Skip to main content

హైదరాబాద్‌లో ఫియట్ డిజిటల్ హబ్..1,000 ఉద్యోగాలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగంలో లండన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సీఏ) హైదరాబాద్‌లో గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు చేసింది.
ఉత్తర అమెరికా తర్వాత కంపెనీకి ఇదే అతిపెద్ద డిజిటల్ కేంద్రం. సంస్థ డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించేందుకు సాంకేతిక వెన్నుదన్నుగా ఈ కేంద్రం పనిచేయనుంది. కనెక్టెడ్ వెహికల్ సర్వీసెస్, డేటా సెనైస్స్, క్లౌడ్ వంటి సర్వీసెస్‌పై ఫోకస్ చేస్తుంది. ఐసీటీ ఇండియా పేరుతో గచ్చిబౌలిలో ఏర్పాటైన ఈ సెంటర్ కోసం ఇప్పటికే 200 మందిని నియమించుకున్నారు. ప్రస్తుతం వీరంతా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం 1,000 మందిని చేర్చుకుంటామని ఎఫ్‌సీఏ నార్త్ అమెరికా, ఆసియా పసిఫిక్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మమత చామర్తి బుధవారం వర్చువల్ సమావేశంలో మీడియాకు తెలిపారు. హైదరాబాద్ కేంద్రానికి సుమారు రూ.1,100 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు వెల్లడించారు.

ప్లాంటు పెట్టండి: కేటీఆర్..
ఎఫ్‌సీఏ రాకతో హైదరాబాద్‌లో ఆవిష్కరణల వాతావరణాన్ని మరింత మెరుగు పరుస్తుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ సందర్భంగా అన్నారు. హైదరాబాద్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను కోరారు. కాగా, ఇప్పటికే దేశంలో ఎఫ్‌సీఏకు పుణే, చెన్నైలో ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని రంజన్‌గావ్ వద్ద తయారీ ప్లాంటు ఉంది. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే జీప్ కంపాస్ ఎస్‌యూవీని 13 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. భారత్‌లో 3,000 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌సీఏ గ్రూప్ 100కుపైగా తయారీ, 40కి పైచిలుకు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. క్రైస్లర్, జీప్, ఫియట్ ప్రొఫెషనల్, మసెరాటి బ్రాండ్లలో కార్లను విక్రయిస్తోంది.
Published date : 17 Dec 2020 04:38PM

Photo Stories