Skip to main content

డిసెంబర్ 1 నుంచి జేఈఈ మెయిన్ దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో (సీఎఫ్‌టీఐ) 2017-18 విద్యా సంవత్సరం ప్రవేశాలకు జేఈఈ మెయిన్-2017 ప్రవేశ పరీక్ష నోటీసును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) శుక్రవారం విడుదల చేసింది.
జేఈఈ మెయిన్-2017 వెబ్‌సైట్‌ను (jeemain.nic.in)అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 1 నుంచి జనవరి 2 వరకు విద్యార్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, జనవరి 3 వరకు ఫీజు చెల్లించొచ్చని వివరించింది. అయితే ఈ సారి దరఖాస్తుల్లో విద్యార్థుల ఆధార్ నంబరు నమోదు సీబీఎస్‌ఈ తప్పనిసరి చేసింది. దరఖాస్తుల సమయంలో ఆధార్ నంబరు, పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలను ఆధార్‌లో ఉన్న ప్రకారం నమోదు చేయాలని, ఆ వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వద్ద ఉన్న వివరాలతో సరిపోల్చి చూస్తామని పేర్కొంది. వివరాలు సరిగా లేకపోతే సదరు విద్యార్థి జేఈఈ దరఖాస్తు నింపే అవకాశముండదని..కాబట్టి పేరు, పుట్టిన తేదీ, జెండర్ తదితర వివరాలను స్కూలు రికార్డుల ప్రకారం ఆధార్‌లో సరి చేసుకోవాలని సూచించింది. బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ రాత పరీక్షను 2017 ఏప్రిల్ 2వ తేదీన (ఆఫ్‌లైన్‌లో పేపరు-1), ఆన్‌లైన్ పరీక్షలను అదే నెల 8, 9 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. బీఆర్క్/ బీప్లానింగ్‌లో చేరాలనుకునే వారు ఆఫ్‌లైన్‌లో 2017 ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించే పేపరు-2 పరీక్షకు హాజరుకావాలని సూచించింది. ఈ పరీక్ష ఫలితాలను అదే నెల 27న విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఈసారి రెండు మార్పులు :
జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారులో మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈసారి రెండు మార్పులు చేసిందని సీబీఎస్‌ఈ తెలిపింది. జేఈఈ మెరుున్ తుది ర్యాంకు ఖరారులో ఇన్నాళ్లు ఇచ్చిన ఇంటర్మీడియెట్ మార్కుల 40 శాతం వెయిటేజీని ఇకపై ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, సీఎఫ్‌టీఐలలో ప్రవేశాలను జేఈఈ ర్యాంకుల (మార్కుల) ఆధారంగా చేపడతామని పేర్కొంది. ఐఐటీల్లో ప్రవేశాలు మాత్రం జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ఆధారంగా ఉంటాయని వెల్లడించింది. అయితే విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు సాధించాలని, లేదా సంబంధిత బోర్డు నుంచి పరీక్షలు రాసిన వారిలో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలని వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇంటర్‌లో 65 శాతం మార్కులు సాధించి ఉంటే చాలని, జేఈఈ ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ కు కూడా ఇదే వర్తిస్తుందని పేర్కొంది.

జేఈఈ ఆధారంగా రాష్ట్రాల్లో ప్రవేశాలు :
ఈసారి గుజరాత్, మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఒడిషాతో మరిన్ని రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపట్టేందుకు ముందుకు వచ్చాయని సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో సీటు కావాలనుకునే విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరు కావాలని పేర్కొంది. ఐఐటీల్లో చేరాలనుకునే వారు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు ముందుగా జేఈఈ మెయిన్ రాయాలని వెల్లడించింది.

డిసెంబర్ 1 నుంచి అందుబాటులో సిలబస్ :
జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను డిసెంబర్ 1 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని సీబీఎస్‌ఈ వెల్లడించింది. పరీక్ష వివరాలు, సిలబస్, అర్హత విధానం, పరీక్ష ఫీజు, పరీక్ష కేంద్రాల పట్టణాలు, వయో పరిమితి మినహాయింపు, ప్రవేశాలకు అర్హతలు, రిజర్వేషన్ విధానం వివరాలను విద్యార్థులు డిసెంబర్ 1 నుంచి పొందవచ్చని వివరించింది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను 2017 మే 21న నిర్వహిస్తామని నిర్వహణ సంస్థ ఐఐటీ మద్రాసు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం 2017 ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. మే 21న రాత పరీక్ష నిర్వహించి జూన్ 11వ తేదీన ఫలితాలను వెల్లడించనుంది.
Published date : 19 Nov 2016 01:58PM

Photo Stories