Skip to main content

ఇంటర్ గ్రేడింగ్‌లో గోల్‌మాల్

సాక్షి, అమరావతి:ఇంటర్ పరీక్షల్లో మార్కుల స్థానంలో గ్రేడింగ్ పద్ధతి ప్రవేశ పెడుతున్నట్లు గత ఏడాది ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతలోనే అందులో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ముందుగా ప్రకటించిన 8 గ్రేడ్ పాయింట్లను 14కు పెంచినట్లు సమాచారం. నారాయణ, శ్రీచైతన్య తదితర కార్పొరేట్ కాలేజీల్లో అత్యధిక మార్కుల కోసం యాజమాన్యాల ఒత్తిడితో, విశ్రాంతిలేని చదువులతో వందలాది మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని బోర్డు ప్రకటించింది. 2017-18 బ్యాచ్ నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు, ఇతర అధికారులకు బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఈ ఏడాది మార్చిలో 8 గ్రేడ్ల సర్క్యులర్‌ను పంపించారు. దీని ప్రకారం 91 నుంచి 100 శాతం మార్కులు సాధించిన వారు ఏ1 గ్రేడ్‌లోకి వస్తారు. అలా పది చొప్పున పాయింట్లతో తరువాతి గ్రేడ్‌లను రూపొందించారు. కార్పొరేట్ సంస్థల్లోని వారికే కాకుండా ప్రభుత్వ, గ్రామీణ ప్రాంత ప్రయివేటు కాలేజీల విద్యార్ధులకూ ఈ గ్రేడ్ పాయింట్ల వల్ల లాభం చేకూరుతుంది. అయితే ఇంటర్ పరీక్షలు ముగిసి మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెల్లడించాల్సిన తరుణంలో ప్రభుత్వంలోని ముఖ్యులు గ్రేడింగ్ విధానంలో మార్పులు చేయించారు. గ్రేడ్ పాయింట్లను 8కి బదులు 14కి పెంచేలా ఇంటర్మీడియెట్ బోర్డు ద్వారా నివేదికను రూపొందించారు. 96 నుంచి 100 శాతం మార్కులు వస్తే ఏ1 గ్రేడ్‌గా మార్పు చేశారు. ఇలా 14 గ్రేడ్‌లుగా మార్చారు. దీన్ని అధికారికంగా ప్రకటించకుండా ఉంచారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇంటర్మీడియెట్ విద్యపై ఇటీవల వచ్చిన చర్చ సందర్భంగా బోర్డు అధికారులు ఈ నివేదికను అసెంబ్లీకి సమర్పించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది.

కార్పొరేట్‌లకు మేలు చేసేలా ప్రణాళిక :
గ్రేడింగ్‌లో మార్పులు చేయడం ద్వారా కేవలం ఏ1 గ్రేడ్‌లన్నీ కార్పొరేట్ కాలేజీలకే దక్కేలా ప్రభుత్వ పెద్దలు కుట్రపన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వనరులు అందుబాటులో ఉండే కార్పొరేట్ విద్యార్ధులతో ప్రభుత్వ, గ్రామీణ ప్రాంత విద్యార్ధులు పోటీపడడం కష్టం. ముందుగా రూపొందించిన విధానంలో 91 కి పైగా మార్కులు సాధించినా ఏ1 గ్రేడ్‌కు అవకాశం కలిగేది. కొత్త విధానంలో 96కి పైగా మార్కులు సాధించే వారికే ఏ1 గ్రేడ్ వస్తుంది. కేవలం కార్పొరేట్ సంస్థలకే ఏ1 గ్రేడ్‌లు దక్కేందుకు ఇలా మార్పులు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అగ్రశ్రేణి గ్రేడుల సాధనలో వెనుకబడే ప్రభుత్వ, ఎయిడెడ్, గ్రామీణ ప్రాంత కాలేజీలను నిర్వీర్యపరిచి కార్పొరేట్‌కు ప్రోత్సాహం అందించేందుకు ఇలా చేసినట్లు కనిపిస్తోంది. మరోపక్క మార్కుల ఈ విధానం వల్ల విద్యార్ధులు ఒక్క మార్కు తక్కువ వచ్చినా నష్టపోతామన్న ఆందోళనతో మానసిక ఒత్తిడికి గురవుతారు. పైగా మేథ్స్, ఫిజిక్సు, కెమిస్ట్రీ సబ్జెక్టులు మినహా ఇతర కొన్ని సబ్జెక్టుల్లో 96 మార్కులకు పైగా రావని, ఇది విద్యార్ధులను ముందునుంచే మానసికంగా మరింత కుంగదీస్తుందని చెబుతున్నారు.

ఇంటర్మీడియెట్ బోర్డు తొలుత నిర్ణయించిన, తరువాత మార్పులు చేసిన గ్రేడ్ విధానం ఇలా... (మార్కులు శాతం)

తొలుత

మార్పుతరువాత

మార్కులు

గ్రేడ్

మార్కులు

గ్రేడ్

91-100

ఏ1

96-100

ఏ1

81-90

ఏ2

91-95

ఏ2

71-80

బీ1

86-90

ఏ3

61-70

బీ2

81-85

బీ1

51-60

సీ1

76-80

బీ2

41-50

సీ2

71-75

బీ3

35-40

డీ1

66-70

సీ1

0-34

ఎఫ్(ఫెయిల్)

61-65

సీ2

--

--

56-60

సీ3

--

--

51-55

డీ1

--

--

46-50

డీ2

--

--

41-45

డీ3

--

--

36-40

ఈ1

--

--

0-35

ఎఫ్ (ఫెయిల్)

Published date : 06 Apr 2018 01:40PM

Photo Stories