‘ఆధార్’ ఐడీతోనూ జేఈఈ దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ దరఖాస్తుల సమయంలో విద్యార్థుల దగ్గర ఆధార్ నంబర్ లేకపోతే వెంటనే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సూచించింది.
వచ్చే నెల 1 నుంచి ప్రారంభం అయ్యే జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో విద్యార్థులు ఆధార్ నంబర్‌ను తీసుకోవాలని, లేని వారు ఆధార్ వెబ్‌సైట్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థులు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేసుకునేందుకు జేఈఈ పరీక్ష కేంద్రాలుండే పట్టణాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రాల్లో ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవచ్చని తెలిపింది. తమ సహాయక కేంద్రాల్లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సదుపాయం లేకపోతే విద్యార్థులు అక్కడే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకున్న వారికి సహాయక కేంద్రం రిజిస్ట్రేషన్ నంబర్ జారీ చేస్తుందని, ఆ నంబర్‌ను ఎంటర్ చేసి జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. జేఈఈ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేనాటికి ఆధార్ నంబర్ రాకపోతే (అప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు) ఆధార్ కోసం దరఖాస్తు చేసినపుడు విద్యార్థికి వచ్చే ఎన్‌రోల్‌మెంట్ స్లిప్‌లో ఉండే 28 నంబర్ల ఎన్‌రోల్‌మెంట్ ద్వారా జేఈఈకి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ అవ కాశం జమ్మూ కశ్మీర్, అసోం, మేఘాలయ మినహా అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని వివరించింది.
Published date : 25 Nov 2016 01:41PM