Skip to main content

ఇంటర్మీడియట్‌ ఫ‌లితాల్లో బాలికల హవా

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్-2018 సెకండియర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. ఉత్తీర్ణతలోనే కాకుండా ర్యాంకుల్లోనూ బాలురకన్నా బాలికలే పైచేయి సాధించారు.
ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను రాజమండ్రిలో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏప్రిల్ 12న విడుదల చేశారు. ఈ ఏడాది 4,41,359 మంది పరీక్షలకు హాజరు కాగా అందులో 3,23,645 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 73.33 శాతం మంది ఉత్తీర్ణులు అయినట్లు మంత్రి ప్రకటించారు. 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నెల్లూరు 77 శాతంతో రెండో స్థానంలో ఉండగా, గుంటూరు జిల్లా 76 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. వీరిలో బాలికలు 2,22,423 మందికి గాను 1,71,454 (77శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,18,936 మందికి గాను 1,52,191 (70 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుల్లోనూ బాలికలు మరింత పురోగతి కనబర్చారు. వొకేషనల్‌లో మొత్తం 29,273 మందికి గాను 19,645 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 14,647 మందికి గాను 10,753 (73 శాతం) మంది ఉత్తీర్ణులుకాగా బాలురు 14,626 మందికిగాను 8,892 (61 శాతం) మంది మాత్రమే పాసయ్యారు.

ర్యాంకుల్లోనూ బాలికలే..
ర్యాంకుల సాధనలోనూ బాలికలే ముందంజలో నిలిచారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల వారీగా టాప్10 స్థానాల్లో నిలిచిన వారి జాబితాను ఇంటర్మీడియట్‌బోర్డు ప్రకటించింది. ఆయా గ్రూపులన్నిటిలో కలిపి టాప్10 ర్యాంకులు సాధించిన 50 మందిలో బాలురు 11 మంది మాత్రమే ఉండగా తక్కిన 39 ర్యాంకులనూ బాలికలే సాధించారు. అయిదు గ్రూపుల్లో టాప్1 ర్యాంకుల వివరాల్లోకెళ్తే.. బాలికలకు మూడింటిలో, బాలురకు రెండింటిలో దక్కాయి. ర్యాంకుల్లో సమానమార్కులు అత్యధిక శాతం మందికి వచ్చాయి. ఎంపీసీలో ఒకటో ర్యాంకు అభ్యర్థికి 992 మార్కులు రాగా రెండో ర్యాంకు విద్యార్థికి 991 వచ్చాయి. తక్కిన 8 స్థానాల్లో నిలిచిన వారందరికీ సమానంగా 990 మార్కులు వచ్చాయి. బైపీసీలో మొదటి నలుగురికి 990 రాగా, తక్కిన స్థానాల్లోని వారికి 989 మార్కులు లభించాయి. మిగతా గ్రూపుల్లోనూ మార్కుల వ్యత్యాసం చాలా స్వల్పంగా కనిపించింది.

ఆయా గ్రూపుల్లో మొదటి
మూడుస్థానాలు పొందిన అభ్యర్థులు

గ్రూపు

పేరు

మార్కులు

ఎంపీసీ

కున్నం తేజవర్ధనరెడ్డి

992

--

అఫ్రీన్ షేక్

991

--

వాయలపల్లి సుష్మ

990

బైపీసీ

ముక్కు దీక్షిత

990

--

నారపనేని లక్ష్మీకీర్తి

990

--

కురుబ షిన్యథ

990

ఎంఈసీ

పోపూరి నిషాంత్ కృష్ణ

982

--

డి.మీనా

981

--

జి.నాగవెంకట అభిషేక్

981

సీఈసీ

కాదంబరి గీత

968

--

ఎ.సెల్వరాజ్ ప్రియ

966

--

కాసా శ్రీరాం

964

హెచ్‌ఈసీ

ముద్ద గీత

966

--

బొమ్మిడి లావణ్య

952

--

పప్పు సత్యనారాయణ

949

Published date : 14 Apr 2018 11:27AM

Photo Stories