Skip to main content

ఇంటర్ వార్షిక పరీక్షలకు జాగ్రత్తలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమవు తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 1,291 కేంద్రాల్లో మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు జరిగే పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. దీంతో విద్యార్థులు సాధ్యమైనంత ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. మొత్తంగా ఈ పరీక్షలకు 9,76,631 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపింది.

హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అక్కర్లేదు :
కాలేజీల యాజమాన్యాలు హాల్‌టికెట్లను నిరాకరిస్తే విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తమ వెబ్‌సైట్ (bietelangana.cgg.gov.in లేదా tsbie.cgg.gov.in) నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని ఇంటర్ బోర్డు సూచించింది. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక హాల్‌టికెట్లను నిరాకరించే యాజమాన్యాలపై ఫిర్యాదు చేయాలని, కఠిన చర్యలు చేపడతామని వెల్లడించింది.

విద్యార్థులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
  1. హాల్‌టికెట్లలోని వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి మార్పు చేయించుకోవాలి.
  2. ఓఎంఆర్ బార్‌కోడ్‌లో పేరు, హాల్‌టికెట్ నంబర్, మీడియం వివరాలు సరిచూసుకోవాలి.
  3. పరీక్ష హాల్‌లో ఇచ్చే జవాబుల బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉన్నాయా, లేదా చూసుకోవాలి. వేరుగా అడిషనల్ షీట్స్ ఇవ్వరు.
  4. కొత్త సిలబస్, పాత సిలబస్‌ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంగ్లిషు, ద్వితీయ భాష తెలుగు-2, మోడర్న్ లాంగ్వేజ్ తెలుగు-2, ఉర్దూ-2 పేపర్ల విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. వొకేషనల్ కోర్సుల్లో ఇంగ్లిషు-1, 2, బ్రిడ్జి కోర్సు 1, 2లలో ఈ మార్పులను పరిశీలించాలి.
  5. మొదటిసారి పరీక్షలు రాసే వారంతా కొత్త సిలబస్ ప్రశ్నపత్రంతోనే రాయాలి.
  6. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఏ రూట్ పాస్ ఉన్నా ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తారు.
  7. పరీక్ష కేంద్రం వద్దకు చేరుకునేందుకు ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్ ను వినియోగించుకోవచ్చు.
  8. సెల్‌ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లొద్దు.
Published date : 01 Mar 2017 01:51PM

Photo Stories