Skip to main content

లాక్‌డౌన్ ఎత్తేసిన మూడ్రోజుల్లోనే ‘ఇంటర్’ వ్యాల్యుయేషన్ !

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తేసిన మూడ్రోజుల్లో ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏదైనా కారణాలతో ఆలస్యమైతే గరిష్టంగా ఏడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగించాలని పేర్కొంది. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, జిల్లాల ఇంటర్మీడియెట్ విద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జవాబు పత్రాల మూల్యాంకనంపై సమీక్షించారు. మూల్యాంకనానికి 30 రోజుల వరకు సమయం పట్టనున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తేయగానే వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతమున్న 12 స్పాట్ కేంద్రాలతోపాటు వాటికి సమీపంలోని మరో 24 భవనాల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాల్లో తగిన శానిటైజేషన్ ఏర్పాట్లు చేయాలని, పేపరు వ్యాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్లు భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశించారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఎగ్జామినర్లు అక్కడే ఉండేలా వసతి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఒక్కో భవనంలో ఉండే ఎగ్జామినర్లకు వంట చేసేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంసెట్, జేఈఈ, నీట్ కోసం ఉచితంగా వీడియో పాఠాలను అందించేందుకు బోర్డు చేసిన ఏర్పాట్లను చిత్రా రామ చంద్రన్ అభినందించారు. ఈ పాఠాల కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Published date : 22 Apr 2020 04:15PM

Photo Stories