Skip to main content

ఆ 109 ఇంటర్ కాలేజీలకు అనుమతులివ్వం : అశోక్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 109 జూనియర్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు.
ఇంటర్ బోర్డు కార్యాలయంలో జూన్ 13న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకుంటే సమీపంలో గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేర్పించే బాధ్యత సదరు యాజమాన్యానిదేనని ఆయన స్పష్టం చేశారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కాలేజీ అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,698 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిల్లో ఇప్పటివరకు 1,313 కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మిగతా 385 కాలేజీలకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. వాటిల్లో 109 కాలేజీలు దరఖాస్తులకు సంబంధించి ఫీజులే చెల్లించలేదని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించకపోవడం, అవసరమైన దస్త్రాలు ఇవ్వకపోవడంతో వాటికి ఈ విద్యా సంవత్సరంలో గుర్తింపు ఇచ్చే ప్రసక్తే లేదని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఒక్క ఇంటర్ కాలేజీకీ హాస్టల్ నిర్వహించే అనుమతి లేదని స్పష్టం చేశారు. కాలేజీల గుర్తింపు కోసం దరఖాస్తు గడువును పలుమార్లు పెంచడంపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వ సూచనతోనే గడువును జూన్ 20 వరకు పెంచినట్లు చెప్పారు. కాలేజీ యాజమాన్యాల సంఘాలు ప్రభుత్వాన్ని కోరడంతోనే గడువు పొడిగించామని వెల్లడించారు.

వెబ్‌సైట్‌లో కాలేజీల వివరాలు..
గుర్తింపునకు అర్హతలేని కాలేజీల వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. జూన్ 20 వరకు గుర్తింపు గడువు ఉన్నందున జూన్ 21 నాటికి వెబ్‌సైట్‌లో అర్హత పొందిన, అర్హత పొందని కాలేజీల వివరాలు అందుబాటులో ఉంచుతామన్నారు. కాలేజీల గుర్తింపు ప్రక్రియ ఆన్‌లైన్ చేయడంతో అవకతవకలు జరిగే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు స్పందన పెరిగిందని, ఇప్పటివరకు 33,481 మంది అడ్మిషన్లు తీసుకున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ జూలై వరకు ఉందని, గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Published date : 14 Jun 2018 02:47PM

Photo Stories