Skip to main content

క్లాస్‌ల నిర్వహణపై నిర్ణయం తీసుకోండి: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య తరగతులను పునఃప్రారంభించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు సోమవారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ముందుగా ఎంబీబీఎస్, బీడీఎస్ ఫైనలియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని యూనివర్సిటీ భావిస్తోంది. ఏటా మార్చి 31 నాటికి విద్యార్థులు కోర్సు చివరి సంవత్సరం పరీక్షలు పూర్తి చేసి, ఏప్రిల్ 1 నుంచి ఇంటర్న్‌షిప్‌లో చేరుతుంటారు. ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అనంతరం పీజీ వైద్య విద్య అర్హత పరీక్షకు పోటీ పడుతుంటారు. ఇంటర్న్‌షిప్ పూర్తి చేయకపోతే పీజీ వైద్యవిద్యకు అర్హత కోల్పోతారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ముందుగా ఫైనలియర్ వైద్య విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని యూనివర్సిటీ ప్రభుత్వానికి విన్నవించింది. తర్వాత ఫస్టియర్ విద్యార్థులను తరగతులకు అనుమతించాలని, అనంతరం కరోనా ఉధృతిని బట్టి అప్పటి పరిస్థితుల మేరకు మిగిలిన విద్యార్థులకు తరగతుల నిర్వహణపై దృష్టిసారించాలని సూచించింది. ఎయిమ్స్, జిప్‌మర్ వంటి కేంద్ర వైద్య సంస్థలు, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే తీరుగా వైద్య కళాశాలల్లో తరగతులను ప్రారంభించారని పేర్కొంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే వైద్య కళాశాలల్లో తరగతులను ప్రారంభించనున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.
Published date : 08 Dec 2020 04:31PM

Photo Stories