Skip to main content

ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సూచనలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిబ్రవరి 27 (బుధవారం) నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
మార్చి 16 వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. మొత్తం 9,42,719 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,550 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,277 పరీక్ష కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటుచేసింది. వీటిలో 1,277 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,277 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 24,508 మంది ఇన్విజిలేటర్లను నియమించింది. 1,277 పరీక్ష కేంద్రాల్లో 40 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 32 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బోర్డు నిర్ణయించింది. పరీక్షలు పూర్తయ్యే వరకు సిట్టింగ్ స్క్వాడ్‌‌స అక్కడే ఉంటాయి. అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాల బండిల్స్ విప్పే చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాల నిఘా ఉంచనుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా నిమిషం నిబంధన అమలుచేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కె.అశోక్ తెలిపారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 8:45 గంటలకల్లా పరీక్ష హాల్లోకి చేరుకో వాలని పేర్కొన్నారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టంచేశారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఇందుకోసం సెంటర్ లొకేటర్ మొబైల్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. అందులో పరీక్ష కేంద్రం ఫొటోతో పాటు గూగు ల్ రూట్ మ్యాప్ ఉంటుందని వివరించారు.

వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు..
హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే కాలేజీలకు పంపించింది. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడంలేదన్న ఫిర్యాదుల నేఫథ్యంలో వెబ్‌సైట్లోనూ హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. bie.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని నేరుగా పరీక్షకు వెళ్లవచ్చని, దానిపై ఎవరి సంతకం అవసరం లేదని అశోక్ తెలిపారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులపాలు చేసే కాలేజీలపై చర్యలు చేపడతామని హెచ్చరించారు.

విద్యార్థులూ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
  • హాల్‌టికెట్ లేకుండా పరీక్షకు అనుమతించరు. హాల్‌టికెట్లలో పొరపాట్లు ఉంటే మాత్రం సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా జిల్లా ఇంటర్ విద్యా అధికారిని సంప్రదించాలి.
  • జవాబు పత్రంలో 24 పేజీలు ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. బార్‌కోడ్, సబ్జెక్టు వివరాలను కూడా సరిచూసుకోవాలి.
  • మొబైల్స్, పేజర్లు, కాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, పేపర్లు పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఒకవేళ వాటిని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్తే మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేస్తారు.
  • కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్, ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు.
  • పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తారు.
  • పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తితే హైదరాబాద్‌లోని హెల్ప్‌లైన్ కేంద్రానికి (040-24601010, 040-24732369) ఫోన్ చేయవచ్చు.
Published date : 26 Feb 2019 02:52PM

Photo Stories