Skip to main content

సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్-2 ప్రిపరేషన్ ఇలా...

సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-2 సిలబస్‌లో ఏయే అంశాలున్నాయి? వాటిపై పట్టుసాధించడమెలా? వంటి అంశాలపై సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ డాక్టర్ బి.జె.బి. కృపాదానం అందిస్తున్న విశ్లేషణ...

సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్: పేపర్-3 (జనరల్ స్టడీస్-2) 250 మార్కులు సిలబస్: పరిపాలన (గవర్నెర్స్), రాజ్యాంగం (కాన్‌స్టిట్యూషన్), రాజకీయ వ్యవస్థ (పాలిటీ), సామాజిక న్యాయం (సోషల్ జస్టిస్), అంతర్జాతీయ సంబంధాలు (ఇంటర్నేషనల్ రిలేషన్స్)

సివిల్స్ మెయిన్స్ రాతపరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్-2 సిలబస్‌ను నిశితంగా పరిశీలిస్తే భారత్‌కు సంబంధించిన ప్రజా పరిపాలన, రాజకీయ వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాల మేళవింపుగా ఉంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా పొలిటికల్ సైన్స్‌ను ఆప్షనల్‌గా తీసుకొన్న అభ్యర్థులకు పేపర్-2 బోనస్ అని చెప్పొచ్చు.

సిలబస్‌ను చాప్టర్ల వారీగా పరిశీలిస్తే...

1. భారత రాజ్యాంగం- చారిత్రాత్మక అంశాలు, పరిణామక్రమం తదితర అంశాలు..
  • వీటిని అధ్యయనం చేసే క్రమంలో 1858 భారత ప్రభుత్వ చట్టం దగ్గరి నుంచి 1947 స్వాతంత్య్ర చట్టం వరకు రాజ్యాంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలను చదవాలి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలపై అభ్యర్థులు ఎక్కువ దృష్టిసారించాలి. రాజ్యాంగ పీఠిక (Preamble), ప్రాథమిక హక్కులు (Funda-mental Rights), ఆదేశిక సూత్రాలు (Directive Principles) వంటి మూల, కీలక అంశాలను చదవాలి. V, VI, VII, X, XI, XII షెడ్యూళ్లపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి. రాజ్యాంగ మూల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి కేశవానంద భారతి, మినర్వా మిల్స్ కేసులను పరిశీలించాలి.
  • రిఫరెన్స్: Introduction to the Constitution of India, 20th edition. D. D.Basu

    2. కేంద్రం, రాష్ట్రాల విధులు, బాధ్యతలు..
  • వీటికి సంబంధించి అధ్యయనం చేసేటప్పుడు కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాల విభజన, భారత రాజకీయ వ్యవస్థ తాలూకు అర్ధ సమాఖ్య స్వభావం (quasi federal nature) పై దృష్టిసారించాలి. రాష్ట్రాల నుంచి స్థానిక సంస్థలకు అధికారాల సంక్రమణపై 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రభావాన్ని పరిశీలించాలి.
  • రిఫరెన్స్: Introduction to the Constitution of India, 20th edition

3. ప్రభుత్వంలోని వివిధ అంగాల మధ్య అధికారాల విభజన..

  • ఈ అంశానికి సంబంధించి మాంటెస్క్యూ (Montes-quieu) అధికార విభజన సిద్ధాంతంపై అభ్యర్థులు దృష్టిసారించాలి. పార్లమెంటు తరహా ప్రభుత్వాలున్న భారత్ వంటి దేశాలకు సంబంధించి ఈ సిద్ధాంత అనువర్తిత అంశాలను చదవాలి.
  • నిర్దేశ కాలంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్లో తలెత్తిన వివాదాలను పరిష్కరించే చట్టబద్ధమైన, అనధికార పద్ధతులు రూపొందాయి. వీటిపై అభ్యర్థులు దృష్టి సారించాలి.
  • రిఫరెన్స్: Introduction to Political Theory, 4th edition, Gauba.

    4. వివిధ దేశాల రాజ్యాంగాలు-భారత్‌తో పోలిక..

    ఎక్కువ శాతం ఆధునిక రాజ్యాలు ప్రజాస్వామ్యబద్ధం గా వ్యవహరిస్తున్నప్పటికీ వాటి వ్యవస్థీకరణలో, పని తీరులో తేడాలున్నాయి. భారత రాజ్యాంగం ఆధునిక రాజ్యాంగాల నుంచి కొన్ని భావాలను ఉదారంగా స్వీకరించింది. బ్రిటన్, అమెరికా, ఐర్లాండ్, దక్షిణా ఫ్రికా, జర్మనీ(వైమార్ రాజ్యాంగం), సోవియట్ యూనియన్ రాజ్యాంగాలు భారత రాజ్యాంగాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అలాగే ఫ్రెంచ్ విప్లవ నినాదాలు- స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం- మన రాజ్యాంగంలో ప్రస్తావించబడ్డాయి. ఈ నేపథ్యం లో: పార్లమెంటరీ-అధ్యక్ష, ఏకకేంద్ర-సమాఖ్య, రాచ రిక-రిపబ్లికన్ మొదలైన భావాల ఆచరణలో భారత్, మిగిలిన ప్రజాస్వామ్యాల మధ్య సారూప్యాన్ని, భేదాలను అధ్యయనం చేయాలి.
  • రిఫరెన్స్: Comparative Government and politics, 8th edition, Rod Haque and Martin Harrop.

    5. పార్లమెంటు, రాష్ట్రాల శాసన వ్యవస్థలు:
  • దీనికి సంబంధించి భారత పార్లమెంటు, కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ద్విసభా స్వభావాన్ని అధ్యయనం చేయాలి. దిగువ, ఎగువ సభల మధ్య వ్యత్యాసాలను తెలుసుకోవాలి. చట్ట సభల అధికారాలపై దృష్టిసారించాలి.
  • రిఫరెన్స్: Our Parliament, National Book Trust.

    6. కార్యనిర్వాహక (executive), న్యాయ (judiciary) వ్యవస్థల నిర్మాణం, పనిచేసే విధానం..
  • దేశంలో రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా రాష్ట్రపతి, ప్రధాని నేతృత్వంలోని మంత్రి మండలి, కేబినెట్, కేబినెట్ కమిటీలు, మంత్రుల సాధికార కమిటీల గురించి తెలుసుకోవాలి. రాజకీయ పార్టీలు, వాణిజ్య సంఘాలు, రైతు సంఘాలు తదితర నిర్బంధ సముదాయాలు రాజకీయ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవాలి.
  • న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు, సబార్డినేట్ కోర్టుల నిర్మాణం, విధుల గురించి తెలుసుకోవాలి. న్యాయ సమీక్ష (judicial review), న్యాయ క్రియాశీలత (judicial activism) తదితరాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి.
  • రిఫరెన్స్: Indian Administration, Fadia, and Fadia.

    7. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ముఖ్యాంశాలు..
  • అభ్యర్థులు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను పరిశీలించడం ద్వారా దేశంలో ఎన్నికలకు సంబంధించిన అంశాలను అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉండాల్సిన అర్హతలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల అధికారాలు, అనర్హత తదితర విషయాలపై అవగాహన ఏర్పడుతుంది.
  • రిఫరెన్స్: https://www.lawmin.nic.in/

    8. వివిధ రాజ్యాంగ పదవుల నియామకాలు, రాజ్యాంగ పదవులు, అధికారాలు, విధులు..
  • గవర్నర్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఎన్నికల కమిషన్ సభ్యులు, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంఘాలు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లు, యూపీఎస్సీ, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తదితరాల గురించి తెలుసుకోవాలి. నియామకాలు జరిగే విధానం, విధుల నిర్వహణ పరిస్థితులు, పదవుల నుంచి తొలగించే విధానం తదితరాల గురించి తెలుసుకోవాలి.
  • రిఫరెన్స్: Indian Administration

    9. చట్టబద్ధ, నియంత్రిత, వివిధ పాక్షిక న్యాయ సంస్థలు..
  • యూజీసీ వంటి చట్టబద్ధ సంస్థలకు, ప్రణాళికా సంఘం (Planning Commission) వంటి చట్టబద్ధత లేని సంస్థలకు మధ్య తేడాలను తెలుసుకోవాలి. ఉదారవాద విధానం అమలుతో మార్కెట్ వ్యవస్థ ప్రాధాన్యతను సంతరించుకోవటం తద్వారా సామా జిక న్యాయానికి ప్రమాదం సంభవిస్తుంది. ఈ నేప థ్యంలో రాజ్యం తరఫున మార్కెట్‌ను నియంత్రించడా నికి, సగటు పౌరుని ప్రయోజనాలను పరిరక్షించడానికి రెగ్యులేటరీ(నియంత్రిత) వ్యవస్థలు ఏర్పరచబడ్డాయి. ఇవి అర్థ, న్యాయ సంబంధ విధులను నిర్వర్తిస్తాయి.
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), SEBI, IRDA, Bar Council of India, Medical cou-ncil of India, AICTE తదితర నియంత్రిత సంస్థ ల నిర్మాణం, కార్యకలాపాల గురించి తెలుసుకోవాలి.
  • రిఫరెన్స్: దినపత్రికలు, మేగజీన్లు..

    10. ప్రభుత్వ విధానాలు (Government Policies), ప్రగతికి ప్రభుత్వం చూపే చొరవ..
  • రాజ్యపు ఆశయాల అమలుకు ప్రభుత్వం విధానపర మైన నిర్ణయాలు గైకొంటుంది. ఉదాహరణకు పారిశ్రామిక విధానం; వ్యవసాయ విధానం; ఎగుమతులు, దిగుమతులు; బొగ్గు, స్పెక్ట్రం కేటాయింపులు; విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు). వీటి రూపకల్పన, అమలు, మూల్యాంకనం మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.
  • రిఫరెన్స్: Public Policy: Formulation and Evaluation, R.K.Sapru.

    11. అభివృద్ధి ప్రవృత్తి, ప్రగతికి దోహదం చేసే పరిశ్రమలు..
  • అభివృద్ధి ప్రక్రియలో జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల (NGOs) పాత్రను తెలుసుకోవాలి.
  • పేదల సాధికారతలో స్వయం సహాయక సంఘాలు (SHGs) పోషిస్తున్న పాత్ర ఏమిటో తెలుసుకోవాలి.
  • కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)తో పాటు అభివృద్ధి కార్యకలాపాల్లో వ్యక్తిగత దాతలు, దాతృత్వ సంస్థల భాగస్వామ్యం గురించి చదవాలి.
  • రిఫరెన్స్: Development Administration, R.K.Sapru.

    12. బలహీన వర్గాలు-సంక్షేమ పథకాలు...
  • పేదలు, మహిళలు, పిల్లలు, అనాదలు, రోగులు తదితరుల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి. పథకాలు అమలవుతున్న తీరు గురించి కూడా చదవాలి.
  • గ్రామీణ గృహ పథకం; వృద్ధాప్య పింఛను పథకం; పేద విద్యార్థులకు ఫీజుల తిరిగి చెల్లింపు పథకం; దారిద్య్ర రేఖకు దిగువున (బీపీఎల్) ఉన్న వారికి ఆహార ధాన్యాల ఉచిత సరఫరా తదితరాలపై అభ్యర్థులు అధ్యయనం చేయాలి.
  • రిఫరెన్స్: India Yearbook, 2013-chapter on Welfare programmes.

    13. సామాజిక రంగ సేవల (social sector services) అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన అంశాలు....
  • వైద్యం; విద్య; రోడ్లు, రవాణా, గృహ నిర్మాణం, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పన గురించి తెలుసుకోవాలి.
  • నిధుల లేమి, సేవలు అందించాల్సిన వారిలో ఆసక్తి కొరవడటం, ప్రజల్లో చైతన్యం లేకపోవడం, అవినీతి తదితర అంశాలను అధ్యయనం చేయాలి.
  • నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం), సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)లపై దృష్టిసారించాలి.
  • రిఫరెన్స్: వార్తాపత్రికలు, మేగజీన్లు.. పేదరికం,

    14. ఆకలి సంబంధిత అంశాలు...
  • ఉపాధి అవకాశాలు సరిగా లేకపోవడం, నైపుణ్యాల లేమి, నిరక్షరాస్యత, పోషకాహార లోపం తదితర అంశాల గురించి తెలుసుకోవాలి. పేదరిక నిర్మూలన, ప్రజలను ఆకలి నుంచి తప్పించడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడటంపైనా దృష్టిసారించాలి.
  • మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విజయాలు, వైఫల్యాలపై దృష్టి పెట్టాలి.
  • రిఫరెన్స్: వార్తాపత్రికలు, టీవీ కార్యక్రమాలు

    15. పరిపాలనలో ముఖ్యాంశాలు: పారదర్శకత, జవాబుదారీతనం..
  • సుపరిపాలనకు ఈ-గవర్నెన్స్ సమర్థవంతమైన వ్యవ స్థ. అయితే ప్రజల్లో అజ్ఞానం, నిరక్షరాస్యత, విద్యుత్, బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం తదితర మౌలిక వసతుల లేమి, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య సమన్వయం సరిగా లేకపోవడం మొదలైన సమస్యలకు ఆచరణాత్మకమైన పరిష్కార మార్గాలను అభ్యర్థులు సూచించగలగాలి. సిటిజన్ చార్టర్లు, సమాచార హక్కు మొదలైన అంశాలమీద సరిైయెున అవగాహన కలిగి ఉండాలి.
  • రిఫరెన్స్: Public Administration, Avasthi & Maheswari.

    16. ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీస్ పాత్ర...
  • ఆధునిక రాజ్యంలో సివిల్ సర్వీస్ ప్రాముఖ్యత ఏమి టో తెలుసుకోవాలి. సమాజంలో సుస్థిరతను పెంపొందించడంలో సివిల్ సర్వీస్ పాత్రను అర్థం చేసుకోవాలి. సమాజాన్ని సంఘటితపరచడంలో దాని కృషి, ప్రాథమిక సేవలను అందించడం, జాతి నిర్మాణ కార్యకలాపాలు చేపట్టడం తదితర అంశాలను తెలుసుకోవాలి. (పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్)

    17. భారత్, పొరుగు దేశాలతో సంబంధాలు..
  • దక్షిణాసియా ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాంతంలోని మిగిలిన దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. ఇదే సమయంలో విస్తీర్ణం, జనాభాల పరంగా భారత్ పెద్దగా ఉండటంతో పొరుగుదేశాల్లో అసూయ కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు అంత బాగా లేవనే చెప్పొచ్చు.
  • అభ్యర్థులు ప్రత్యేకంగా భారత్-చైనా; భారత్-పాకిస్థాన్ సంబంధాలతోపాటు భారత్ అనుసరిస్తున్న లుక్ ఈస్ట్ పాలసీ విధానంపై దృష్టిసారించాలి.
  • రిఫరెన్స్: India's Foreign policy, Sumit Ganguly.

    18. ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్ గ్రూపులు- భారత్‌తో సంబంధమున్న ఒప్పందాలు..
  • NAM, SAARC, BRICS, G20తదితరాలకు సంబంధించిన అంశాలను చదవాలి.
  • రిఫరెన్స్: వార్తాపత్రికలు, మేగజీన్లు..

    19. భారత్‌పై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల విధానాలు, రాజకీయాల ప్రభావం...
  • భారత్‌పై ప్రపంచీకరణ ప్రభావంపై అధ్యయనం చేయాలి. దేశ విదేశాంగ విధానంలో ప్రవాస భారతీయుల ప్రభావమేంటో తెలుసుకోవాలి.
  • రిఫరెన్స్: వార్తాపత్రికలు, మేగజీన్లు..

    20. ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు...
  • ఐక్యరాజ్య సమితి (యూఎన్), దాని ప్రత్యేక సంస్థలైన UNDP, WHO, UNESCO తదితరాల గురించి తెలుసుకోవాలి.
  • ప్రపంచ బ్యాంక్; ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో తదితర సంస్థల గురించి చదవాలి.
  • రిఫరెన్స్: International Organizations, Clive Archer.
  • Published date : 13 Jun 2013 08:47PM

    Photo Stories