థులు కూదా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
Published date : 20 Oct 2020 06:13PM

Photo Stories