Skip to main content

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 1,294 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఫిబ్రవరి 24న మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇంటర్ పరీక్షలు 28న ప్రారంభమై మార్చి 14న ముగుస్తాయని.. రోజూ ఉదయం 8.45 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌లో భాగంగా 9 గంటల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని.. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా సమయం కంటే ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీటి వసతి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని.. పరీక్ష వేళల్లో కరెంటు కోతలు లేకుండా విద్యుత్ శాఖ అధికారులతో చర్చించామని తెలిపారు. ప్రతి పరీక్షాకేంద్రంలో మెడికల్ అసిస్టెంట్లను నియమించామన్నారు. పరీక్ష నిర్వహణను పరిశీలించేందుకు, మాల్ ప్రాక్టీస్ జరగకుండా విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సీసీ కెమెరాలతో నిఘా..
పరీక్షల నిర్వహణ పక్కాగా జరిగేందుకు ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అశోక్ తెలిపారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని చెప్పారు. సెల్‌ఫోన్ జామర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక పరీక్షా కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు జీపీఎస్‌తో పనిచేసే ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని.. విద్యార్థులు అందులో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే పరీక్షా కేంద్రానికి సులభంగా దారి తెలుసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, వాటి చుట్టూ కిలోమీటర్ దూరం వరకు జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు పంపిణీ చేశామని.. హాల్‌టికెట్లు అందనివారు ఈ నెల 26 నుంచి వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లవచ్చని, ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని చెప్పారు. పరీక్షల సమాచారం, సందేహాల నివృత్తి కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. 040-24601010, 040-24732369 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
మొత్తం విద్యార్థులు: 9,63,546
ఫస్టియర్ విద్యార్థులు: 4,55,635
సెకండియర్ విద్యార్థులు: 5,07,911
పరీక్షా కేంద్రాలు: 1,294 (ప్రభుత్వ సంస్థల్లో 527, ప్రైవేటు సంస్థల్లో 767)
ఇన్విజిలేటర్లు: 25,395 మంది
ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు: 50
సిట్టింగ్ స్క్వాడ్‌లు: 200
Published date : 26 Feb 2018 02:47PM

Photo Stories