Skip to main content

Layoffs Crisis: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై ఆందోళ‌న వ‌ద్దు... ఇలా చేస్తే మీ ఉద్యోగం గ్యారంటీ

ఇప్పుడు భారత ఐటీలో మాంద్యం కాదు.. దిద్దుబాటు జరుగుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. భయపడే స్థాయిలో ప్రస్తుతం పరిస్థితులు లేవని వారు చెబుతున్నారు. ఉద్యోగం పోయినా మరొక కంపెనీలో చేరుతున్నారు తప్ప రోడ్డున పడ్డ వారెవరూ ఐటీలో లేరని స్పష్టం చేస్తున్నారు. 2001, 2008లో ఐటీ రంగం మందగమనానికి లోనై తిరిగి గాడిలో పడింది. ఏ రంగానికైనా ఒడిదుడుకులు సహజం. ఇందుకు ఐటీ మినహాయింపు కాదని నిపుణులు అంటున్నారు.
Software Jobs
Software Jobs

ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు కొత్త ప్రాజెక్టుల రాకలో స్పీడ్‌ తగ్గింది. క్లయింట్‌ అవసరాలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన, కోడింగ్‌ చేస్తాయి. పరీక్షలు జరిపి అడ్డంకులు లేవని నిర్ధారించుకున్నాక ఆ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తాయి. ఆ తర్వాత క్లయింట్లకు కావాల్సిన సపోర్ట్‌ను ఒప్పందంలో భాగంగా ఐటీ కంపెనీలు కొన్నేళ్లపాటు కొనసాగిస్తాయి. కరోనా కాలంలో వచ్చిన ప్రాజెక్టులు దాదాపు ఇప్పుడు సపోర్ట్‌ దశకు వచ్చాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. అంటే ప్రస్తుతం సపోర్ట్‌ సేవలు అందించే సిబ్బందికే ఎక్కువ పని ఉంటుందన్నది వారి మాట. సదరు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కంపెనీకి కొత్త ప్రాజెక్టులు లేకపోతే డిజైన్, కోడింగ్, టెస్టింగ్‌ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు మరో మార్గాలను వెతుక్కుంటున్నారు.  

చ‌ద‌వండి: ఊహించినట్టే.. షాకిచ్చిన మెటా.. 4000 ఉద్యోగులు ఇంటికి..

మరోవైపు టెక్నాలజీ రోజురోజుకూ వేగంగా మారుతోంది. నూతన ప్రాజెక్టులు తగ్గాయి. కరోనా కాలంలో ఉద్యోగులు మూడు రెట్ల వరకు వేతనం అందుకోవడంతో ప్రస్తుతం కంపెనీలకు భారంగా పరిణమిస్తోంది. అందుకే వ్యయ నియంత్రణతోపాటు వ్యాపార పునర్వ్యవస్థీకరణకు నడుం బిగించాయి. కొత్త సాంకేతికతకు అప్‌గ్రేడ్‌ కాని ఉద్యోగులకు స్వస్తి పలుకుతున్నాయి. హైబ్రిడ్‌ లేదా వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ విధానాలవైపు మళ్లడంతో ఉద్యోగులు ఆఫీసుకు రాక తప్పడం లేదు. పని లేక బెంచ్‌పై ఖాళీగా కూర్చున్న సిబ్బందిని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సంస్థలు ఇంటికి పంపించివేస్తున్నాయి.

It Jobs

ఐటీతో ముడిపడి..
సాంకేతికత ఏదైనా సామాన్యుడికి చేరితేనే భవిష్యత్తు. ఫ్యూచర్‌ను అంచనావేసి అందుబాటులోకి తెచ్చిన ఏ పరిష్కారమైనా ఆదరణ చూరగొంటుంది. ఇప్పుడు ఐటీలో అదే జరిగింది. ఒకప్పుడు బ్యాంకులో క్యూలో నిలుచున్న రోజులు గుర్తుండే ఉంటాయి. నేడు పేమెంట్, బ్యాంకింగ్‌ యాప్స్‌తో క్షణాల్లో పని కానిచ్చేస్తున్నాం. ఫుడ్‌ డెలివరీ, రైడ్‌ హెయిలింగ్‌ యాప్స్, ఓటీటీ వేదికలు, సామాజిక మాధ్యమాలు.. ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే అవుతుంది. ఈ అప్లికేషన్స్‌ను (యాప్స్‌) నడిపించేది సాంకేతికతనే. మానవ జీవితంలో సాంకేతికత లేకపోతే మనుగడ అసాధ్యం అన్నంతగా ముడిపడింది. ఆర్థికంగా, సామాజికంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకే ఐటీకి భవిష్యత్తు ఎప్పుడూ ఉంటుందన్నది నిపుణుల మాట.

చ‌ద‌వండి: యాపిల్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు

మనవాళ్లే ఎందుకంటే..
భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల ప్రకారం.. ఇక్కడ మానవ వనరులకు అయ్యే ఖర్చు తక్కువ. అధిక నైపుణ్యం ఉన్నవారు దేశంలో కోకొల్లలు. ఇతర భాషలూ మాట్లాడగలరు. వివిధ దేశాల్లో ఉన్న క్లయింట్ల సమయం ప్రకారం పనిచేసేందుకు వెనుకాడరు. తార్కిక ఆలోచన (లాజికల్‌ థింకింగ్‌) భారతీయులకు ఎక్కువ. క్లయింట్ల ఆలోచనను సులువుగా అర్థం చేసుకుంటారు. కొన్నేళ్లుగా విద్యావిధానంలో వచ్చిన మార్పులు ఇందుకు దోహదం చేస్తున్నాయి. మరో ముఖ్య విషయం టీమ్‌ వర్క్‌ భారతీయుల ప్రత్యేకత. సమష్టి కృషి వల్ల పనులను నాణ్యత తగ్గకుండా, త్వరితగతిన పూర్తి చేయగలరు. కోడింగ్‌లో భారతీయులు దిట్ట.

It Jobs

క్యాప్టివ్‌ కంపెనీల్లో నియామకాలు..
ఐటీ కంపెనీల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్యాప్టివ్‌. అంటే తమ గ్రూప్‌ కంపెనీల కోసం సొంతంగా ఐటీ సేవలు, బ్యాక్‌ ఎండ్‌ సపోర్ట్‌ అందించేవి. మరొకటి క్లయింట్లు, ఎండ్‌ యూజర్ల కోసం పనిచేసే ఐటీ కంపెనీలు. కరోనా కాలంలో భారత్‌కు క్యాప్టివ్‌ కంపెనీలు క్యూ కట్టాయి. గోల్డ్‌మన్‌ శాక్స్, పెప్సికో, అపెక్స్‌ ఫండ్, సిట్కో ఫండ్, యూబీఎస్, స్టేట్‌ స్ట్రీట్‌ వంటివి వీటిలో ఉన్నాయి. క్యాప్టివ్‌ కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాయి. ఈ రిక్రూట్‌మెంట్‌ ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. రూ.5–12 లక్షల వార్షిక వేతనాల విభాగంలో కొత్త వారిని ఎక్కువగా చేర్చుకుంటున్నాయి. క్లయింట్ల కోసం పనిచేసే ఐటీ కంపెనీలు కొత్త నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరోవైపు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో రిక్రూట్‌మెంట్‌ జరుగుతూనే ఉంది. 

అప్‌గ్రేడ్‌ అవ్వాల్సిందే..
సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ వంటివి చొచ్చుకు వస్తున్నాయి. టెక్నాలజీ మార్పులకు తగ్గట్టుగా ఈ రంగంలో పనిచేస్తున్న మానవ వనరులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిందే. లేదంటే ఇంటిబాట తప్పదని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. 2023లో కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంపై ఈ రంగ నిపుణులు దృష్టి సారిస్తున్నారు. సర్టిఫికెట్‌ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఫుల్‌ స్టాక్‌ డెవలపర్, టెస్టింగ్, డేటా సైంటిస్ట్, క్లౌడ్‌ ఇంజినీర్, స్క్రమ్‌ మాస్టర్‌ వంటి నిపుణులకు భారీగా డిమాండ్‌ ఉంది. 

చ‌ద‌వండి: 2.70 లక్షల మంది తొలగింపు..ఎప్పుడు? ఎక్కడా?

ఐటీలో ఏదో ఒక ఉద్యోగం..
2020కి ముందు శిక్షణ సంస్థల్లో ఐటీ కోర్సులు నేర్చుకున్న వారిలో 40 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2021, 2022లో అభ్యర్థుల సంఖ్య రెండింతలైంది. 70–80 శాతం మంది జాబ్స్‌ సంపాదించారు. గడచిన రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం నేర్చుకోవడానికి వచ్చే అభ్యర్థుల సంఖ్య 25 శాతం తగ్గింది. సక్సెస్‌ రేట్‌ 50 శాతం ఉంది. మాంద్యం వార్తల నేపథ్యంలో అభద్రతా భావం వల్లే శిక్షణ కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిందని ఇన్‌స్టిట్యూట్స్‌ చెబుతున్నాయి. మరోవైపు ఏళ్ల తరబడి గ్రూప్స్‌కు సన్నద్ధం అయినవారు ఇప్పుడు ఐటీ వైపు చూస్తున్నారు. కొత్తగా శిక్షణ కోసం వచ్చిన వారిలో ఇటువంటి వారి సంఖ్య 50 శాతంపైగా ఉంటోందని సమాచారం. సబ్జెక్ట్‌ నేర్చుకుంటే ఐటీలో ఏదో ఒక ఉద్యోగం వస్తుందన్నది వారి నమ్మకం.

It Jobs

కోవిడ్‌ తెచ్చిన మార్పులు..
ఒకప్పుడు బీటెక్‌లో ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, ఐటీతోపాటు ఎంసీఏ చదివినవారు ఐటీ వైపు వచ్చేవారు. మహమ్మారి కాలంలో, అలాగే ప్రస్తుతం డిగ్రీ పూర్తి అయినవారు, ఇతర విద్యార్హతలు ఉన్నవారూ సంబంధిత కోర్సులు చేసి ఐటీలో ప్రవేశిస్తున్నారు. అధిక వేతనాలు వీరిని ఆకర్షిస్తున్నాయి. ప్రాజెక్టులు వెల్లువెత్తడంతో కంపెనీలు అభ్యర్థుల విద్యార్హతలను పట్టించుకోకుండా నియామకాలు చేపట్టాయి. నాన్‌ బీటెక్, నాన్‌ ఐటీ నుంచి ఇటువైపు రావడం 2021 నుంచి ట్రెండింగ్‌ అయింది. 

చ‌ద‌వండి: ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల ఉద్యోగాలు తొల‌గింత‌... ఐటీ అంటేనే భ‌య‌ప‌డుతున్న ఉద్యోగులు

వేతనాలు ఇలా..
కొత్త కోర్సు నేర్చుకుని అప్‌గ్రేడ్‌ అయినవారు అదే సంస్థలో సగటున వేతనంలో 70-80 శాతం హైక్‌ సాధిస్తున్నారు. కంపెనీ మారినవారైతే రెండింతల శాలరీతో జాక్‌పాట్‌ కొట్టేస్తున్నారు. కీలక విభాగాల్లో పనిచేస్తున్న నిపుణుల జీతాలు మూడు రెట్ల వరకు అధికం అయ్యాయంటే ప్రస్తుత డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. కంపెనీ, ఉద్యోగి సామర్థ్యాలను బట్టి కోవిడ్‌ ముందు, ప్రస్తుతం వార్షిక వేతనాలు సగటున ఇలా ఉన్నాయి. 

అనుభవం            కోవిడ్‌ ముందు             ప్రస్తుతం 
                     (వార్షిక వేతనాలు లక్షల్లో)
ఫ్రెషర్స్                   రూ.2–5                     రూ.4–10
1–3 ఏళ్లు                  రూ.5–8                    రూ.8–20
3–10 ఏళ్లు               రూ.6–16                   రూ.15–40
10–15 ఏళ్లు             రూ.15–25                 రూ.25 లక్షల – రూ.1 కోటి    
15 ఏళ్లకుపైబడి        రూ.30–70                రూ.40 లక్షల – రూ.1 కోటి

Published date : 02 May 2023 01:29PM

Photo Stories