Skip to main content

అమెజాన్‌లో లక్ష ఉద్యోగావకాశాలు: ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..

న్యూఢిల్లీ: పండుగ సీజన్ అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ కంపెనీలు, డెలివరీ సేవల సంస్థలు గణనీయంగా తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటున్నాయి.

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష పైచిలుకు సీజనల్ ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించింది. అలాగే, రవాణా భాగస్వామ్య సంస్థలు, ప్యాకేజింగ్ వెండార్లు, డెలివరీ భాగస్వాములు, అమెజాన్ ఫ్లెక్స్ పార్ట్‌నర్స్, హౌస్‌కీపింగ్ ఏజెన్సీల ద్వారా పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించగలిగినట్లు తెలిపింది. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ మొదలైన వాటిపై పెట్టుబడులు కొనసాగించడం ద్వారా 2025 నాటికి భారత్‌లో 10 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యసాధనకు ఇవి తోడ్పడనున్నాయని అమెజాన్ తెలిపింది. ‘ఈ పండుగ సీజన్‌లో దేశం నలుమూలలా ఉన్న కస్టమర్లకు అత్యంత వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను చేర్చడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం‘ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు.

డెల్హివెరీలో ఇలా...
సరఫరా సేవల సంస్థ డెల్హివెరీ కూడా వచ్చే కొద్ది వారాల్లో వివిధ విభాగాల్లో 15,000 పైచిలుకు సీజనల్ సిబ్బందిని తీసుకోనున్నట్లు వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్‌లో దాదాపు 6.5-7.5 కోట్ల ప్యాకేజీలను హ్యాండిల్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 100% అధికమని వివరించింది. ‘ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాం. గడిచిన ఏడాది కాలంలో బిలాస్‌పూర్, బెంగళూరు, భివండి వంటి ప్రాంతాల్లో మెగా ట్రక్ టెర్మినల్స్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. వచ్చే 18-24 నెలల్లో విస్తరణపై దాదాపు రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం‘ అని డెల్హివెరీ ఎండీ సందీప్ బరాసియా వెల్లడించారు.

మూడు లక్షల ఉద్యోగ అవకాశాలు : రెడ్‌సీర్

ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఈ-కామర్స్, లాజిస్టిక్స్ సంస్థల ద్వారా దాదాపు మూడు లక్షల పైచిలుకు ఉపాధి అవకాశాల కల్పన జరగవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ అంచనా వేస్తోంది. వీటిలో 30 శాతం ఉద్యోగాలు లాజిస్టిక్స్ సంస్థల్లో ఉండనున్నాయి. ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యే ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 7 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటుందని రెడ్‌సీర్ అంచనా. గతేడాది ఇది 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ఫర్నిషింగ్ మొదలైన ఉత్పత్తులకు గణనీయంగా డిమండ్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Published date : 01 Oct 2020 01:04PM

Photo Stories