Skip to main content

Part Time Employees : క్రమబద్ధీకరణ కోరడం కుదరదు..ఎందుకంటే..

న్యూఢిల్లీ: పార్ట్‌–టైమ్‌ ఉద్యోగులు మంజూరైన పోస్టుల్లో పని చేయడం లేదని, వారు క్రమబద్ధీకరణ(రెగ్యులరైజేషన్‌) కోరడం కుదరని సుప్రీంకోర్టు అక్టోబ‌ర్ 7వ తేదీన తేల్చి చెప్పింది.

ప్రభుత్వాలు ప్రకటించే రెగ్యులరైజేషన్‌ పాలసీకి అనుగుణంగానే క్రమబద్ధీకరణ చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. ఎవరూ క్రమబద్ధీకరణను తమ హక్కుగా భావించకూడదని స్పష్టం చేసింది. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం పార్ట్‌–టైమ్‌ ఉద్యోగుల విషయంలో వర్తించదని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

ఏదైనా ఒక విధానాన్ని రూపొందించడం...
ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో పార్ట్‌–టైమ్, తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్నవారు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలని కోరడం సమంజసం కాదని సూచించింది. పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌(క్యాట్‌) ఆర్డర్‌ను సవరిస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టు గతంలో ఉత్తర్వు జారీ చేసింది. నిర్దిష్టమైన రెగ్యులరైజేషన్‌ పాలసీ రూపొందించాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విభాగాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 కింద హైకోర్టు ఆదేశించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఒక విధానాన్ని రూపొందించడం కేవలం ప్రభుత్వం బాధ్యత అని, దాంతో కోర్టుకు సంబంధం లేదని తెలియజేసింది.

Published date : 08 Oct 2021 06:12PM

Photo Stories