Skip to main content

అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..ప్రమోషన్ పద్ధతిలో!

సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఆ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 250 వరకు ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అంగన్‌వాడీ టీచర్లకు పదోన్నతి కల్పించి వీటిని భర్తీ చేయనున్నారు. సూపర్‌వైజర్ పోస్టును నేరుగా కాకుండా అంగన్‌వాడీ టీచర్ల అర్హత మేరకు పదోన్నతి ఇచ్చి భర్తీ చేసే ప్రక్రియ కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంది. తాజాగా ప్రభుత్వం వివిధ శాఖల్లో పదోన్నతులు చేపట్టాలని అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతమున్న ఖాళీలన్నీ దాదాపు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. 250 ఖాళీలకు అర్హత ఉన్న టీచర్లు 25 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి పదోన్నతి కల్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా... ప్రతి కేంద్రానికి ఒక టీచర్ పోస్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుత పోస్టుల్లో దాదాపు 15 శాతం ఖాళీలున్నాయి. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌కు కనీస అర్హత పదోతరగతి. అలాగే పదేళ్ల పాటు టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. వాస్తవంగా అంగన్‌వాడీ టీచర్ల ఎంపిక సమయంలో 10వ తరగతి అర్హత లేకున్నా... చాలా మంది టీచర్ విధులు చేపట్టిన తర్వాత ఓపెన్‌స్కూల్ సొసైటీ ద్వారా ఉత్తీర్ణత సాధించారు. దీంతో సూపర్‌వైజర్ పోస్టుకు అర్హతలున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలతో అధికారులు పదోన్నతి ప్రక్రియను వేగవంతం చేశారు. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన బాధ్యతలు జేఎన్‌టీయూహెచ్‌కు అప్పగించినట్లు తెలిసింది.
  • రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ సూపర్‌వైజర్ పోస్టులు: 250
  • ఈ పోస్టులకు అర్హత ఉన్న అంగన్‌వాడీ టీచర్లు: 25,000
  • రాష్ట్రంలో మొత్తం ఐసీడీఎస్ ప్రాజెక్టులు:149
  • వీటి పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలు: 35,700
Published date : 09 Feb 2021 04:03PM

Photo Stories