Skip to main content

సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్-4 ప్రిపరేషన్ ప్లాన్

సమాజ జీవనంలో వ్యక్తులు అనుసరించదగ్గ సాధారణ ప్రమాణాలే నైతిక విలువలు. నైతిక విలువలను అలవరుచుకున్న వ్యక్తి తన మాటల ద్వారా, పనుల ద్వారా చుట్టూ ఉండే సమాజాన్ని ప్రభావితం చేయగలడు. ఇలాంటి నైతిక విలువలను అధ్యయనం చేసే నీతిశాస్థ్రాన్ని కొత్తగా సివిల్స్ మెయిన్స్ సిలబస్‌లో చేర్చారు. ప్రజా పాలనలో కీలకంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విలువలు కలిగి ఉండటం అత్యవసరం. సిలబస్‌లో ప్రస్తావించిన ఇలాంటి అంశాలపై సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ బి.జె.బి. కృపాదానం విశ్లేషణ..

సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్
పేపర్-5 (జనరల్ స్టడీస్-4)   మార్కులు-250
సిలబస్: నీతిశాస్త్రం (Ethics), నిజాయితీ (Integrity), అభిరుచి (Aptitude)
ఈ పేపర్‌లో 70 శాతం అంశాలు ప్రభుత్వ పాలనకు సంబంధించినవి. ప్రభుత్వ పాలనను (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) ఆప్షనల్‌గా తీసుకున్న వారికి జీఎస్-4 పేపర్ బోనస్ అని చెప్పొచ్చు. సిలబస్‌లో ఎనిమిది అంశాలను పేర్కొన్నారు. వీటిలో పాలన-నైతికతకు సంబంధించిన అంశాలపై విశ్లేషణ..

3. అభిరుచి, సివిల్ సర్వీస్ ప్రాథమిక విలువలు (Aptitude and Foundational Values for Civil Service): కొందరు కొన్ని పనులు చేయడంలో సహజసిద్ధమైన సామర్థ్యం కలిగి ఉంటారు. దీన్ని అభిరుచిగా పేర్కొనవచ్చు. సివిల్ సర్వీస్‌పై అభిరుచి ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశిస్తే తమ వృత్తికి, సమాజానికి న్యాయం చేస్తారు. సివిల్ సర్వీస్ ఒక వృత్తి. దీనికి కొన్ని ప్రత్యేక విలువలున్నాయి. అవి: నిజాయితీ, నిష్పక్షపాతం, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం, ప్రజా సేవకు అంకితం కావడం, సమాజంలోని బలహీన వర్గాల పట్ల సహనం, కనికరం, దయాగుణం కలిగి ఉండటం. ఇవి చాలా వరకు ఉద్యోగి స్వామ్య లక్షణాలు. అభ్యర్థులు ఈ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
రిఫరెన్స్: New Horizons Of Public Administration, Mohit Bhattacharya (Latest Edition).

4. మానసికోద్వేగ మేధస్సు (Emotional intelligence) భావనలు-పాలనలో వీటి ఉపయోగం, అనువర్తన:
ఇటీవల కాలంలో మానసికోద్వేగ మేధస్సు (Emotional Intelligence) భావన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాకు చెందిన జాన్ మేయర్, పీటర్ శలోవీ అనే మనస్తత్వ శాస్త్రవేత్తలు ఈ భావనను ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ రకమైన మేధస్సు కలిగిన వారు తమ మానసిక ఉద్వేగాలను అంచనా వేయగలగడం, అవసరాన్నిబట్టి వాటిని నియంత్రించడం-తద్వారా మానసిక, తెలివితేటల పెరుగుదలకు దోహదం చేస్తారు.

మానసికోద్వేగ మేధస్సు-ప్రత్యేక లక్షణాలు (Attributes):
1. స్వయం స్పృహ (Self Awareness).
2. స్వయం నిర్వహణ(Self Management).
3. సామాజిక స్పృహ (Social Awareness).
4. సంబంధాలతో కూడిన నిర్వహణ (Relationship Management).
ఈ లక్షణాలు ఒక వ్యక్తి పనిని; మానసిక, శారీరక ఆరోగ్యాన్ని; తోటి వారితో గల సంబంధాలను ప్రభావితం చేస్తాయి. సమర్థవంతమైన పాలనకు మానసికోద్వేగ మేధస్సు ఎంతో అవసరం. ఇది కొంతవరకు సహజ సిద్ధంగా లభిస్తే మరికొంత శిక్షణ ద్వారా అభివృద్ధి చెందుతుంది.ఈ రకమైన మేధస్సు ద్వారా 1. ఒత్తిడి (stress)ని అధిగమించే సామర్థ్యం
2. ఉద్వేగాలను గుర్తించి, వాటిని నియంత్రించగల శక్తి కలిగి ఉండటం
3. సహచరులతో ప్రభావవంతంగా సంభాషించే(communicate) సామర్థ్యం
4. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలగడం
5. సమస్యలను ధైర్యంగా, సకారాత్మకంగా (positive) పరిష్కరించగలగడం వంటి నైపుణ్యాలను సాధించవచ్చు. అభ్యర్థులు ఈ అంశాలపై పట్టు సాధించాలి.
డానియల్ గోల్‌మన్ రచించిన Emotional Intelligence అనే గ్రంథం అత్యంత ప్రాచుర్యం పొందింది.
రిఫరెన్స్: Emotional Intelligence And The Construction And Regulation of Feelings, Mayer & Salovey, 1995)

6. ప్రభుత్వ పౌరసేవల విలువలు, ప్రభుత్వ పాలనలో నైతికత (Public/Civil service values and Ethics in Public administration):
ప్రభుత్వ పాలనలో విలువలు, నైతికత స్థానం, సమస్యలు; ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవస్థల విలువలను, నైతికతను పాటించడంలో ఎదుర్కొంటున్న సందిగ్ధతలు; నైతికతకు దోహదం చేస్తున్న చట్టాలు, నిబంధనలు, మనస్సాక్షి (Conscience), జవాబుదారీతనం, నైతికబద్ధమైన పరిపాలన; పాలనలో నైతిక విలువలను పెంపొందించాల్సిన ఆవశ్యకత; అంతర్జాతీయ సంబంధాలలో నిక్షేపక నిధి విషయాలలో నైతికాంశాలు; కార్పొరేట్ పాలన.

ఇటీవల కాలంలో సామాజిక విలువలు క్షీణించడాన్ని గమనిస్తున్నాం. దీని ప్రభావం పరిపాలనపై కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడటం, పక్షపాతంగా వ్యవహరించడం, అవినీతి కార్యకలాపాలకు పాల్పడటం వంటివి చోటుచేసుకుంటున్నాయి. జవాబుదారీతనం లోపిస్తోంది. ఈ నేపథ్యంలో విలువలకు, నైతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వంలో పనిచేసే వారికి ఉండాల్సిన కనీస విలువలు, నైతిక ఆవశ్యకత అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
అంతర్జాతీయ సంబంధాల్లో నైతికత ఏ మేరకు ఉందన్న దాన్ని అధ్యయనం చేయాలి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు వర్ధమాన దేశాలను దోచుకోవడం, స్వలాభం కోసం ఇతర దేశాల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం వంటివి అనైతిక చర్యలు. ఇటీవల కాలంలో సంభవించిన ఇరాక్ యుద్ధం, లిబియాలో విప్లవం, ప్రస్తుత సిరియా అంతర్యుద్ధం వంటివి పెట్టుబడిదారి దేశాల ప్రయోజనాల పరిరక్షణకు కొనసాగించినవే.
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి తదితర అంతర్జాతీయ సంస్థలు రుణాలిచ్చేటప్పుడు విధించే షరతులు చాలా వరకు అనైతికమైనవి. ఈ సంస్థలు పేద దేశాలను దోచుకోవడానికి తోడ్పడుతున్నాయన్న సందేహం వస్తుంది. అలాగే బహుళజాతి సంస్థలు లాభాపేక్షతో తృతీయ ప్రపంచ దేశాల వనరుల (బొగ్గు, ఇనుము, పెట్రోలియం..) ను దోచుకోవడం, బహుళజాతి కంపెనీలు నాసిరకం మందులను అమ్మడం, పేటెంట్‌ల రక్షణ పేరుతో కాలం చెల్లిన మందులను స్వల్ప మార్పులతో అధిక ధరలకు అమ్ముతూ పేదలను పిప్పిచేయడం వంటి సంఘటనలు అనైతిక చర్యలకు ఉదాహరణలు. వీటికి సంబంధించిన సమకాలీన అంశాలపై అభ్యర్థులకు పట్టుండాలి.
రిఫరెన్స్: 1. New Horizons Of Public Admini-stration, Mohit Bhattacharya. 2. News Papers, Magazines.

7. పరిపాలనలో నిజాయితీ/రుజువర్తన (Probity in Governance):
ప్రజాసేవ భావన; పాలన, రుజువర్తన తాత్విక మూలం; ప్రభుత్వంలో సమాచారాన్ని పంచుకోవడం, పారదర్శకత, సమాచార హక్కు, నైతిక నియమావళి, ప్రవర్తనా నియమావళి, పౌర హక్కులపత్రం (ఛార్టర్), పని సంస్కృతి, అందించే సేవల్లో నాణ్యత, ప్రభుత్వ నిధుల వినియోగం, అవినీతి సవాళ్లు.
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో సేవాభావం ఏ మేరకు ప్రస్ఫుటమవుతోంది? పాలనలో నీతి, నిజాయితీ లోపిస్తోందా? వంటి వాటిపై అభ్యర్థులు ఆలోచిం చగలగాలి. సమాచార మార్పిడి ద్వారా పారదర్శకంగా విధులను నిర్వర్తించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించవచ్చు. పాలనను సమాచార హక్కుఏ విధంగా మెరుగుపరుస్తుందో, అవినీతి నివారణకు ఎలా దోహదం చేస్తుందో అధ్యయనం చేయాలి.
అన్ని వృత్తుల మాదిరిగానే ప్రజాసేవ(పబ్లిక్ సర్వీస్) ఒక వృత్తి. ఈ వృత్తిలో ఉన్నవారు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి, ఉద్యోగుల్లో జవాబుదారీతనం అలవడేలా చేస్తుంది. పౌర హక్కుల పత్రం సగటు పౌరునికి సాధికారత కల్పిస్తూ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసేటట్లు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సోమరితనం, ఉదాసీనత వంటి అవలక్షణాలను తొలగించడం, వారిలో పని సంస్కృతిని పెంపొందించడం అవసరం.
మన దేశంలో ఏటా రూ.లక్షల కోట్లు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నప్పటికీ సగటు భారతీయుడి పరిస్థితి మెరుగుపడకపోవడానికి కారణం నిధుల దుర్వినియోగం. దీన్నెలా అరికట్టవచ్చన్న అంశంపై అభ్యర్థులు అధ్యయనం చేయాలి. ప్రతిరోజూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రోజురోజుకూ అవినీతి పెరిగిపోవడానికి కారణాలు, దాని మూలంగా నల్లధనం, ప్రభుత్వ విధానాలను మాఫియా ప్రభావితం చేయడం, రాజకీయ వ్యవస్థ నేరపూరితం కావడం తదితరాలపై అభ్యర్థులు అధ్యయనం చేయాలి. అవినీతిని నిర్మూలించడానికి తగిన పరిష్కార మార్గాల (లోకాయుక్త వంటి వ్యవస్థలు, స్వయంప్రతిపత్తి కలిగిన సీబీఐ వ్యవస్థ)ను అభ్యర్థులు సూచించగలగాలి.
రిఫరెన్స్: Public Administration, Avasthi & Maheswari

8. పైన ప్రస్తావించిన అంశాలకు సంబంధించి వాస్తవ సంఘటనల అధ్యయనం (Case Studies):
A) నైతికత, నిజాయితీ:
(Ethics, Integrity) రవివర్మ నౌకాదళంలో ఓ ఉన్నతాధికారి. శ్రీకాంత్ రవివర్మతో కలిసి కొంతకాలం నౌకాదళంలో పనిచేసి ఆ తర్వాత రక్షణ శాఖకు ఆయుధాలు సరఫరా చేసే ఓ బహుళజాతి సంస్థలో మార్కెటింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఒకసారి నౌకాదళం ఏర్పాటు చేసిన ఓ సెమినార్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. గత జ్ఙాపకాలను నెమరువేసుకున్నారు. అదే రోజు సాయంత్రం శ్రీకాంత్ ఆహ్వానం మేరకు ఓ రెస్టారెంట్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. భోజన సమయంలో శ్రీకాంత్.. రవివర్మ శక్తిసామర్థ్యాలను మెచ్చుకుంటూ తమ సంస్థ సరఫరా చేసే ఆయుధాలు కొనుగోలు చేసేటట్లు నిర్ణయం తీసుకోవాలని, దీనికి తగిన పారితోషికం ఇస్తామని ఆశపెడతాడు. తమ సంస్థలో రెట్టింపు జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలుకుతాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా చూస్తానని హామీ ఇస్తాడు.
ఈ సందర్భంలో నీవు రవివర్మ స్థానంలో ఉంటే ఎలా స్పందిస్తావు?
ఇది నీ నిజాయితీకి, నైతికతకు సంబంధించిన విషయం. నీ ముందు ఈ కింది ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
  1. ఊహించని ఈ పరిణామానికి నీవు నిత్తేజుడవవుతావు. లంచం ఇవ్వచూపిన ఆ కంపెనీ ఉద్యోగిపై నీకు కోపం వస్తుంది. ప్రవర్తనా నియమావళి ప్రకారం జరిగిన విషయాన్ని నౌకాదళంలోని నిఘా సంస్థకు తెలియజేస్తావు. ఆ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేయాలని సిఫార్సు చేస్తావు.
  2. నిన్ను అకస్మాత్తుగా అదృష్టం వరించిందని ఉబ్బితబ్బిబ్బవుతావు. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న సమయంలో ఈ అవకాశం రావడం నీకు చాలా సంతోషాన్నిస్తుంది. శ్రీకాంత్‌తో ఒప్పందం చేసుకొని అతను పనిచేస్తున్న కంపెనీకి ఆయుధాల సరఫరా కాంట్రాక్టు ఇస్తావు.
  3. జరిగిన సంఘటనపై మరోసారి ఆలోచించి శ్రీకాంత్‌తో ఇకపై మాట్లాడకూడదని, జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పనవసరం లేదని భావిస్తావు. పాత సహచరుడుగా శ్రీకాంత్ ప్రతిపాదించిన విషయాన్ని తీవ్రంగా పరిగణించకుండా పై అధికారులకు తెలియజేయనవసరం లేదని నిర్ణయం తీసుకుంటావు.
B) గాజా (పాలస్తీనా)లో నివసించే పాలస్తీనా కాందీశీకుల కోసం ఐక్యరాజ్య సమతి ఉప అంగమైన UNRWA (United Nations Relief And Work Agency) ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలుకావడం లేదు. దీనికి కారణం: పర్యవేక్షకుల్లో సరైన నాయకత్వ లక్షణాలు లేకపోవడం, నాయకుల్లో మానసికోద్వేగ మేధస్సు లోపించడం. నాయకుల మేధస్సుపై వ్యవస్థ సమర్థత ఏ మేరకు ఆధారపడి ఉంటుందనే అంశంపై గాజాలో ఉన్న ఇస్లామిక్ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు విస్తృత పరిశోధన చేశారు. పర్యవేక్షకులను, సేవలు పొందే ప్రజలను ఇంటర్వ్యూ చేయగా, ప్రజాస్వామ్యబద్ధ నాయకత్వానికి, వ్యవస్థ సమర్థతకు దగ్గరి సంబంధముందని, నాయకుల మానసికోద్వేగ మేధస్సు అధీనుల(సబార్డినేట్స్)ను ప్రభావితం చేస్తుందని తేలింది. సామాజిక మేధస్సు (Social Intelligence).. వ్యవస్థలో సమర్థత పెంపునకు దోహదం చేస్తుందని పరిశోధనలో రుజువైంది.
నోట్: మిగిలిన అంశాలపై కేస్ స్టడీస్ అధ్యయనం కోసం పై నమూనా కేస్ స్టడీస్ ఉపయోగపడతాయి.
కెరటం నాకు ఆదర్శం.. ఉవ్వెత్తున లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు..
ఇది ఓ వ్యక్తి వైఖరి (Attitude)లోని దృఢత్వాన్ని సూచిస్తుంది. ఇలాంటి వైఖరులున్న అధికారులు సమర్థవంతమైన వారుగా గుర్తింపుపొందుతారు.
Published date : 05 Jul 2013 05:25PM

Photo Stories