హైస్కూళ్లను జూనియర్ కాలేజీల స్థాయికి పెంచండి: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
Sakshi Education
సాక్షి, అమరావతి: విద్యారంగంలో సంస్కరణలపై ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అక్టోబర్ 29ననివేదిక సమర్పించింది. విద్యారంగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ఇందుకోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.
బోధనా నైపుణ్యాన్ని మెరుగుపర్చాలని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు 49.28 శాతమే మాత్రమే ఉందని.. దీన్ని పెంచాల్సిన అవసరముందని వివరించింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పారదర్శకత లేదని, నియంత్రణ లేదని తెలిపింది. ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు మెరుగుపడాలని స్పష్టం చేసింది. విద్యారంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించింది. అమ్మ ఒడి, విద్యా నవరత్నాల కార్యక్రమాలను శ్లాఘించింది. పాఠశాల, ఉన్నత విద్యారంగాలపై నియంత్రణ, పర్యవేక్షణలకు కమిషన్ల ఏర్పాటు మంచి నిర్ణయమని సమర్థించింది. కంటి వెలుగు, పాఠ్య ప్రణాళిక మార్పు, పదో తరగతి పరీక్షల్లో సంస్కరణలు, విద్యా హక్కు చట్టం అమలును కొనియాడింది.
కమిటీ సిఫార్సుల్లో ముఖ్యమైనవి కొన్ని..
కమిటీ సిఫార్సుల్లో ముఖ్యమైనవి కొన్ని..
- 6 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలందరూ పాఠశాలలో చదువుకునేలా చేయాలి
- స్టూడెంట్ లెర్నింగ్ అవుట్ కం ఏటా 8 శాతం పెరిగేలా చూడాలి. దానిపై థర్డ్ పార్టీ నిర్థారణ జరగాలి
- ఏ విద్యార్థీ డ్రాప్ అవుట్ కాకూడదు. విద్యార్థుల్లో నూటికి నూరు శాతం పదో తరగతి పూర్తి చేయాలి
- పాఠశాలల్లో మౌలిక, డిజిటల్ సదుపాయాలు ఉండాలి
- గిరిజన ప్రాంతాల్లో బడి మానేయకుండా ప్రతి విద్యార్థిపై అసెస్‌మెంట్ ట్రాకింగ్ ఉండాలి
- స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించాలి
- 8వ తరగతి నుంచి వృత్తి విద్య ఉండాలి
- వచ్చే ఏడాది 1 నుంచి 8 వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నందున ఇంగ్లిష్ మీడియంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి
- ఉపాధ్యాయుల నైపుణ్యంపై మదింపు ఉండాలి. వారిలో నైపుణ్యం పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలి
- ఇంటర్ వరకు ఉచిత నిర్భంధ విద్య అమలు చేయాలి
- అన్ని హైస్కూల్స్‌ను జూనియర్ కళాశాలల వరకు అప్‌గ్రేడ్ చేయాలి
- ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ బోర్డుల్ని కలిపి, ఒకే కమిషనర్ పరిధిలోకి తేవాలి
- అన్ని స్కూళ్లలో ఎస్సీఈఆర్టీ సిలబస్ ఉండాలి
- ప్రాథమిక విద్యను ఒకే గొడుగు కింద తీసుకు రావాలి
- అన్ ఎయిడెడ్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు రూపొందించాలి.
- పాథమిక విద్యలో అంతర్గతంగా సమన్వయ మండలి ఉండాలి
- గురుకుల పాఠశాలల నిర్వహణకు ఒక మండలి ఉండాలి
- డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
Published date : 30 Oct 2019 05:42PM