Skip to main content

సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఏపీ ఇంటర్ ప్రాక్టికల్స్: వి.రామకృష్ణ

గుంటూరు: ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణలో అడ్డదారులు తొక్కే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ఇంటర్మీడియెట్ విద్య ప్రత్యేక కమిషనర్, కార్యదర్శి వి.రామకృష్ణ స్పష్టం చేశారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్స్ నిర్వహణపై జనవరి 27 (సోమవారం)నగుంటూరులోని ఏసీ కళాశాలలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, సైన్స్, ఒకేషనల్ అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామకృష్ణ మాట్లాడుతూ ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణకు రాష్ట్రంలోని వివిధ కళాశాలలను తనిఖీ చేయగా, కొన్ని క్యాంపస్‌లలో సరైన లేబోరేటరీలు లేవని గుర్తించామని చెప్పారు. ప్రాక్టికల్స్‌ను తూతూ మంత్రంగా నిర్వహించడంలో అలవాటుపడిన కళాశాలల యాజమాన్యాలు ప్రాక్టికల్స్ చేసినా, చేయకున్నా ప్రతి విద్యార్థికీ 30కి 30 మార్కులు వేయించుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాక్టికల్స్ నిర్వహణలో తప్పులకు ఆస్కారమివ్వని విధంగా ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు పరుస్తామని స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు..
ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో విధి నిర్వహణలో ఉన్న చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులు, ఎగ్జామినర్లు, విద్యార్థులు మినహా మరే ఇతర వ్యక్తులను కేంద్రాల్లోకి అనుమతించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. కళాశాలల సిబ్బందితో పాటు ఇతరులెవ్వరినీ అనుమతించేది లేదన్నారు. ప్రశ్నాపత్రాలను ప్రాక్టికల్స్ నిర్ధేశిత సమయానికి చీఫ్ సూపరింటెండెంట్, ఎగ్జామినర్, డీవోల సమక్షంలో తెరిచి విద్యార్థులకు అందజేసేలా పర్యవేక్షణ జరుపుతామని చెప్పారు. ప్రాక్టికల్స్ చేసిన విద్యార్థుల పేపర్లను వాల్యూయేషన్ జరిపిన ఎగ్జామినర్లు వేసిన మార్కులను మరో సారి వాల్యూయేషన్ చేస్తామని, మార్కుల కేటాయింపులో తేడాలుంటే ఎగ్జామినర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాలల ప్రతినిధులు అధికంగా మార్కులు వేయించుకున్నట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు.

ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్
ప్రాక్టికల్స్ నిర్వహణలో జరిగే తప్పిదాలను ఇంటర్‌బోర్డు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరు 1800 2749868, 0866-2974130 నంబర్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే వాట్సాప్ నంబరు 9391282578కు మెసేజ్ పంపాలని తెలిపారు. సమావేశంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌‌స వి.రమేష్, ఆర్జేడీ జె.పద్మ, ఆర్‌ఐవో జెడ్.ఎస్ రామచంద్రరావు, డీవీఈవో కృష్ణయ్య పాల్గొన్నారు.
Published date : 28 Jan 2020 03:00PM

Photo Stories