నీట్- 2020 ఫలితాల్లో తెలంగాణ బిడ్డకు మూడో ర్యాంకు!
హైదరాబాద్‌కు చెందిన తుమ్మల స్నిఖిత ఆలిండియా మూడో ర్యాంకు సాధించారు. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారు. కాగా, నీట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. టాప్ 15 జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు ముగ్గురు ఉండగా, టాప్ 50 ర్యాం కుల్లో ఏకంగా ఏడుగురు ఉన్నారు. ఆలిండియా ర్యాంకుల్లో బాలురు అగ్రస్థానంలో నిలిచారు. తొలి 50 ర్యాంకుల్లో 31 ర్యాంకులను బాలురే దక్కించుకున్నారు. రాష్ట్రం నుంచి నీట్‌లో అనంత పరాక్రమ (11వ ర్యాంకు), బారెడ్డి సాయి త్రిషా రెడ్డి (14వ ర్యాంకు), శ్రీరామ్ సాయి శాంతవర్ధన్ (27వ ర్యాంకు ), ఆర్షశ్ అగర్వాల్ (30వ ర్యాంకు), మల్లేడి రుషిత్ (33వ ర్యాంకు), ఆవుల సుభాంగ్ (38వ ర్యాంకు) సాధించారు. బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన నిత్య దినేష్ (ఆలిండియా 58వ ర్యాంకు) 17వ స్థానాన్ని పొందారు. ఎయిమ్స్, జిప్‌మర్ సహా అన్ని ప్రముఖ మెడికల్ కాలేజీల్లోనూ ఈ ఏడాది నుంచి నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేయనున్నారు.
ఆలిండియా కోటాకు 467 సీట్లు..
తెలంగాణ నుంచి ఆలిండియా కోటాకు 467 ఎంబీబీఎస్ సీట్లు ఇస్తారు. ఆలిండియా కోటాలో రెండు విడతల ప్రవేశ ప్రక్రియల అనంతరం మిగిలిన సీట్లను రాష్ట్రాలకు ఇస్తారు. రాష్ట్ర ప్రవేశాలకు, అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమి ప్రవేశాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రస్థాయిలో నిర్వహించే కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు.
గతేడాది కంటే పెరిగిన మార్కులు..
గతేడాది కంటే మార్కులు పెరిగాయి. గతేడాది 500 మార్కులు వస్తే ఆలిండియా స్థాయిలో 35 వేల నుంచి 40 వేల ర్యాంకులు వచ్చాయి. ఈసారి అదే మార్కులకు 90 వేల వరకు ర్యాంకు వెళ్లింది. గతేడాది ఆలిండియా స్థాయిలో 40 వేలు ఉన్నవారికి కన్వీకన్ కోటాలో సీట్లు వచ్చాయి. ఈసారి 70 వేలకు పైగా ఆలిండియా ర్యాంకు ఉన్నవారికి కూడా కన్వీనర్ కోటా సీటు వస్తుంది. ఆలిండియా స్థాయిలో 70 వేల ర్యాంకు అయితే, రాష్ట్ర స్థాయిలో 2 వేల లోపు ర్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది జనరల్‌లో కటాఫ్ మార్క్ 134 ఉంటే, ఈసారి 147 కటాఫ్ అర్హత మార్కు వచ్చింది. రిజర్వేషన్‌లో గతేడాది 107.. ఈసారి 113 కట్ ఆఫ్ మార్క్ ఉంది. గతేడాది టాప్ ర్యాంకు మార్కు 701 ఉండగా, ఇప్పుడు 700పైన 100 మంది ర్యాంకులు సాధించిన వారున్నారు. మూడు నెలలు సమయం దొరకడం వల్ల చదువుకోవడానికి వీలు కలిగింది. అయితే పరీక్ష జరగదన్న భావనతో కొందరు విద్యార్థులు ఉండటమే తక్కువ మంది అర్హత సాధించడానికి ప్రధాన కారణమని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ డీన్ శంకర్‌రావు అభిప్రాయపడ్డారు.
- ఆలిండియా స్థాయిలో 15,97,435 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 13,66,945 (85.57 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.
- మొత్తం 11 భాషల్లో నిర్వహించిన పరీక్షకు ఇంగ్లిష్‌లో 12,63,273 (79.08 శాతం) మంది రాయగా, తెలుగులో 1,624 (0.10 శాతం) మంది రాశారు.
- తెలంగాణలో 54,872 మంది నమోదు చేసుకోగా, 50,392 మంది హాజరయ్యారు. వీరిలో 24,767 (49.15 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 67.44 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
- అత్యధికంగా చంఢీగఢ్‌లో 75.64 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అత్యల్పంగా నాగాలాండ్‌లో 40.50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
కేటగిరీ | అర్హత పర్సంటైల్ | అర్హత మార్కులు |
అన్ రిజర్వుడ్ | 50 | 147 |
ఓబీసీ | 40 | 113 |
ఎస్సీ | 40 | 113 |
ఎస్టీ | 40 | 113 |
ఈడబ్ల్యూఎస్/పీహెచ్ | 40 | 129 |
ఓబీసీ/పీహెచ్ | 40 | 113 |
ఎస్సీ/పీహెచ్ | 40 | 113 |
ఎస్టీ/పీహెచ్ | 40 | 113 |