కరోనా ఎఫెక్ట్: ఈ ప్రముఖ కంపెనీలో కూడా 12000 మంది ఉద్యోగులు ఔట్ !
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది.

కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా విమానయాన రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో బోయింగ్ సుమారు 12 వేల మందిని తొలగించేందుకు నిర్ణయించింది. రాబోయే కొద్ది నెలల్లో అనేక వేల ఉద్యోగాలను తొలగించనున్నామని బోయింగ్ ప్రతినిధి మే 27న తెలిపారు. అయితే ఎంతమంది అనేది స్పష్టంగా పేర్కొనలేదు. కోవిడ్-19 మహమ్మారి వైమానిక పరిశ్రమను ఘోరంగా దెబ్బతీసిందని, దీంతో రాబోయే కొన్నేళ్లలో వాణిజ్య జెట్ల తయారీని బాగా తగ్గించనున్నామని బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ ఉద్యోగులకు అందించిన సమాచారంలో తెలిపారు. 6770 అమెరికా ఉద్యోగులను ఈ వారంలో తొలగిస్తామనీ, మరో 5,520 మంది స్వచ్ఛందంగా సంస్థను వీడడానికి అంగీకరించారని వెల్లడించారు. తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకుంటామని డేవిడ్ చెప్పారు. అంతర్జాతీయంగా కూడా ఉద్యోగ కోతలు ఉంటాయన్నారు.
Published date : 28 May 2020 12:55PM