Skip to main content

ఏపీలో ఇంటర్ పరీక్షలకు 10.31 లక్షల మంది

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 10,31,285 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
మార్చి 1 నుంచి 18 వరకు జరిగే ఈ పరీక్షలకు ఇంటర్మీడియెట్ విద్యా మండలి అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఇంటర్ ఫస్టియర్‌లో 5,23,099 మంది, సెకండియర్ లో 5,08,186 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 1,445 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా అందులో 124 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇంటర్ విద్యార్ధులకు కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్’ పరీక్ష ఈ నెల 28న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఈ నెల 31న జరగనున్నాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షల్లో ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరిగే ప్రాక్టికల్స్‌కు 977 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 435 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 113 ఎయిడెడ్, 429 ప్రైవేటు జూనియర్ కాలేజీలున్నాయి. ప్రాక్టికల్స్‌కు 3,20,674 మంది హాజరవుతారు.

పకడ్బందీ ఏర్పాట్లు :
పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి కోసం కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. 1,445 పరీక్ష కేంద్రాల్లో 524 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 148 ఎయిడెడ్ కాలేజీలు, 773 ప్రైవేటు కాలేజీలున్నాయి. ఏజెన్సీ సహా అన్ని ప్రాంతాల్లో ఈ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు బోర్డు కార్యదర్శి బి. ఉదయలక్ష్మి చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా హైపవర్ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్ధాయిలో పరీక్ష నిర్వహణ కమిటీలు ఏర్పాటయ్యాయి. 35 సున్నిత, సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు విభాగాల తో కలసి ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల సమయంలో ఆర్టీసీ బస్సులను నడిపేలా ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించారు.

విద్యార్ధులకు సూచనలు..
విద్యార్ధులు తమ హాల్‌టికెట్లపై పేర్లు, మాధ్యమం, సబ్జెక్టు, తదితర సమాచారం సరిగా ఉందో లేదో చూసుకొని తప్పులుంటే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్స్ ద్వారా ముందే సరిచేయించుకోవాలని బోర్డు సూచించింది. హాల్ టికెట్లు లేకుండా పరీక్ష హాల్లోకి అనుమతించబోరు. 30 నిమిషాలు ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. పరీక్ష ప్రారంభం తరువాత ఎవరినీ లోపలికి అనుమతించబోరు.సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
Published date : 27 Jan 2017 04:20PM

Photo Stories