ఇంటర్ సిలబస్ 30 శాతం కుదింపు: ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు
Sakshi Education
సాక్షి, అమరావతి: కోవిడ్-19 నేపథ్యంలో విద్యాసంవత్సరంలో కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతో ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర కుదించింది.
ఈ మేరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కుదించిన సిలబస్ సమాచారాన్ని బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబంధించి బోధనాంశాలు ఏవి? కుదింపు అంశాలు ఏవో వివరిస్తూ పాఠ్యాంశాల వారీగా వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది. లాంగ్వేజ్‌లకు సంబంధించి కూడా ఒకటి రెండు రోజుల్లో వివరాలు అప్‌లోడ్ చేయనున్నారు. కోవిడ్-19 కారణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే బాటలో ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్ కుదింపు చర్యలు చేపట్టింది. ఇలా ఉండగా, ఇంటర్మీడియెట్ 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఆయా అభ్యర్థుల తాజా మార్కులతో కూడిన షార్ట్ మార్కుల మెమోలను కూడా బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
Published date : 17 Aug 2020 01:06PM