Skip to main content

ఆర్థిక వ్యవస్థ - జాతీయాదాయం

చక్రీయ ఆదాయ ప్రవాహం
ఆర్థిక వ్యవస్థను అయిదు రంగాల ఆధారంగా పరిశీలించవచ్చు.అవి.. 1. కుటుంబం, 2. సంస్థలు, 3. విత్త సంస్థలు(మూలధన మార్కెట్), 4. ప్రభుత్వం, 5. ఇతర ప్రపంచం. ఈ అయిదు రంగాలు ఉత్పత్తి కార్యకలాపాల్లో నిమగ్నమైనందువల్ల వీటి మధ్య ఆదాయ ప్రవాహం ఉంటుంది. అన్ని ఉత్పత్తి కారకాల యాజమాన్యం కుటుంబ రంగం చేతుల్లో ఉంటుంది. కుటుంబ రంగం ఉత్పత్తి కారకాలను సంస్థల(ప్రభుత్వ, ప్రైవేటు, జాయింట్, స్వదేశీ, విదేశీ)కు సరఫరా చేస్తుంది. ఉత్పత్తి కారకాల సేవలను వినియోగించుకున్నందుకు సంస్థలు ప్రతిఫలాన్ని చెల్లిస్తాయి. ఈ ప్రతిఫలం భాటకం, వేతనం, వడ్డీ, లాభం రూపంలో ఉంటుంది. కుటుంబ రంగానికి చెల్లింపులు, ప్రభుత్వానికి చెల్లించే కార్పొరేషన్ పన్ను, ఇతర పరోక్ష పన్నులతోపాటు విత్త సంస్థల్లో పొదుపును సంస్థలు నిర్వహిస్తాయి.

సంస్థలు స్థూల పెట్టుబడి కోసం విత్త సంస్థల నుంచి నిధులు సమీకరిస్తాయి. సంస్థల నుంచి కార్పొరేషన్ పన్ను, ఇతర పరోక్ష పన్నులు, కుటుంబ రంగం నుంచి వ్యక్తిగత పన్ను రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వం వివిధ మార్గాల్లో పొందిన ఆదాయాన్ని సంస్థల నుంచి వస్తు, సేవల కొనుగోలు కోసం, కుటుంబ రంగానికి బదిలీ చెల్లింపుల రూపంలో కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. కుటుంబ రంగం, సంస్థలు, ప్రభుత్వం విత్త సంస్థల్లో పొదుపు చేస్తాయి. ఈ మూడు రంగాల నుంచి సమీకరించిన ధనాన్ని విత్త సంస్థలు పెట్టుబడి అవసరమైన సంస్థలకు రుణంగా మంజూరు చేస్తాయి. తమ సొంత ఉత్పత్తి సాధనాలకు సంబంధించి సంస్థల నుంచి ఆదాయం పొందడంతో పాటు ప్రభుత్వం, ఇతర దేశాల నుంచి బదిలీ చెల్లింపుల రూపంలో కుటుంబ రంగం ఆదాయం పొందుతుంది. సంస్థల నుంచి వినియోగ వస్తువుల కొనుగోలు కోసం, ప్రభుత్వానికి వ్యక్తిగత పన్ను చెల్లించడానికి, విత్త సంస్థల్లో పొదుపు కోసం కుటుంబ రంగం నుంచి ఆయా రంగాలకు ఆదాయ ప్రవాహం ఉంటుంది. విదేశాలకు ఎగుమతుల ద్వారా, ఇతర దేశాల నుంచి ఉత్పత్తి కారకాల ఆదాయం (ఫ్యాక్టర్ ఇన్‌కమ్), బదిలీ చెల్లింపుల రూపంలో ఆదాయం లభిస్తుంది. దిగుమతులకు ఉత్పత్తి కారకాల ఆదాయం, బదిలీ చెల్లింపుల రూపంలో విదేశీ రంగం ఇతర దేశాలకు చెల్లింపులు చేస్తుంది. ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల మధ్య ఆదాయం ఉత్పత్తి కావడంతోపాటు సర్క్యులేట్ అవుతుంది.

ఉత్పత్తి మొత్తం సంస్థల నుంచే లభిస్తుందని, సంస్థలే పెట్టుబడి కార్యకలాపాలు నిర్వహిస్తాయని, పొదుపు మొత్తం విత్త సంస్థలకు బదలాయింపు అవుతుందనే ప్రమేయాల(అసెంప్షన్స్)కు లోబడి వివిధ రంగాల మధ్య చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని పరిశీలించాలి.
ఆదాయ చక్రీయ ప్రవాహంలో జాతీయాదాయం నుంచి సంభవించే ఉపసంహరణలు(లీకేజెస్) జాతీయ ఉత్పత్తి వ్యయంలో భాగంగా ఉండవు. ఇవి పొదుపు(ఎస్), పన్నులు(టి), దిగుమతులు(ఎం). జాతీయ ఉత్పత్తి వ్యయంలో భాగంగా ఉండే ఇంజెక్షన్స్(ఆదాయ ప్రవాహంలోకి మరింత ఆదాయం చేర్చడం -అడిషన్స్) జాతీయాదాయం నుంచి వచ్చినవి కావు. వీటిని పెట్టుబడి(ఐ), ప్రభుత్వ వ్యయం(జి), ఎగుమతులు(ఎక్స్)గా పేర్కొనవచ్చు. ఇంజెక్షన్స్, లీకేజెస్ మధ్య సంబంధం ఉంటుంది. పెట్టుబడి పాక్షికంగా లేదా పూర్తిగా పొదుపుపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ వ్యయానికి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయమే ఆధారం. ఆర్థిక సమతౌల్య స్థితిని కొనసాగించాలంటే మొత్తం ప్రణాళికాబద్ధమైన లీకేజెస్, మొత్తం ప్రణాళికాబద్ధమైన ఇంజెక్షన్స్(టోటల్ ప్లాన్డ్ ఇంజెక్షన్స్)కు సమానంగా ఉండాలి.
S + T + M = I + G + X
పై సమీకరణం స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థలో మూడు రకాలైన అసమతౌల్యతలను స్పష్టం చేస్తోంది.
1.పెట్టుబడి - పొదుపు అంతరం
2. ద్రవ్యలోటు/మిగులు
3. కరెంట్ అకౌంట్ లోటు/మిగులు
ఈ మూడింటి మొత్తం ‘సున్నా’కు సమానంగా ఉండాలి. భారతదేశంలో పెట్టుబడి ఎల్లప్పుడూ పొదుపు కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం తరచుగా ద్రవ్యలోటును ఎదుర్కొంటోంది. కరెంట్ అకౌంట్ లోటు ద్వారా ద్రవ్యలోటు, పెట్టుబడి-పొదుపు మధ్య అంతరాలను తగ్గించాల్సి ఉంటుంది.

జాతీయాదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు
  1. ఒక ఆర్థిక వ్యవస్థ ప్రగతి జాతీయాదాయ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. జాతీయాదాయ పరిమాణం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
  2. సహజ వనరులు(భూమి, ఖనిజాలు, నదులు, పర్వతాలు, అనుకూల వాతావరణం) అధికంగా లభ్యమయ్యే దేశాల్లో జాతీయాదాయ పరిమాణం ఎక్కువగా ఉంటుంది.
  3. రోడ్లు, కాల్వలు, బ్రిడ్జిలు, రైల్వే, ఫ్యాక్టరీలు అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతమై జాతీయాదాయం పెరుగుతుంది.
  4. ఆధునిక ఆర్థిక వ్యవస్థ ప్రగతికి మూలధనం ప్రధానమైంది. మూలధనం నాణ్యత, పరిమాణంపై ఉత్పత్తి పరిమాణం ఆధారపడి ఉంటుంది. వెనుకబడిన దేశాల్లో మూలధనం కొరత వల్ల తలసరి ఆదాయం తక్కువ.
  5. జాతీయాదాయవృద్ధిని నిర్ణయించే మరో ముఖ్య కారకం మానవాభివృద్ధి. సహజ వనరుల లభ్యత ఉన్నప్పటికీ దేశంలో జనాభా తక్కువగా ఉంటే జాతీయాదాయ పరిమాణం తక్కువగా ఉంటుంది. నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తితోపాటు సామాజిక అంశాలైన విద్య, ఆరోగ్యం, గృహ వసతి, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన తాగునీరు మొదలైనవి మానవాభివృద్ధికి దోహదం చేస్తాయి. తద్వారా ఈ సామాజిక అంశాలు వనరుల అభిలషణీయ వినియోగానికి దారితీసి జాతీయాదాయ వృద్ధికి కారణం అవుతున్నాయి.
  6. సాంకేతిక పరిజ్ఞానం జాతీయాదాయ స్థాయిని నిర్ణయిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో జాతీయాదాయ స్థాయి తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో జాతీయాదాయ వృద్ధిరేటు అధికంగా నమోదవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానం దిగుమతులపై అధిక దేశాలు ఆంక్షలు తొలగించాయి. దీంతో జాతీయాదాయ వృద్ధి వేగవంతమైంది.
  7. పారిశ్రామిక సామర్థ్యం అధికంగా ఉండటం జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. పారిశ్రామికవేత్తల(ఉద్యమదారుల) సామర్థ్యం అధికంగా ఉన్న దేశాల్లో వనరుల అభిలషణీయ వినియోగం అధిక జాతీయోత్పత్తికి దారితీస్తుంది. తద్వారా జాతీయాదాయ పరిమాణంలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.
  8. శ్రమ విభజన, ప్రత్యేకీకరణ లాంటి పరిస్థితులు పరిశ్రమల్లో అంతర్గత ఆదాయాల పెరుగుదలకు దారితీస్తాయి. తద్వారా జాతీయోత్పత్తి పెరిగి జాతీయాదాయంలో పెరుగుదల సంభవిస్తుంది.
  9. రాజకీయ స్థిరత్వం ఉన్న దేశాల్లో ఉత్పత్తి అధిక స్థాయిలో జరుగుతుంది. ఈ క్రమంలో జాతీయాదాయంలో పెరుగుదల ఉంటుంది. రాజకీయ స్థిరత్వం లేని దేశాల్లో జాతీయాదాయవృద్ధి తక్కువగా ఉంటుంది.
సేవా రంగ ఆధారిత వృద్ధి
1951 తర్వాత నికర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో పారిశ్రామిక, సేవా రంగాల వాటా పెరుగుతోంది. పారిశ్రామిక రంగంలో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్థిక అవస్థాపనలైన రవాణా, సమాచారం, శక్తి, ఫైనాన్స్ లాంటి రంగాల్లో వృద్ధిరేటు మెరుగైంది. 1980-81లో భారత స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 37.9 శాతం కాగా, సేవా రంగం వాటా 38 శాతంగా నమోదైంది. అదే ఏడాది పారిశ్రామిక రంగం వాటా జీడీపీలో 24 శాతం. 1980వ దశకంలో జీడీపీలో సేవా రంగం వాటా గణనీయంగా పెరిగింది. తొమ్మిదో ప్రణాళికా కాలం(1997 -2002)లో ఆర్థిక వృద్ధి రేటు కేవలం 5.7 శాతమే నమోదయినప్పటికీ సేవా రంగం వృద్ధిలో మాత్రం పెరుగుదల ఏర్పడింది.
ఈ ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధి 2.5 శాతం కాగా, పారిశ్రామిక రంగం వృద్ధి 4.3 శాతంగా నమోదైంది. సేవా రంగంలో 7.9 శాతం వృద్ధి నమోదైంది. 2002-03 తర్వాత సమాచార రంగం(ముఖ్యంగా టెలికాం), వ్యాపార సేవలు(ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఫైనాన్స్ రంగాలు అధిక వృద్ధి కనబర్చాయి. దీంతో సేవా రంగం స్థిరవృద్ధిని నమోదు చేసింది. 2001-2012 మధ్య కాలంలో భారత్‌లో సేవా రంగం సగటు వార్షిక వృద్ధి 9 శాతంగా ఉంది. ఇదే కాలానికి చైనాలో సేవా రంగ వృద్ధి 10.9 శాతం. చైనా తర్వాత సేవా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే. సేవా రంగంలో 2013-14లో 9.1 శాతం, 2014-15లో 10.6 శాతం వృద్ధి నమోదైంది. 2014-15లో ప్రస్తుత ధరల వద్ద ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల కలిపిన విలువలో సేవా రంగం వాటా 52.7 శాతంగా నమోదైంది. ఎకనమిక్ సర్వే 2014 ప్రకారం, 2012లో ప్రపంచ జీడీపీలో సేవా రంగం వాటా 65.9 శాతం కాగా, మొత్తం ఉద్యోగితలో ఈ రంగం వాటా 44 శాతం.

సేవా రంగంలో సమస్యలు
  1. భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాలు సరిపడా లేవు. విద్యుచ్ఛక్తి కొరత, ట్రాఫిక్ లాంటి సమస్యలు భారత సిలికాన్ సిటీగా అభివర్ణించే బెంగళూరులో ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యల వల్ల సేవల నాణ్యత తగ్గుతుంది.
  2. జాతీయాదాయంలో సేవా రంగం వాటా సుమారు 55 శాతంగా ఉన్నప్పటికీ 31 శాతం శ్రామిక శక్తికి మాత్రమే ఈ రంగం ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఈ రంగంలో జరిగే వృద్ధిని ఆర్థికవేత్తలు ఉపాధి రహిత వృద్ధిగా భావిస్తున్నారు.
  3. పర్యాటక రంగంలో భారత్ పొటెన్షియాల్టి(సామర్థిత్వం) అధికం. ఇటీవల కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విదేశీ పర్యాటకులపై జరిగిన దాడుల కారణంగా భవిష్యత్‌లో ఆ ప్రభావం పర్యాటక రంగ అభివృద్ధి నిరోధకంగా మారే అవకాశం ఉంది.
  4. ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టిన అనేక అవస్థాపనా ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. దేశంలో అవస్థాపనా సౌకర్యాల కోసం ప్రైవేట్ రంగానికి అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినా ఆ రంగం నుంచి ఆశించినంతగా పెట్టుబడులు రాలేదు.
  5. ప్రాథమిక, ద్వితీయ రంగాల్లో అధిక వృద్ధి నమోదైతే సేవా రంగ వృద్ధి నిరాటకంగా కొనసాగుతుంది.
  6. భారత్‌లోని సర్వీసు ప్రొవైడర్లు (బీపీవోలు, ఐటీ సర్వీసు ప్రొవైడర్లు) ఇతర దేశాల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
సేవా రంగ వృద్ధిని మెరుగుపర్చాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. ఆరోగ్య సంరక్షణ, టూరిజం, విద్య, ఇంజనీరింగ్, కమ్యూనికేషన్లు, రవాణా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, ఇతర రంగాలకు ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించింది.
  1. పన్ను నిర్మాణతలో భాగంగా ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)కు రెండు రేట్లు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ప్రామాణిక ధరలతో పోల్చినప్పుడు ముఖ్య సేవలపై పన్ను రేటు తక్కువగా ఉంటుంది. సేవల పన్ను పెంచడం వల్ల వినియోగదారులపై పడే ప్రభావాన్ని కొంత మేర తగ్గించడానికి ఈ చర్య ఉపకరిస్తుంది.
  2. ఇప్పటి వరకు మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ లేని గ్రామాల్లో 10 శాతం గ్రామాలకు 2016 డిసెంబర్ నాటికి మొబైల్ నెట్‌వర్క్ ను విస్తరించాలని భావిస్తున్నారు.
  3. క్రెడిట్ / డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్స్‌కు సంబంధించి జరిపే లావాదేవీలకు పన్ను ప్రయోజనాలను ప్రభుత్వం ప్రతిపాదించింది.
  4. అంతర్జాతీయ కార్డులను అనుమతించడానికి ఆర్‌బీఐ థర్‌‌డపార్టీ ‘వైట్ లేబుల్ ఏటీఎం’లను అనుమతించింది.

మాదిరి ప్రశ్నలు

Published date : 28 Oct 2015 02:39PM

Photo Stories