Skip to main content

ఏప్రిల్‌ నుంచి టేక్‌ హోమ్‌ శాలరీలో భారీగా కోత!

న్యూఢిల్లీ, సాక్షి: వచ్చే ఆర్థిక సంవత్సరం(2021–22) నుంచీ ఉద్యోగులకు లభించే నికర వేతనాలలో కోతపడే అవకాశముంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం ఇకపై అలవెన్సుల వాటా 50 శాతానికి మించరాదు. దీంతో బేసిక్‌ శాలరీని 50 శాతంగా నిర్ణయించవలసి ఉంటుందని సంబంధితవర్గాలు చెబుతున్నాయి. 2019 కొత్త వేతన నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలయ్యే వీలున్నట్లు పేర్కొన్నాయి. దీంతో కంపెనీలు పే ప్యాకేజీలలో సవరణలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డాయి. ఫలితంగా ఏప్రిల్‌ నుంచీ టేక్‌ హోమ్‌ శాలరీ తగ్గే చాన్స్‌ ఉన్నట్లు తెలియజేశాయి. తాజా నిబంధనలపై నిపుణులు ఏమంటున్నారంటే...

కొత్త వేతన నిబంధనలు అమలైతే..
కొత్త వేతన నిబంధనలు అమలైతే జీతాలలో అలవెన్స్‌ వాటా 50 శాతానికి మించరాదు. దీంతో బేసిక్‌ శాలరీ వాటా 50 శాతానికి చేర్చవలసి ఉంటుంది. ఫలితంగా గ్రాట్యుటీకోసం చెల్లింపులు, ప్రావిడెండ్‌ ఫండ్‌కు ఉద్యోగుల జమలు పెరిగే అవకాశముంది. వెరసి ఉద్యోగులు అందుకునే నికర వేతనాలలో ఆమేర కోత పడే చాన్స్‌ ఉంది. అయితే ఈ మార్పులతో రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ పెరగనున్నాయి. ప్రయివేట్‌ రంగంలో చాల కంపెనీలు అలవెన్సుల వాటాను అధికంగా ఉంచుతూ.. నాన్‌అలవెన్స్‌ వాటాను 50 శాతానికంటే తక్కువ స్థాయిలో అమలు చేస్తున్నాయి. ఫలితంగా కొత్త వేతన నిబంధనలు ప్రయివేట్‌ రంగ కంపెనీలపై అధికంగా ప్రభావం చూపే వీలుంది. అయితే తాజా నిబంధనలు ఉద్యోగులకు సామాజిక భద్రతతోపాటు.. పదవీ విరమణ లాభాలను పెంచే వీలుంది. కొత్త వేతన నిబంధనలు అమలుచేస్తే కంపెనీలకు 10–12 శాతం మేర ఉద్యోగ వ్యయాలు పెరగవచ్చు. వేతన కోడ్‌ను గతేడాది పార్లమెంట్‌ ఆమోదించింది. తుది నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రస్తుతం ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది.
Published date : 09 Dec 2020 03:26PM

Photo Stories