Skip to main content

50 వేల ఐఐటీయన్లకు భారీ ఉద్యోగ ఆఫర్లు ఇచ్చిన కంపెనీలు వెనక్కు ...?

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ).. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారి భవిష్యత్తుకు ఆకాశమే హద్దు.. ప్రతిభ ఆధారంగా ప్రపంచస్థాయి ఐటీ కంపెనీల్లో ఉద్యోగం.. నెలకు ఊహించనంత వేతనం.. విలాసవంతమైన జీవనం.. అబ్బురపరిచే భవిష్యత్తు.. ఇవన్నీ కరోనా ముందటి మాట.
ఇప్పుడు ఐఐటీయన్ల పరిస్థితి కరోనా దెబ్బకు మారిపోయింది. నెలకు లక్షల రూపాయల వేతనం ఆఫర్‌ చేసిన కంపెనీలు కరోనా ధాటికి ఆ ఆఫర్లను రద్దు చేసుకుంటున్నాయి. లేదంటే వాయిదా వేస్తూ కొన్నాళ్లు ఆగమంటున్నాయి.

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఓ విద్యార్థికి అమెరికాకు చెందిన ఓ ఐటీ కంపెనీ భారీ ఆఫర్‌ ఇచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌లో విధుల్లో చేరాలి. కానీ కరోనా కారణంగా అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. కొత్త ఉద్యోగాలు మాట పక్కన పెడితే అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడటమే గగనమైపోతోంది. దీంతో ఆ విద్యార్థి ఆఫర్‌ను సదరు కంపెనీ రద్దు చేసుకుంటున్నట్లు సమాచారమిచ్చింది. జూన్‌లో ఉద్యోగానికి వెళ్లాలని ఇప్పటికే సిద్ధమైన సదరు విద్యార్థి తన వీసా, ఇతర ఖర్చులకు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు.

 పై రెండు సందర్భాలు భారతీయ మేధో సంపత్తికి అగ్ని పరీక్ష లాంటివే. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ దేశంలోని చురుకైన ప్రతిభావంతుల భవిష్యత్తును సంశయంలో పడేసింది. ఐఐటీలు, ఐఐఎంలలో చదువుకుని బయటకొచ్చిన వారి బంగారు భవిష్యత్తును కరోనా వైరస్‌ కంగాళీలోకి నెట్టేసింది. 2019–20 విద్యా సంవత్సరంలో ఐఐటీలు, ఐఐఎంల ద్వారా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇప్పటికే ఆయా విద్యాసంస్థల్లో నిర్వహించిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందారు.

ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు, పలు రంగాలకు చెందిన వ్యాపార సంస్థలు వారిని ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నట్టు ఆఫర్‌ లెటర్లు ఇచ్చాయి. రెండు నెలల క్రితమే ఈ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు పూర్తి కాగా, సదరు విద్యార్థులు ఉద్యోగాల్లో చేరే సమయం కూడా ఆసన్నమవుతోంది. కరోనా కారణంగా ఇప్పుడు ఆ ఆఫర్లు సందిగ్ధంలో పడ్డాయి. భారీ వేతనంతో ఆఫర్లు ఇచ్చిన కంపెనీలు కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో వాటిని రద్దు చే సుకుంటున్నామని సమాచారమిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఆఫర్లు రద్దు చేసుకోకపోయినా కొన్నాళ్ల తర్వాత చెబుతామంటూ దాటవేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో 40 మంది ఐఐటీయన్లు, 35 మంది ఐఐఎం విద్యార్థులకు ఇలాంటి సమాచారం వచ్చిందని తెలుస్తోంది. ఇంకా ఇంజనీరింగ్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ ల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు పొందిన 50 వేల మంది భవిష్యత్తును కరోనా ఖతం చేసిందని అంచనా.

ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించే యోచన: కేంద్ర మంత్రి
ఐఐటీ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు పొంది కరోనా కారణంగా ఆఫర్లు రద్దయిన వారికి ప్రత్యేక ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై దేశంలోని అన్ని ఐఐటీల డైరెక్టర్లతో మాట్లాడామన్నారు. సంక్షోభ సమయంలో దేశంలోని ప్రతిభావంతుల భవిష్యత్తుకు సాయం చేయాలని నిర్ణయిం చామన్నారు. ఆఫర్లను రద్దు చేసుకోవద్దని సోమవారమే ఆ యా కంపెనీలకు విజ్ఞప్తి చేసిన పోఖ్రియాల్‌.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇబ్బందులు లేకుండా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్స్‌ నిర్వహించాలని 23 ఐఐటీల డైరెక్టర్లకు సూచించారు.

కిం కర్తవ్యం?
ఐఐటీ, ఐఐఎంల విద్యార్థులకు కంపెనీలు పెద్ద ఆఫర్లే ఇస్తుంటాయి. వార్షిక వేతనం కింద కనీసం రూ.10 లక్షలు తక్కువ కాకుండా ఆఫర్‌ చేస్తుంటాయి. ఇప్పుడు అలానే పొందిన ఉద్యోగాలు దక్కకపోవడంతో ఈ ఏడాది పాసైన వారి పరిస్థితి గందరగోళంలో పడనుంది. ఐటీ రంగం లో పాసవుట్ల ప్రాతిపదికనే భవిష్యత్తు ఉంటుంది. అందునా ఐఐటీలు, ఐఐఎంల్లో అయితే అది ప్రాధాన్యతాం శం. ప్రస్తుత ఆఫర్‌ రద్దయితే వచ్చే ఏడాది పాసవుట్లకే ప్రాధాన్యం ఉంటుంది. దీంతో మళ్లీ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

రద్దు చేసుకోకండి: ఏఐపీసీ
ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల కోసం ముందుకొచ్చిన కంపెనీలు విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్లు రద్దు చేసుకోవద్దని ఆల్‌ ఐఐటీస్‌ ప్లేస్‌మెంట్స్‌ కమిటీ (ఏఐపీసీ) కోరింది. ఈ విషయమై ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ వి.రాంగోపాల్‌రావు ఇప్పటికే బహిరంగ విజ్ఞప్తి చేశారు. దేశంలోని ఐఐటీలు ఒక వ్యక్తి, ఒక ఉద్యోగ అవకాశం అనే విధానాన్ని కచ్చితంగా పాటిస్తున్నాయని, ఈ సమయంలో కంపెనీలు ఆఫర్లు రద్దు చేసుకుంటే ఆ విద్యార్థులు ప్రస్తుతానికి ఉద్యోగాలు లేని వారిగా మిగిలిపోతారని గత వారమే ఆయా కంపెనీలను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘ఇది క్లిష్ట సందర్భమని అందరం అర్థం చేసుకోగలం. కానీ మీ వాగ్దానాలను ఉపసంహరించుకోకండి. మీ వాగ్దానం అమల్లోకి వచ్చేందుకు కొంత జాప్యం జరిగితే ఫర్వాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చురుకైన విద్యార్థుల జీవితాలను వివాదాస్పదం చేయకండి. ఈ మాంద్యం నుంచి మీరు ఊహించిన దాని కంటే ముందుగానే వారు మిమ్మల్ని బయటపడేయగల సమర్థులు’అని ఆయన పోస్ట్‌ చేశారు.
Published date : 09 Apr 2020 05:47PM

Photo Stories