ఇంటర్ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ ఫిర్యాదుల విధానం: సీఎస్ సోమేశ్‌కుమార్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో సమస్యలు వచ్చినా, ఫలితాలకు సంబంధించిన ఏమైనా పొరపాట్లు దొర్లినా, విద్యార్థులకు ఎదురయ్యే ఏ ఇతర సమస్యలకు సంబంధించి అయినా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
గత పరీక్షల సమయంలో దొర్లిన తప్పులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో ఇంటర్మీడియట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో చేసే ఫిర్యాదును నిర్ణీత సమయంలో పరిష్కరించేలా, దానికి సంబంధించిన సమాచారాన్ని సదరు విద్యార్థి మొబైల్ నెంబరుకు/ఈమెయిల్ ఐడీకి పంపించేలా ఇందులో ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులెవరూ ఇంటర్మీడియట్ బోర్డుకు రావాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఈ విధానాన్ని మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభిస్తారని తెలిపారు.
Published date : 07 Jan 2020 02:15PM