Skip to main content

Polycet Free Coaching: పాలిసెట్‌ ఉచిత కోచింగ్‌

Polycet Free Coaching
Polycet Free Coaching

కౌటాల(సిర్పూర్‌): అడవుల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ పేద కుటుంబాలకు చెందిన వారే.. చాలామంది పదో తరగతి తర్వాత ఏం చేయాలో తెలియక ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం, ఇతర పనులకు వెళ్తుంటారు. ఉద్యోగావకాశాలు ఉన్న కోర్సులపై దృష్టి సారించలేక, కోచింగ్‌కు వెళ్లే స్తోమత లేక అర్ధంతరంగా చదువు మానేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రవేశ పరీక్షలకు కోచింగ్‌ అందించడం తల్లిదండ్రులకు సైతం భారంగా మారింది.

రూ.వేలల్లో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చదువుకు పేదరికం అడ్డుకావొద్దనే సదుద్దేశంతో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్వంలో కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జిల్లా సైన్స్‌ అధికారి కటుకం మధుకర్‌ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌లో ఉచిత పాలిసెట్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. మూడేళ్లుగా పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ అందిస్తున్నారు.

నేటి నుంచి తరగతులు ప్రారంభం

జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి కాగజ్‌నగర్‌లోని డీఆర్సీ భవనంలో పదో త రగతి విద్యార్థులకు ఉచిత పాలిసెట్‌ కోచింగ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.యాదయ్య తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు శిక్షణ కోసం కాగజ్‌నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని డీఆర్సీ భవనంలో ఏర్పాట్లు చేశారు. కాగజ్‌నగర్‌ పట్టణంతో పాటు కౌటాల, సిర్పూర్‌(టి), చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్‌ ప్రాంతాల్లోని విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారు. అనుభవజ్జులైన ఉపాధ్యాయులు కె.మధుకర్‌(డీఎస్‌వో), ఎం.శ్రీశైలం(ఎస్‌ఏ), ఎండీ సబీర్‌(ఎస్‌ఏ), శాంతికుమార్‌(ఎస్‌ఏ), డి.మోహన్‌(ఎస్‌ఏ), టి.వెంకటరమణ(ఎస్‌ఏ), ఎం.తిరుపతయ్య(ఎస్‌ఏ), టి.శ్యాంసుందర్‌(ఎస్‌ఏ) తరగతులు బోధించనున్నారు. నలభై రో జుల పాటు విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సబ్జెక్టుల వారీగా తరగతులు నిర్వహిస్తారు. మెటీరియల్‌ను సైతం ఉచితంగా అందిస్తారు. వారానికి గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఉన్నతాధికారులు సైతం శిక్షణ కేంద్రాన్ని సందర్శించి సలహాలు, సూచనలు అందిస్తూ తరగతులు బోధిస్తారు. పేద విద్యార్థులు కోచింగ్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోఆర్డి నేటర్‌ మధుకర్‌ కోరారు.

సద్వినియోగం చేసుకోవాలి

పేదరికం ప్రతిభకు ఆటంకం కాకూడదు. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్‌ సంస్థల్లో చేరలేని విద్యార్థులకు పాలిసెట్‌ ఉచిత కోచింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో కోచింగ్‌ ఇప్పిస్తాం. పాలిసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించి ప్రభుత్వ కళాశాల్లో సీటు సాధిస్తే అధిక ఫీజులు లేకుండా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. పదో తరగతి తర్వాత ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడుతారు. 150 మంది విద్యార్థులకు కోచింగ్‌ ఇస్తాం. ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి. ఇతర వివరాలకు 9441140434 నంబర్‌లో సంప్రదించాలి. – కటకం మధుకర్‌, కోఆర్డినేటర్‌, కాగజ్‌నగర్‌

మూడేళ్లుగా శిక్షణ తరగతులు

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన పేద విద్యార్థుల కోసం మూడేళ్లుగా కాగజ్‌నగర్‌ పట్టణంలో ఉచితంగా పాలిసెట్‌తో పాటు టీజీఆర్‌జేసీ, ఎంజేపీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ, ఇతర ప్రవేశ పరీక్షలకు కోచింగ్‌ ఇస్తున్నారు. ఏటా 150 మందికి అవకాశం కల్పిస్తున్నారు. 2022లో కోచింగ్‌ తరగతులు ప్రారంభించగా మొదటి ఏడాది 90 మంది విద్యార్థులు కోచింగ్‌ తరగతులకు హాజరయ్యారు. అందులో 65 మంది ఆయా కోర్సుల్లో సీట్లు సాధించారు. 2023లో 108 మంది విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరు కాగా అందులో 98 మంది విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించి ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సాధించారు. 2024లో మొత్తం 150 మంది విద్యార్థులకు 132 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబర్చారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా 150 మందికి శిక్షణ అందించనున్నారు. రూ.వేలు ఫీజులు చెల్లించి కార్పొరేట్‌ సంస్థల్లో శిక్షణ పొందలేని పేద విద్యార్థులకు ఉచితంగా అత్యున్నత నాణ్యత, ప్రమాణాలతో తరగతులు నిర్వహిస్తున్నారు.

ఉన్నత స్థానానికి చేరడమే లక్ష్యం

టీఎస్‌ఆర్‌జేసీ పోటీ పరీ క్షకు ఏవిధంగా సన్నద్ధం కావాలో తెలియని నాకు ఈ కోచింగ్‌ ఎంతో ఉపయోగపడింది. తరగతులకు క్రమం తప్పకుండా హాజరయ్యా. ఉపాధ్యాయులు ఇచ్చిన సలహాలు, సూచనలతో టీఎస్‌ ఆర్‌జేసీలో సీటు సాధించి ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశా. ప్రస్తు తం నీట్‌ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నా. ఉన్నత స్థానానికి చేరాలన్నదే నా లక్ష్యం. – ఎస్‌.దీప్తి, కాగజ్‌నగర్‌

సులభ పద్ధతిలో బోధన

పాలిసెట్‌లో ర్యాంకు రావడానికి కోచింగ్‌ ఎంతో ఉపయోగపడింది. పోటీ పరీక్ష ఏ విధంగా ఉంటుంది. ఎలా సన్నద్ధం కావాలి? అనే విషయాలను సులభ పద్ధతిలో అవగాహన కల్పించారు. సందేహాలు నివృత్తి చేస్తూ పోటీ పరీక్షకు సిద్ధం చేశారు. గతేడాది పాలిసెట్‌లో 714 రాంక్‌ సాధించి హసన్‌పర్తిలోని టీజీఆర్‌జేసీ కళాశాలలో సీటు సాధించా. – ఎస్‌.నాగప్రణతి, కాగజ్‌నగర్‌

Published date : 08 Apr 2025 05:09PM

Photo Stories