వన్-టైమ్ బోనస్: హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగులకు బొనాంజా
Sakshi Education
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 72,800 కోట్లు) ఆదాయ మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ప్రత్యేకంగా వన్-టైమ్ బోనస్ ప్రకటించింది.
ఇందుకోసం సుమారు రూ. 700 కోట్లు వెచ్చిస్తోంది. 2021 ఫిబ్రవరిలో ఈ స్పెషల్ బోనస్‌ను చెల్లించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఏడాది పైగా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు దాదాపు 10 రోజుల వేతనానికి సరిసమానంగా ఇది ఉంటుందని పేర్కొంది. సంస్థలో 1,59,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. 2020లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 10 బిలియన్ డాలర్ల ఆదాయం మైలురాయిని అధిగమించింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన తరుణంలోనూ ప్రతీ ఉద్యోగీ ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించి, సంస్థ వృద్ధికి తోడ్పడ్డారని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అప్పారావు వి.వి. తెలిపారు. డిజిటల్ సర్వీసులు, ఇతర ఉత్పత్తుల ఊతంతో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 31.1 శాతం పెరిగి రూ. 3,982 కోట్లకు ఎగిసింది. అలాగే ఆదాయం 6.4 శాతం పెరిగి రూ. 19,302 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం గెడైన్‌స అంచనాలను 1.5-2.5 శాతం నుంచి 2-3 శాతానికి పెంచింది.
Published date : 09 Feb 2021 04:05PM