అర్హులైన ఫ్యాకల్టీ లేకుంటే అనుమతి ఇవ్వం: ఇంటర్మీడియట్ బోర్డు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అర్హులైన బోధన, బోధనేతర సిబ్బంది లేకుంటే 2020-21 విద్యా సంవత్సరం అఫిలియేషన్ ఇచ్చేది లేదని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
లాక్‌డౌన్, అనంతర పరిస్థితుల నేపథ్యంలో చాలా కాలేజీలు బోధన, బోధనేతర సిబ్బందిని తొలగించినట్లు, పలుచోట్ల వేతనాలు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు బోర్డుకు వెల్లువెత్తాయని వెల్లడించింది. వీటిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని పేర్కొంటూ అర్హులైన బోధన, బోధనేతర సిబ్బంది లేని కాలేజీలకు 2020-21 సంవత్సరం తాత్కాలిక గుర్తింపు రద్దు చేయనున్నట్లు హెచ్చరించింది. అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో బోర్డు ద్వారా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ తనిఖీల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తిస్తే ఆయా యాజమాన్యాలపై ఎపిడమిక్ డిసీజ్ యాక్టు-1897 ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.
Published date : 12 Sep 2020 01:41PM