Skip to main content

14000 కొత్త ఉద్యోగాలు నియమించుకుంటాం : ఎస్‌బీఐ

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వీఆర్ఎస్ పథకంపై వివరణ ఇచ్చింది.
ఖర్చులను తగ్గించుకునే క్రమంలో స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో ఉద్యోగులను తీసివేస్తోందన్న మీడియా కథనాలను తిరస్కరించింది. ప్రతిపాదిత వీఆర్ఎస్ పథకం 30వేల మంది ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా 'అనుకూలమైన పరిష్కారం' అని తెలిపింది. పైగా తమ సేవల విస్తరణలో భాగంగా ఈ ఏడాది కొత్తగా 14వేల నియామకాలను చేపట్టనున్నామని ప్రకటించింది. వృత్తిపరమైన వృద్ధి పరిమితులు, శారీరక ఆరోగ్య పరిస్థితులు లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా వృత్తిలో వ్యూహాత్మక మార్పు చేయాలనే కోరికను వ్యక్తం చేసిన ఉద్యోగులకు అనుకూలమైన పరిష్కారాన్ని అందించాలని మాత్రమే భావించామని బ్యాంక్ తెలిపింది. తమ విలువైన ఉద్యోగుల పట్ల నిబద్ధతతో ఉన్నామని స్పష్టం చేసింది. దేశంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యం ఇవ్వడం, భారత ప్రభుత్వ జాతీయ అప్రెంటిస్‌షిప్ పథకం కింద అప్రెంటిస్‌లను ఉద్యోగులుగా ఎంపిక చేసుకున్న ఏకైక బ్యాంకు తామే అని ఎస్‌బీఐ వెల్లడించింది. 2020 సంవత్సరంలో 14 వేల మందికి పైగా నియామకాలను చేపట్టే యోచనలో ఉన్నట్టు వివరించింది. ప్రజల అవసరార్థం కార్యకలాపాలను విస్తరిస్తున్న క్రమంలో ఉన్నామనీ, ఇందుకు నిదర్శనమే ఈ నియామకాలని చెప్పింది.

30వేలమందికి ఉద్యోగులను ఇంటికి..
కాగా రెండవ విడత విఆర్ఎస్ పథంలో భాగంగా దాదాపు 30వేలమందికి ఉద్యోగులను ఇంటికి పంపిచేందుకు బ్యాంకు ప్రతిపాదనలను సిద్దం చేసిందనీ, బోర్డు ఆమోదం కోసం ఎదురు చూస్తోందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వీఆర్ఎస్ స్కీంను వ్యతిరేకించనప్పటికీ, కాస్ట్ కటింగ్ లో భాగంగా ఈ చర్య చేపట్టడం లేదని, స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ ఉంటుందని బ్యాంకు తాజాగా వివరణ ఇచ్చింది. మరోవైపు వీఆర్ఎస్ పథకంపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో బ్యాంకు చర్య కార్మిక వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తుందని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రానా విమర్శించారు.
Published date : 08 Sep 2020 03:47PM

Photo Stories