జూన్ 8వ తేదీన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు !
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 8న విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది.
వాస్తవానికి జూన్ 10న ఫలితాలను విడుదల చేయాలని భావించినప్పటికీ అదే రోజు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసేందుకు ఐఐటీ కాన్పూర్ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ముందుగానే ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది. అయితే 8న ద్వితీయ సంవత్సర ఫలితాలను మాత్రమే విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. వీలైతే ప్రథమ సంవత్సర ఫలితాలనూ అదే రోజున విడుదల చేయనుంది. లేదంటే ఆ తర్వాత 2, 3 రోజులకు వాటిని విడుదల చేయాలని భావిస్తోంది. మే 14 నుంచి 28 వరకు 819 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,20,549 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో ఇంప్రూవ్‌మెంట్ కోసం 1,25,960 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 2,68,753 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 1,51,796 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Published date : 05 Jun 2018 03:10PM