‘సూపర్ 30 ఆనంద్’కు ఎఫ్‌ఎఫ్‌ఈ అవార్డు
Sakshi Education
వాషింగ్టన్: ‘సూపర్ 30’వ్యవస్థాపకుడు, ప్రముఖ గణిత మేధావి ఆనంద్ కుమార్ నిరుపేద విద్యార్థులకు విద్యను అందించడానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక బోధనా పురస్కారం లభించింది.
కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో సంస్థ 25వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ (ఎఫ్‌ఎఫ్‌ఈ) సంస్థ....,ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు 2019ను ఆనంద్‌కుమార్‌కు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అన్ని సమస్యలపై పోరాడటానికి బలమైన ఆయుధం విద్య మాత్రమేనని, అమెరికాయేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయ సమాజం పేదలకు నాణ్యమైన విద్య అందే దిశగా కృషి చేయాలని చెప్పారు. ‘నాణ్యమైన విద్యను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే పేదరికం, నిరుద్యోగం, అధిక జనాభా, పర్యావరణ క్షీణత లాంటి ఎన్నో సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతుంది. అమెరికాసహా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో భారతీయులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. వారు సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలంటే.. విద్య కంటే విలువైన బహుమతి మరొకటి ఉండదు’ అని ఆనంద్ ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గత 18 ఏళ్లుగా ఐఐటీ-జేఈఈ లాంటి క్లిష్టమైన కోర్సులకు ప్రతి ఏడాది 30 మంది విద్యార్థులను ఎంచుకుని, వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడంకోసం ఆనంద్.... సూపర్ 30 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Published date : 20 Sep 2019 04:10PM