తెలంగాణలో 68 జూనియర్ కాలేజీలు మూసివేత
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాల్లో కొనసాగుతున్న 68 ప్రైవేటు జూనియర్ కాలేజీలను మూసివేస్తూ తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నోటీసులు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని కాలేజీలు ఆయా భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు యాజమాన్యాలకు నోటీసులిచ్చామని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల ఈ మెయిల్ ద్వారా కాలేజీలకు నోటీసులు పంపినట్లు తెలిపారు. నోటీసులు పంపిన కాలేజీల్లో నారాయణ విద్యా సంస్థలకు చెందినవి 26, శ్రీచైతన్యకు చెందినవి 18, శ్రీగాయత్రి విద్యా సంస్థలకు చెందినవి 8, ఎన్‌ఆర్‌ఐ విద్యా సంస్థలకు చెందినవి 5, లియో, ఎస్‌ఆర్, తపస్య, క్షత్రీయ, సరస్వతి కాలేజీలు, శ్రీచైతన్య కాలేజీలు రెండు, పులిపాటి ప్రసాద్, సీవీ రామన్, గౌతమి, క్వీన్ మేరీ విద్యా సంస్థలకు చెందిన కాలేజీలు ఉన్నట్లు జలీల్ వెల్లడించారు. ఆయా కాలేజీలు ప్రస్తుతం ఉన్న భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని, వేరే భవనాల్లోకి షిఫ్ట్ చేసుకుంటే కొనసాగించవచ్చని పేర్కొన్నారు. అయితే షిఫ్టింగ్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఆయా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరినీ ఇతర కాలేజీల్లోకి షిఫ్ట్ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
Published date : 18 Apr 2020 03:31PM