ఏపీ ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలకు తాత్కాలిక బ్రేక్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఆన్‌లైన్ ప్రవేశాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది.
ఈ నెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్ ప్రవేశాలను నిలిపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రవేశాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ ఎయిడెడ్ ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ కోర్సు ప్రవేశాలను ఆన్‌లైన్ ద్వారా చేపట్టాలంటూ ఇంటర్‌బోర్డు కార్యదర్శి జారీ చేసిన ప్రెస్‌నోట్‌ను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ వెంకటరమణ విచారణ జరిపారు.
Published date : 03 Nov 2020 04:28PM